బెంగళూరు ఉంది.. పంజాబ్‌ పోయింది

సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి క్యాచ్‌ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్‌ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్‌ విధ్వంసం సృష్టించాడు. రజత్‌, గ్రీన్‌ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

Updated : 10 May 2024 06:46 IST

మెరిసిన కోహ్లి, రజత్‌, సిరాజ్‌
ప్లేఆఫ్స్‌ రేసు నుంచి కింగ్స్‌ నిష్క్రమణ
ధర్మశాల

సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి క్యాచ్‌ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్‌ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్‌ విధ్వంసం సృష్టించాడు. రజత్‌, గ్రీన్‌ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్‌ అవకాశాలను ఆర్సీబీ కాపాడుకోగా.. పంజాబ్‌ కథ ముగిసింది. 12 మ్యాచ్‌ల్లో 8వ ఓటమితో ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.  

పీఎల్‌- 17లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కథ ఇంకా మిగిలే ఉంది. ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. గురువారం 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి (92; 47 బంతుల్లో 7×4, 6×6) మరోసారి చెలరేగడంతో మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చేసింది. రజత్‌ పటీదార్‌ (55; 23 బంతుల్లో 3×4, 6×6), కామెరూన్‌ గ్రీన్‌ (46; 27 బంతుల్లో 5×4, 1×6) కూడా మెరిశారు. హర్షల్‌ పటేల్‌ (3/38), ఐపీఎల్‌ అరంగేట్ర పేసర్‌ విద్వత్‌ కావేరప్ప (2/36) రాణించారు. ఛేదనలో పంజాబ్‌ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రొసో (61; 27 బంతుల్లో 9×4, 3×6) పోరాడాడు. సిరాజ్‌ (3/43), స్వప్నిల్‌ సింగ్‌ (2/28), ఫెర్గూసన్‌ (2/29), కర్ణ్‌శర్మ (2/36) సత్తాచాటారు. 12 మ్యాచ్‌ల్లో ఆర్సీబీకిది అయిదో విజయం.

అందని లక్ష్యం: గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ ఆశలు ఉంటాయనే స్థితిలో ఛేదనలో పంజాబ్‌ దూకుడు ప్రదర్శించింది. తొలి ఓవర్లోనే ప్రభ్‌సిమ్రన్‌ (6) ఔటైనా.. బెయిర్‌స్టో (27), రొసో ఎదురుదాడికి దిగారు. లోమ్రార్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రొసో నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో వెనక్కి తిరిగి పరుగెడుతూ డుప్లెసిస్‌ అందుకున్న చక్కటి క్యాచ్‌కు బెయిర్‌స్టో వెనుదిరిగినా రొసో బాదుడు కొనసాగించాడు. కానీ స్పిన్నర్లు పంజాబ్‌ జోరుకు కళ్లెం వేశారు. కర్ణ్‌ వరుస ఓవర్లలో రొసో, జితేశ్‌ (5)ను ఔట్‌ చేశాడు. స్వప్నిల్‌ గాలానికి ప్రమాదకర లివింగ్‌స్టన్‌ (0) చిక్కాడు. 107/2తో ఉన్న జట్టు 126/5తో కష్టాల్లో పడింది. చివరి వరకూ పోరాడేలా కనిపించిన శశాంక్‌ (37).. డీప్‌మిడ్‌వికెట్‌ నుంచి మెరుపు వేగంతో వచ్చిన కోహ్లి కింద పడుతూ నేరుగా స్టంప్స్‌కు విసిరిన త్రోకు పెవిలియన్‌ చేరక తప్పలేదు. ఇదే మ్యాచ్‌లో మలుపు. అశుతోష్‌ (8)ను సిరాజ్‌ ఔట్‌చేయడంతో పంజాబ్‌ పనైపోయింది. ఆ కొద్దిసేపటికే జట్టు ఆలౌటైపోయింది.

విరాట్‌ అదుర్స్‌: పంజాబ్‌ ఫీల్డర్ల పేలవ ప్రదర్శనతో.. కోహ్లి, రజత్‌, గ్రీన్‌ మెరుపులతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ సాగింది. పంజాబ్‌ ఏకంగా ఆరు క్యాచ్‌లు జారవిడిచింది. కొత్త పేసర్‌ విద్వత్‌ బౌలింగ్‌లోనే పవర్‌ప్లేలో నాలుగు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. అయినా విద్వత్‌ బౌన్స్‌తో డుప్లెసిస్‌ (9)ను, పేస్‌ తగ్గించి జాక్స్‌ (12)ను బుట్టలో వేసుకున్నాడు. సున్నా పరుగులకే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ కోహ్లి, రజత్‌ కలిసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. రాహుల్‌ చాహర్‌ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి, 21 బంతుల్లోనే అర్ధశతకం చేరుకున్న రజత్‌ వెంటనే ఔటైపోయాడు. ఆర్సీబీ 10 ఓవర్లలో 119/3తో ఉన్నప్పుడు వడగళ్ల వర్షంతో 35 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైన తర్వాత కోహ్లి బౌండరీల వరద పారించాడు. తనదైన కవర్‌డ్రైవ్‌తో పాటు లాఫ్టెడ్‌, కట్‌, స్లాగ్‌స్వీప్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. గ్రీన్‌ కూడా వేగం పెంచడంతో 17 ఓవర్లకు స్కోరు 200కు చేరింది. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో బ్యాట్‌ను కత్తిలా వాడి అప్పర్‌కట్‌తో కోహ్లి కొట్టిన సిక్సర్‌ చూడాల్సిందే. కానీ విరాట్‌ మరో షాట్‌కు ప్రయత్నించి సెంచరీ ముంగిట ఔటయ్యాడు. కార్తీక్‌ (18), గ్రీన్‌ మెరుపులతో ఆర్సీబీ స్కోరు 250 దాటుతుందనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో హర్షల్‌ మూడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) రొసో (బి) అర్ష్‌దీప్‌ 92; డుప్లెసిస్‌ (సి) శశాంక్‌ (బి) విద్వత్‌ 9; జాక్స్‌ (సి) హర్షల్‌ (బి) విద్వత్‌ 12; రజత్‌ (సి) బెయిర్‌స్టో (బి)  కరన్‌ 55; గ్రీన్‌ (సి) కరన్‌ (బి) హర్షల్‌ 46; దినేశ్‌ కార్తీక్‌ (సి) కరన్‌ (బి) హర్షల్‌ 18; లోమ్రార్‌ (బి) హర్షల్‌ 0; స్వప్నిల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 8;

మొత్తం: (20 ఓవర్లలో  7 వికెట్లకు) 241;

వికెట్ల పతనం: 1-19, 2-43, 3-119, 4-211, 5-238, 6-240, 7-241;

బౌలింగ్‌: విద్వత్‌ కావేరప్ప 4-0-36-2; అర్ష్‌దీప్‌ సింగ్‌ 3-0-41-1; కరన్‌ 3-0-50-1; హర్షల్‌ పటేల్‌ 4-0-38-3; రాహుల్‌ చాహర్‌ 3-0-47-0; లివింగ్‌స్టన్‌ 3-0-28-0

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ ఎల్బీ (బి) స్వప్నిల్‌ 6; బెయిర్‌స్టో (సి) డుప్లెసిస్‌ (బి) ఫెర్గూసన్‌ 27; రొసో (సి) జాక్స్‌ (బి) కర్ణ్‌ 61; శశాంక్‌ రనౌట్‌ 37; జితేశ్‌ (బి) కర్ణ్‌ 5; లివింగ్‌స్టన్‌ (సి) కర్ణ్‌ (బి) స్వప్నిల్‌ 0; కరన్‌ (బి) ఫెర్గూసన్‌ 22; అశుతోష్‌ ఎల్బీ (బి) సిరాజ్‌ 8; హర్షల్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) సిరాజ్‌ 0; రాహుల్‌ చాహర్‌ నాటౌట్‌ 5; అర్ష్‌దీప్‌ (సి) కర్ణ్‌ (బి) సిరాజ్‌ 4; ఎక్స్‌ట్రాలు 6;

మొత్తం: (17 ఓవర్లలో ఆలౌట్‌) 181;

వికెట్ల పతనం: 1-6, 2-71, 3-107, 4-125, 5-126, 6-151, 7-164, 8-170, 9-174;

బౌలింగ్‌: స్వప్నిల్‌ 3-0-28-2; సిరాజ్‌ 4-0-43-3; యశ్‌ దయాల్‌ 2-0-22-0; ఫెర్గూసన్‌ 3-0-29-2; విల్‌జాక్స్‌ 1-0-5-0; గ్రీన్‌ 1-0-16-0; కర్ణ్‌శర్మ 3-0-36-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని