సర్దుకుపోదాం రండి - Sunday Magazine
close

సర్దుకుపోదాం రండి

- పి.చంద్రికశేఖర్‌

రాత్రి 8:30 గంటలు దాటింది, జూన్‌ నెల వచ్చినా ఇంకా వర్షాలు మొదలవక వాతావరణం చాలా వేడిగా ఉక్కగా ఉంది. సెల్లార్‌లో కారు పార్క్‌చేసి అలసటగా లిఫ్ట్‌ ఎక్కింది దివ్య. ఒక్క నిమిషం నిలబడితే చాలు కళ్లు మూసుకుపోతున్నాయి. ప్రాజెక్టు చివరి దశకు వచ్చేసింది అని ఊపిరి తీసుకునేలోపు అనుకోకుండా ఒక ఇష్యూ వచ్చింది. రెండ్రోజుల నుండి టీమ్‌ అంతా ఆ పనిమీదే శ్రమిస్తున్నారు. చివరకు అది ఈరోజు కొలిక్కివచ్చింది. విపరీతమైన నిస్త్రాణగా ఉంది దివ్యకి. దానికి తోడు గంటనుండి తలనొప్పి, ఒళ్లునొప్పులు కూడా మొదలయ్యాయి. ఫ్లోర్‌లో లిఫ్ట్‌ ఆగగానే దిగి తన ఫ్లాట్‌లోకి నడిచింది, సాగర్‌ ఏం చేస్తున్నాడో అనుకుంటూ...

తన దగ్గరున్న కీతో లాక్‌ ఓపెన్‌ చేసి లోపలికి నడిచింది. సాగర్‌ హాల్లోనూ బెడ్‌రూమ్‌లోనూ కూడా లేడు. సిటౌట్‌లోకి వెళ్లింది దివ్య. అక్కడ తన పెయింటింగ్‌కి మెరుగులు దిద్దుతూ దివ్య రాకని కూడా పట్టించుకునే స్థితిలో లేడు సాగర్‌.

చిన్నగా నిట్టూరుస్తూ లోపలికి నడిచింది. వేడినీళ్లతో స్నానం చేసి నైట్‌డ్రెస్‌ వేసుకుని రాగానే కొద్దిగా రిలీఫ్‌గా అనిపించింది. జుట్టుకు క్లిప్‌ పెట్టుకుంటూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు నడిచి గిన్నెలు మూత తీసి చూసింది. పొద్దున్న చేసి పెట్టిన ఐటెమ్స్‌ అన్నీ అలానే ఉన్నాయి. కూరలు అన్నీ ఓవెన్‌లో వేడిచేసి రైస్‌ కుక్కర్‌ మళ్లీ స్విచ్చాన్‌ చేసింది. సాగర్‌ లంచ్‌ కూడా చెయ్యలేదంటే... ఉసూరుమనిపించింది.

అన్నీ టేబుల్‌పైన సర్ది మళ్లీ సాగర్‌ దగ్గరకు వెళ్లింది దివ్య. ఇంకా అదే భంగిమలో ఉన్నాడు అతను. ఇంట్లో తన ఉనికి అతణ్ణి ఏమాత్రం డిస్ట్రబ్‌ చెయ్యలేదన్నమాట!

‘‘సాగర్‌...’’ గట్టిగా పిలిచింది దివ్య. అప్పుడు ఈ లోకంలోకి వస్తూ ‘‘హాయ్‌ దివ్యా, చెప్పు’’ తల తిప్పకుండానే అడిగాడు సాగర్‌.

‘‘భోజనం చేద్దాం రా, నువ్వు లంచ్‌ కూడా చెయ్యలేదు’’ పిలిచింది.

‘‘సారీ రా, ఇంకో గంటలో నా పనయ్యాక తింటాను నువ్వు తినేయి’’ చెప్పాడు సాగర్‌. ‘‘అది కాదు’’ అంటూ దివ్య ఏదో చెప్పబోతుండగా మొబైల్‌ రింగ్‌ అయ్యింది. సాగర్‌ ఫ్రెండ్‌ అనిల్‌ కాల్‌ చేస్తున్నాడు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ‘‘హలో అనిల్‌ ఎలా ఉన్నావు’’ అంది దివ్య.
‘‘నేను బావున్నానుగానీ ఏమైపోయాడు వీడు? పొద్దుట్నుంచీ కాల్‌ చేస్తున్నా లిఫ్ట్‌ చెయ్యడే? నాకు రెజ్యూమ్‌ పంపాడు కదా, నేను అది చూపించి మా బాస్‌తో మాట్లాడాను. సాగర్‌ని ఈరోజు వచ్చి కలవమన్నారు ఆయన. ఆ మాట వాడితో చెప్పాలని మార్నింగ్‌ నుండీ కాల్‌ చేస్తుంటే రెస్పాన్స్‌ లేదు? ఈరోజు మా బాస్‌కి ఏదో సర్దిచెప్పాలే కానీ రేపు మాత్రం వాడిని తప్పక వచ్చి కలవమను. లేట్‌చేస్తే ఆఫర్‌ మిస్‌ అవ్వచ్చు’’ చెప్పాడు అనిల్‌.

‘‘సారీ అనిల్‌, నేను మాట్లాడి రేపు తప్పక పంపుతాను’’ చెప్పింది దివ్య. ‘‘ఓకే బై గుడ్‌నైట్‌’’ కాల్‌ కట్‌ చేశాడు అనిల్‌. ఒక్కసారిగా కోపం, ఉక్రోషం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి దివ్యలో. విసురుగా సాగర్‌ దగ్గరికి వెళ్లింది.

‘‘సాగర్‌, ఒక్కసారి ఇటు చూడు... నీతో అర్జెంటుగా మాట్లాడాలి’’ విసురుగా అంది దివ్య.

‘‘కాసేపాగు దివ్యా, తర్వాత మాట్లాడుదువు గానీ’’ సీరియస్‌గా చెప్పాడు సాగర్‌. అంతే, ఆగ్రహం కట్టలు తెంచుకుంది దివ్యలో. తనేం చేస్తోందో తెలియని ఆవేశంలో అక్కడున్న కలర్స్‌ ప్లేట్‌ని ఎత్తి నేలకేసి కొట్టింది. మొత్తం రంగులన్నీ అక్కడ చిందడమే గాక, కొన్ని రంగులు సాగర్‌ వేస్తున్న పెయింటింగ్‌ పైన చిమ్మినట్లుగా పడ్డాయి. నిమిషంలో ఆ అందమైన బొమ్మ కాస్తా రంగులతో వికృతంగా మారిపోయింది.

నిశ్చేష్టుడయ్యాడు సాగర్‌. జరిగింది అర్థమయ్యేసరికి అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. ‘‘దివ్యా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా’’ గట్టిగా అరిచాడు.

‘‘అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? జాబ్‌ కోసం ఎన్ని రోజులనుండి వెయిట్‌ చేస్తున్నాం. మంచి ఆఫర్‌ వస్తే నువ్వు ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యకుండా రంగులు పులుముకుంటూ కూర్చున్నావు’’ కోపంగా అంది దివ్య.

‘‘దివ్యా, నీకు తెలుసుకదా నేను ఒక పెయింటింగ్‌ మొదలుపెడితే అది పూర్తయ్యేదాకా ఆ మూడ్‌లోనుండి బయటకు రాలేనని’’ చెప్పాడు సాగర్‌.

‘‘తెలుసు సాగర్‌. నీలోని ఆ కళను చూసే నేను ఇష్టపడి కోరి నిన్ను పెళ్లి చేసుకున్నానని కూడా తెలుసు. కానీ ఇదొక్కటే మన అవసరాలు తీర్చదు సాగర్‌. సంసారమంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి. వాటికితోడు ఫ్లాట్‌కీ, కారుకీ ఈఎంఐ కట్టాలి. ఇవన్నీ నా ఒక్కదానివల్లా ఎలా అవుతాయి. ఆలోచించవా నువ్వు?’’ కోపంగా అడిగింది దివ్య.

‘‘నేనూ నా ప్రయత్నం చేస్తూనే ఉన్నానని తెలుసుగా దివ్యా. నాకు మాత్రం బాధ్యత తెలియదా’’ బాధగా అడిగాడు సాగర్‌.

‘‘ఏమో సాగర్‌, నాకయితే నువ్వు సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదు. సోమరిపోతులా ఇంట్లో కూర్చుని రోజల్లా రంగులు పూసుకోవడానికి అలవాటు పడిపోయావు. నీలాంటి బాధ్యత లేనివాడిని పెళ్లి చేసుకుని తప్పు చేశాననిపిస్తోంది. ముందు ఉద్యోగం సంపాదించి అప్పుడు మాట్లాడు’’ విసురుగా అనేసి లోపలికి వెళ్లిపోయింది దివ్య.

డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని ఏదో తిన్నాననిపించి లేచింది. మళ్లీ సిటౌట్‌లోకి వచ్చింది అక్కడ సాగర్‌ లేడు. హాల్లోకి వచ్చి చూసింది. చెప్పులస్టాండ్‌లో అతని చెప్పులు కూడా లేవు. అంటే బయటకు వెళ్లిపోయాడన్న మాట. పోతే పోనీ, ఎక్కడకు వెళ్తాడు... కాసేపటికి తానే వస్తాడు... కోపంగా అనుకుంది దివ్య. ఆఫీస్‌లో చికాకులన్నీ తన మెదడులో తిరుగుతుంటే ఇక అంతకన్నా ఆలోచించలేకపోయింది. సాగర్‌ దగ్గర ఇంకో కీ ఉంటుందని తెలుసు కాబట్టి డోర్‌ లాక్‌చేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకుంది.

*     *     *

తెల్లవారి కాలింగ్‌బెల్‌ మోతకి మెలకువ వచ్చింది దివ్యకి. అతికష్టం మీద మంచం దిగివెళ్లి డోర్‌ తీసింది. వచ్చింది పనిమనిషి వనజ.

‘‘ఏమ్మా, ఇంకా లెగలేదా?’’ అనుకుంటూ లోపలికి వచ్చింది. ఏమీ మాట్లాడే ఓపిక లేక వచ్చి సోఫాలో పడుకుంది దివ్య. రాత్రి వచ్చిన తలనొప్పి, ఒళ్లునొప్పులు తగ్గకపోగా జ్వరం కూడా తోడయ్యింది. అలా ఎంతసేపు మగతగా పడుకుందో, వనజ వంటింట్లో పని అంతా పూర్తిచేసి, హాల్లోకి వచ్చి ‘‘అమ్మా’’ అని దివ్యని తట్టి లేపుతూ ఉలిక్కిపడింది.

‘‘అయ్యో దివ్యమ్మా, జ్వరంగా ఉందే’’ అంది.

‘‘అవును, వనజా బాగా నీరసంగా ఉంది. కాస్త కాఫీ ఇస్తావా’’ నీరసంగా అడిగింది.

‘‘అయ్యో, మీరు ముఖం కడుక్కురండమ్మా, ఈలోగా కాఫీ కలుపుకొస్తాను’’ అంటూ వంటింట్లోకి నడిచింది.

దివ్య ఫ్రెష్షయి వచ్చేసరికి వేడిగా కాఫీ, ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ కూడా తెచ్చి ఇచ్చింది వనజ. బ్యాగులోని టాబ్లెట్‌ తీసుకుని కాఫీతో పాటు వేసుకుంది దివ్య. వనజ కూడా కాఫీ కప్పు తెచ్చుకుని అక్కడే సోఫా పక్కన కూర్చుంది. ఒక పావుగంటకి కొంచెం రిలీఫ్‌గా అనిపించింది దివ్యకి. తరువాత ఆఫీస్‌కి కాల్‌చేసి లీవ్‌ చెప్పేసింది.

‘‘అమ్మా, బాగా నీరసంగా ఉన్నారు. నా పనులన్నీ అయిపోయాయి. మీకు వంట చేసిపెట్టి వెళతాలెండి ఈ పూటకి’’ అంటూ లోపలికి వెళ్లింది వనజ. అలాగే ఆలోచిస్తూ కూర్చుంది దివ్య. కుక్కర్లో అన్నం, ఇంకో స్టవ్‌పైన పప్పూ పెట్టి బెండకాయలు తీసుకుని వచ్చి సోఫా పక్కన కూర్చుని కట్‌ చేయసాగింది వనజ. అప్పటిదాకా వనజ నుదుటి మీద ఉన్న ప్లాస్టర్‌ని గమనించలేదు దివ్య.

‘‘ఏమైంది వనజా, ఆ దెబ్బ ఏంటి?’’ ఆందోళనగా అడిగింది.

‘‘ఏం లేదమ్మా, రాత్రి మా ఆయన తాగొచ్చి గొడవ చేశాడు. అనుకోకుండా నన్ను నెట్టాడు. తల మంచానికి తాకి దెబ్బ తగిలింది’’ చెప్పింది వనజ.

‘‘అదేంటే, అలా తేలిగ్గా చెబుతున్నావు. అయినా పెళ్లాన్ని కొట్టడం ఏంటి? నువ్వెందుకు ఊరుకున్నావు అసలు’’ కోపంగా అంది దివ్య.

‘‘ఆడు మంచోడేనమ్మా, ఏదో ఈ మద్దెన పరిస్థితులు బాలేక అలా తయారయ్యాడు’’ చెప్పింది వనజ.

‘‘అయితే మాత్రం... నాల్రోజులు తిండి పెట్టకు, ఇంట్లోకి రానియ్యకు, దెబ్బకి దారికొస్తాడు’’ కసిగా చెప్పింది దివ్య.

కూరలు కోయడం ఆపి తలెత్తి దివ్య ముఖంలోకి చూసింది వనజ.

‘‘అంతమాట అనకండమ్మా. ఆడి గురించి మీకు పూర్తిగా తెలీదు. ఒకప్పుడు ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసేవాడమ్మా. బాగానే సంపాయించేవాడు. నన్ను పనికి కూడా ఎల్లొద్దనేవాడు. పిల్లలు లేరు కదా రోజంతా ఇంట్లో ఖాళీగా ఏం చేస్తాను అని నేనే ఆడిని ఒప్పించి పని చేస్తన్నాను. ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లోకి అన్నీ ఏలోటూ లేకుండా తెచ్చేవాడు. నేను ఏది కావాలన్నా కొనిచ్చేవాడు. నన్నెంతో బాగా చూసుకునేవాడు. ఈలోగా ఏదో గొడవలయ్యి ఆ ఫ్యాక్టరీ మూసేశారు. ఈడి ఉద్యోగం పోయింది. అంతే అప్పటినుంచీ పిచ్చోడయిపోయాడు. నేను సంపాదించి తెస్తుంటే కూర్చుని తింటున్నానని కుమిలిపోతున్నాడు.

‘‘అప్పటికీ చెబుతూనే ఉన్నానమ్మా బాధపడొద్దని. అయినా మగోడు కదమ్మా, పెళ్లాం సంపాదన తినాలంటే మనసుకి కష్టంగానే ఉంటుంది. నిన్న ఇంటి ఓనరొచ్చి అద్దె కట్టలేదని నానా రచ్చ చేసిపోయాడు. ఆ బాధలో తాగేసొచ్చాడు. ఎందుకు తాగావని నిలదీశాను. మాటా మాటా పెరిగింది, ఇదిగో ఇలా జరిగింది’’ చెప్పింది వనజ. అలానే వింటోంది దివ్య.

ఒక్క నిమిషం ఆగి మళ్లీ చెప్పసాగింది వనజ. ‘‘దివ్యమ్మా, ఉద్యోగం పోయి, చేతిలో డబ్బుల్లేక పెళ్లాంమీద ఆధారపడి బతుకుతున్నానన్న బాధలో అలా తయారయ్యాడు గానీ, ఆడు చాలా మంచోడమ్మా! ఈ ఎనిమిదేళ్లలో నన్ను పల్లెత్తు మాట అనలేదు. మత్తు దిగాకా నా దెబ్బ చూసి కన్నీరెట్టుకున్నాడు. డాక్టరు దగ్గరికి తీసుకెళ్లి మందిప్పిచ్చాడు. ఆడి బాధను అర్థం చేసుకోకుండా నేను కూడా ఆణ్ణి సతాయిస్తే ఆడేమయిపోవాలి. మొగుడనే వాడు సుఖంలోనే కాదు కష్టంలోనూ మొగుడేకదమ్మా! కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకోకుంటే ఎలా? అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదమ్మా, మళ్లీ ఆడికి మంచిరోజులు వస్తాయనే ఆశతోనే ఉన్నానమ్మా’’ అని తరిగిన బెండకాయలు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది వనజ.

చెంపమీద ఛెళ్లున ఎవరో చరిచినట్లయ్యింది దివ్యకి. అప్పటికే టాబ్లెట్‌ కూడా పనిచేసిందేమో తలనొప్పి తగ్గి, ఒళ్లంతా చెమటలు పట్టాయి. కొంచెం నీరసం, నిన్నటి మగత తగ్గి మెదడు కూడా చురుగ్గా పని చెయ్యడం మొదలుపెట్టింది.

అవును, రాత్రి ఏం జరిగింది? తను సాగర్‌ పట్ల ఎందుకని అంత దురుసుగా ప్రవర్తించింది? వనజ చెప్పేవన్నీ తన విషయంలో కూడా నిజమేగా. సాగర్‌ జాబ్‌లో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులన్నీ తనే చూసుకునేవాడు. ఇంట్లోకి ఏదీ లోటు చేసేవాడు కాదు. అప్పట్లో తనకన్నా అతనికే ఎక్కువ జీతం. తను ఏదో చిన్న చిన్న ఖర్చులకు వాడి మిగతాదంతా తన సేవింగ్స్‌లో దాచుకునేది. ఏరోజూ నీ జీతం ఎంత, ఏం చేస్తున్నావు అని అడగలేదు. ఆర్థికమాంద్యం కారణంగా కంపెనీలోంచి హై శాలరీ ఉన్నవారందరినీ తీసేశారు. అందులో సాగర్‌ కూడా ఒకడు.

ఆ డిప్రెషన్‌లోంచి బయటపడటానికి తనకిష్టమైన పెయింటింగ్‌ని ఎంచుకున్నాడు. చిన్నా చితకా కంపెనీ ఇంటర్వ్యూలకు అటెండ్‌ అయ్యాడు గానీ అతనికి నచ్చలేదు. తనకున్న కెపాసిటీకీ, ఎక్స్‌పీరియన్స్‌కీ ఇంకా మంచి కంపెనీలో వస్తుందని తన నమ్మకం. అదే ధైర్యంతో వేచి చూస్తున్నాడు. కానీ మరి తను... తనేం చేసింది?

ఇటువంటి సమయంలో అతనికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి అవమానించింది! అసలు తాను సాగర్‌ని ప్రేమించిందే అతనిలోని ఆ చిత్రకళని చూసి. తాను ఒక అనాథ అని తెలిసి వాళ్ల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకుంటే అందరినీ కాదని బయటకు వచ్చేసి తనను పెళ్లి చేసుకున్నాడు. అలాంటి మనిషితో తాను ఎంత అమానుషంగా ప్రవర్తించింది... ఎంత మూర్ఖంగా మాట్లాడింది... ఛీ చదువులేని వనజకు ఉన్నపాటి జ్ఞానం కూడా తనకు లేదు. ఎక్కడున్నాడో ఏమో... అప్రయత్నంగా మొబైల్‌ చేతిలోకి తీసుకుంది.

ఫోన్‌ సైలెంట్‌లో పెట్టినట్లుంది రాత్రి చిరాకులో. సాగర్‌వి మూడు మిస్డ్‌కాల్స్‌ ఉన్నాయి. వెంటనే కాల్‌ చేసింది. రెండో రింగ్‌కే లిఫ్ట్‌ చేశాడు సాగర్‌.

‘‘హలో దివ్యా, ఫోన్‌ తీయకపోతే నామీద కోపం తగ్గలేదనుకున్నా! సారీ రా, రాత్రి పాపం నువ్వు వర్క్‌ టెన్షన్‌లో ఉండి ఎంత అలసిపోయి వచ్చావో, నీ చిరాకుని అర్థం చేసుకోకుండా నిన్ను బాధపెట్టాను. నేను చేసింది తప్పే, ఇప్పుడే అనిల్‌తో వాళ్ల ఆఫీసుకి వెళ్తున్నాను. రాత్రి వాడి దగ్గరే ఉన్నాను. పొద్దున్న లేస్తూనే- రాత్రంతా నేను ఇంటికి రాలేదని నువ్వు ఎంత కంగారు పడ్డావో అనిపించి కాల్‌ చేశాను’’ ఇంకా ఏదో చెబుతున్న సాగర్‌ మాటలకు అడ్డుపడుతూ...

‘‘సాగర్‌, రాత్రి భోజనం చేశావా? థాంక్‌గాడ్‌, నువ్వు సేఫ్‌గానే ఉన్నావుకదూ! ఇంటర్వ్యూ అవన్నీ తర్వాత చూసుకుందాంగానీ ముందు నువ్వు త్వరగా ఇంటికి రా. నేను లీవ్‌ పెట్టి ఇంట్లోనే ఉన్నాను. చిన్నా చితకా ఉద్యోగాలు, తక్కువ జీతంతో నీకు నచ్చనిచోట రాజీపడి పని చేయవలసిన అవసరం లేదు. నా సేవింగ్స్‌ ఉన్నాయిగా ప్రస్తుతానికి కొన్నాళ్ల వరకూ మనకు ఎలాంటి ఇబ్బందీ లేదు.

నీ అర్హతకి తగిన జాబ్‌ దొరికినప్పుడే చేద్దువుగానీ. నేనే నా ప్రవర్తనకి నీకు సారీ చెప్పాలి, ప్లీజ్‌, వెంటనే ఇంటికి రా సాగర్‌’’ అర్ధింపుగా చెప్పింది దివ్య.

‘‘ఏమైంది దివ్యా, లీవ్‌ ఎందుకు పెట్టావు ఒంట్లో బాగోలేదా? నేను అసలు నీకు రాత్రే కాల్‌ చేయాల్సింది పొరపాటు చేశాను. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నా’’ అంటూ కాల్‌ కట్‌ చేశాడు సాగర్‌.

‘‘అమ్మగారూ, వంట పూర్తయింది నేను వెళ్లొస్తా’’ అంటూ వచ్చింది వనజ. అప్రయత్నంగా వనజ రెండు చేతులూ పట్టుకుని ‘‘థాంక్స్‌ వనజా’’ అంది దివ్య.

చిత్రంగా చూస్తూ బయటకు నడిచింది వనజ. ఆమెను పంపి తలుపు వేసి హుషారుగా లోపలికి నడిచింది దివ్య.

మబ్బులు వెలిసిన ఆకాశంలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఇప్పుడు ఆమె మనసు. సాగర్‌ వచ్చేలోపు స్నానంచేసి, అతనికి ఇష్టమైన డ్రెస్‌ వేసుకుని రెడీ అవ్వాలి. ఈరోజు తన చేతులతో అతనికి స్వయంగా భోజనం వడ్డించాలి. అవునుమరి, ఇద్దరూ సర్దుకుపోతుంటేనే కదా అది అసలైన దాంపత్యం... బీరువాలోంచి రోజామొగ్గలున్న తెల్లచీర తీసి మంచం మీద పెట్టి చిరునవ్వుతో బాత్‌రూమ్‌వైపు నడిచింది దివ్య.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న