close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టెడ్డీబేర్‌లో గుండెచప్పుడు

ఎవరైనా చనిపోతే వాళ్లకు సంబంధించిన అవయవాలను అవసరమైనవారికి అమర్చడం మామూలే. అలా గుండెను దానంగా పొందిన ఒకతను ఆ గుండెచప్పుడును రికార్డు చేసి  గుండెదాత తండ్రికి పంపించాడట. అసలేం జరిగిందంటే... జాన్‌ రీయిడ్‌ది అమెరికా. అతని పదహారేళ్ల కొడుకు రీయిడ్‌ కిందటేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దాంతో అతని గుండెను మసాచుసెట్స్‌కి చెందిన రాబర్డ్‌ ఓ కన్నర్‌ అనే అతడికి అమర్చారట. పూర్తిగా కోలుకున్న తరువాత తన గుండె చప్పుడును రికార్డు చేసి, దాన్ని టెడ్డీబేర్‌లో అమర్చి, ఆ బొమ్మపైన ‘బెస్ట్‌ డాడ్‌ ఎవర్‌’ అని రాయించి.... రీయిడ్‌ తల్లిదండ్రులకు పార్శిల్‌ పంపించాడట రాబర్ట్‌. అది విన్న జాన్‌- కొడుకు తన పక్కనే ఉన్నట్లుగా భావించి ఏడ్చేశాడట.


భార్యతో గొడవా... అయితే చాయ్‌ ఫ్రీ

ఏదైనా టీకొట్టుకు వెళ్తే... అక్కడ రకరకాల టీ రుచులూ, వాటి ధరలూ కనిపించడం మామూలే. కానీ మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లోని ‘కాలు బేవఫా చాయ్‌వాలా’ అనే టీకొట్టులో చాయ్‌పేర్లు కాస్త కొత్తగా ఉండటంతో వాటిని చూసినవాళ్లు టీలకు ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా అని అనకుండా ఉండలేకపోతున్నారు. ఎలాగంటే... ‘ప్రేమలో మోసపోయినవారి చాయ్‌’, ‘కొత్త ప్రేమ జంటల చాయ్‌’, ‘ఒంటరితనం చాయ్‌’... తాను అమ్మే టీలకు ఇలా రకరకాల పేర్లు పెట్టడమే కాదు అందుకు తగినట్లుగా వాటి ధరల్నీ నిర్ణయించాడు ఈ చాయ్‌వాలా. ఉదాహరణకు ప్రేమలో మోసపోయిన చాయ్‌ ధర అయిదు రూపాయలయితే, మనసారా ప్రేమ పొందాలనుకునే చాయ్‌ ధర నలభైతొమ్మిదిరూపాయలు అట. ఒకవేళ ఎవరైనా భార్యతో గొడవపడి ఈ టీ కొట్టుకు వస్తే వాళ్లకు మాత్రం ఉచితంగానే టీ ఇస్తాడట. చాయ్‌లను రకరకాల రుచుల్లో ఇచ్చే మాట ఎలా ఉన్నా... ఇలా భిన్నంగా మార్కెటింగ్‌ చేసుకుంటేనే కస్టమర్లు పెరుగుతారనే ఈ టీకొట్టు యజమాని ఆలోచనను ఎవరో సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ‘వాట్‌ యాన్‌ ఐడియా’ అంటూ అందరూ అతడిని తెగ పొగిడేస్తున్నారు. 


పాములతో మసాజ్‌!

ఏదయినా స్పాకు వెళ్తే మంచి వాసన వచ్చే నూనెలూ, ఇతర లేపనాలతో చికిత్స చేసి... అలసిన శరీరానికి సాంత్వన కలిగిస్తారు. కానీ ఈ స్పాలో లేపనాలకు బదులుగా పాములనే చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఒళ్లు జలదరించినా ఇది నిజం. ఈజిప్టులోని ఓ స్పాలో చేసే ఆ చికిత్స పేరే స్నేక్‌ మసాజ్‌. ఈ చికిత్స కోసం వెళ్లేవారికి ముందుగా ఒళ్లంతా నూనె రాసి ఆ తరువాత వీపు, ముఖంపైన రకరకాల సైజుల్లో ఉండే పాముల్ని ఉంచుతారు. అవి మన ఒంటిపైన పాకడం వల్ల కండరాలూ, ఒళ్లు నొప్పులు పోవడమే కాదు, శరీరంలో రక్తప్రసరణ కూడా సజావుగా సాగుతుందట. పైగా ధైర్యంగా ఈ చికిత్స చేయించుకుంటారు కాబట్టి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని అంటున్నారు స్పా నిర్వాహకులు. ఇలా చికిత్సకు వాడే పాముల్లో విషం తీసేస్తారు కాబట్టి భయపడక్కర్లేదనీ చెబుతున్నారు. అరగంటసేపు పాములతో చికిత్స చేయించుకున్నందుకు సుమారు ఆరు డాలర్లు (దాదాపు నాలుగు వందల నలభై రూపాయలు) చెల్లించాలట. 


మాస్కులు పంచిన ఏనుగులు

క్రిస్మస్‌ అనగానే శాంతా తాతయ్య ఇచ్చే కానుకల గురించి ఎదురుచూస్తారు పిల్లలు. కానీ థాయ్‌లాండ్‌లో ఈసారి శాంతా ఇచ్చిన కానుకల్ని ఎవరూ ఊహించకపోయినా... మంచి ప్రయత్నమే అని మెచ్చుకుంటున్నారట. ప్రతిఏటా థాయ్‌లాండ్‌లో క్రిస్మస్‌ సందర్భంగా నాలుగైదు ఏనుగులకు శాంతా వేషాలు వేసి... కొన్ని స్కూళ్ల దగ్గరకు తీసుకెళ్లి ఆ పిల్లలకు రకరకాల కానుకలు ఇవ్వడం అక్కడ ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని పాటించారట కానీ...కానుకలకు బదులుగా పిల్లలకు మాస్కుల్ని పంచారట. స్కూలు వదిలే సమయానికి ఏనుగులు బ్యాంకాక్‌లోని ఓ స్కూలు బయట నిల్చున్నాయట. పిల్లలు స్కూలు నుంచి బయటకు వచ్చాక ఎప్పటిలాగానే కానుకల కోసం ఏనుగులు పట్టుకున్న బుట్టల్లో చేతులు పెడితే మాస్కులు తగిలాయట. వాటిని తీసుకున్న పిల్లలూ, వాళ్ల పెద్దవాళ్లూ కరోనా సమయంలో కానుకలకు బదులుగా ఇలా మాస్కులు ఇవ్వడం మంచి ఆలోచనే అంటున్నారు. దాదాపు పదిహేడేళ్ల నుంచీ ఇలా చేస్తున్నామనీ ఈసారి  మాస్కుల్ని ఇచ్చామనీ చెబుతున్నాడు ఏనుగుల సంరక్షకుడు ఇట్టిపన్‌ పొలామై.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు