కొత్త పరిస్థితులతో కంగారు..

కోరుకున్న కాలేజీ.. నచ్చిన బ్రాంచిలో సీటు. నవ్య మరో ఆలోచన లేకుండా వెంటనే చేరిపోయింది కానీ అక్కడి వాతావరణంతో అంతగా ఇమడలేకపోతోంది. అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కొత్తగానే కనిపిస్తున్నారు. దాంతో గందరగోళంగా ఉండటంతో ఒత్తిడికీ గురవుతోంది.

Updated : 16 Oct 2023 02:16 IST

కోరుకున్న కాలేజీ.. నచ్చిన బ్రాంచిలో సీటు. నవ్య మరో ఆలోచన లేకుండా వెంటనే చేరిపోయింది కానీ అక్కడి వాతావరణంతో అంతగా ఇమడలేకపోతోంది. అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కొత్తగానే కనిపిస్తున్నారు. దాంతో గందరగోళంగా ఉండటంతో ఒత్తిడికీ గురవుతోంది. అంటే  కొత్త పరిస్థితుల్లో త్వరగా ఇమిడిపోయే నైపుణ్యం (‘అడాప్టబిలిటీ’) ఆమెకు లేదన్నమాట. దీన్ని అలవర్చుకుంటే ఊహించని/ నియంత్రించలేని పరిస్థితులు    ఎదురైనా చలించరు. వాటికి అనుగుణంగా తమను  తాము మార్చుకోగలుగుతారు.

కొద్దికాలం క్రితం కరోనా వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలను మూసేయడంతో.. విద్యార్థులందరూ ఇంటి దగ్గరే ఉంటూ.. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యారు. అంటే.. ప్రత్యక్ష తరగతులకు బదులుగా ఆన్‌లైన్‌ క్లాసులకు అలవాటుపడ్డారు. పరిస్థితులను యథాతథంగా స్వీకరించగలిగే నేర్పు విద్యార్థులకు ఉండబట్టే ఇదంతా సాధ్యమైంది. ఈ  నైపుణ్యం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా...

  • ఈ నైపుణ్యం ఉన్నవాళ్లు అంచనాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోగలుగుతారు. కొత్త పరిస్థితులకూ అలవాటుపడగలుగుతారు.
  • చదివే క్రమంలో లేదా ఏదైనా కొత్త విషయం నేర్చుకునే క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయి. ఈ నైపుణ్యం ఉన్న విద్యార్థులు అడ్డంకులను అధిగమించడానికీ కొత్త మార్గాల గురించీ అన్వేషిస్తారు. ఈ విధమైన ఆలోచన విధానం ఒక్క విద్యార్థి దశకే పరిమితం కాదు.. తర్వాతి జీవితంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగాన్వేషణలో భాగంగా పోటీ పరీక్షలు రాసినా, ఇంటర్వ్యూలకు హాజరైనా.. ఉద్యోగిగా విధుల నిర్వహణలోనూ ఈ నేర్పుతో ఫలితం ఉంటుంది.
  • ఈ నైపుణ్యం ఉన్న విద్యార్థులు కొత్తగా ఏవైనా నేర్చుకోవడంలోనూ ఆసక్తి చూపిస్తారు. అనుకోని పరిస్థితులు పరిస్థితులూ, మార్పులూ ఎదురైనా భయపడరు. పనులు చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు.  
  • ఏవైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సాధారణంగా అందరి చూపూ నాయకుడివైపే ఉంటుంది. ఎందుకంటే సవాళ్లను ఎదుర్కోవడానికి వాళ్లు ఏమాత్రం భయపడరు. అలా వాళ్లను ముందుకు నడిపించేది ఈ నైపుణ్యమే. ఈ సామర్థ్యం ఉన్న విద్యార్థులు తరగతికే పరిమితం కారు.. తర్వాతి జీవితంలోనూ నాయకులుగా ఎదుగుతారు.
  • వివిధ ప్రాజెక్టులను పూర్తిచేయడానికీ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు బృందాలుగా ఏర్పడి పనిచేస్తుంటారు. అంటే ప్రతి విద్యార్థీ ఒక్కో సందర్భంలో బృంద సభ్యుడే. బృంద అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారాల్సీ రావొచ్చు. ఇలా పరిస్థితులకు అనుగుణంగా మారే విద్యార్థులు సహ విద్యార్థులతో సులువుగా కలసిపోగలుగుతారు. పాఠశాల, కళాశాల స్థాయిలో దీనికి అలవాటు పడటం వల్ల భవిష్యత్తులోనూ తగిన ఫలితాలను పొందొచ్చు.
  • పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించని విద్యార్థులు కోపం, విసుగు, నిరాశ లాంటి ప్రతికూల ప్రభావాలకు లోనయ్యే అవకాశాలే ఎక్కువ. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ఒత్తిడీ, కుంగుబాటుకూ గురవుతారు.

నేర్చుకోవచ్చిలా

  • ప్రయత్నించాలేగానీ ఈ నేర్పును అందిపుచ్చుకోవడం అసాధ్యమేమీ కాదు. సాధారణంగా ఎవరైనాసరే వైఫల్య భయంతో కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టరు.  కాబట్టి ముందుగా ఈ భయాన్ని అధిగమించాలి. ఒక పని చేసి విఫలమయ్యారనుకుందాం.. మరోసారి ఆ పనిని పాత పద్ధతిలో కాకుండా మరో కొత్త పద్ధతిలో చేస్తారు. అంటే కొత్త మార్గాన్ని అన్వేషిస్తారు. అలా విఫలమవడం అనేది కొత్త విషయాలను కనిపెట్టడానికి తోడ్పడుతుంది. కొత్తగా ప్రయత్నించే నేర్పు అలవడితే.. ఓటమికి అసలు భయపడరు.
  • వైఫల్యాన్ని అంగీకరించగలిగితే.. తిరిగి కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అడ్డంకులను అధిగమించే మార్గాల కోసం మేధోమధనం ప్రారంభిస్తారు కూడా.
  • ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఆసక్తిని పెంచుకోవాలి. ఇది ఉంటేనే మార్పును అంగీకరించే నైపుణ్యం అలవడుతుంది.
  • అనుకోని ఘటన జరిగినప్పుడు కొంతమంది భావోద్వేగాలకు గురవుతుంటారు. అలాకాకుండా కాస్త నిదానంగా ఆలోచించగలిగితే పరిస్థితులను అంగీకరించే నేర్పు అలవడుతుంది.
  • లక్ష్య సాధన మీదే దృష్టిని కేంద్రీకరిస్తే.. ఆ దారిలో ఎదురయ్యే అడ్డంకులనూ సులువుగా అధిగమించగలుగుతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని