ఈ ఎంబీఏలు ఎంతో ప్రత్యేకం!

సంస్థల నిర్వహణకు సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. ఇవి నియామకాల్లో మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ) కోర్సులు చదివినవారికి ప్రాధాన్య మిస్తున్నాయి. అయితే ప్రత్యేక విభాగాల్లో సేవలు అందిస్తున్న సంస్థలకు మాత్రం సాధారణ మేనేజర్లతో ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు.

Updated : 02 Nov 2023 03:16 IST

సంస్థల నిర్వహణకు సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. ఇవి నియామకాల్లో మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ) కోర్సులు చదివినవారికి ప్రాధాన్య మిస్తున్నాయి. అయితే ప్రత్యేక విభాగాల్లో సేవలు అందిస్తున్న సంస్థలకు మాత్రం సాధారణ మేనేజర్లతో ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. దీంతో ఆ విభాగంలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు  చదివినవారిని నియమించుకుంటున్నాయి.   విభాగాల వారీ సేవలు అందించడానికి ప్రత్యేక ఎంబీఏ కోర్సులను విద్యాసంస్థలు రూపొందించాయి. వీటిని పూర్తి చేసుకున్నవారు సంబంధిత సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్టులుగా రాణించవచ్చు. అధిక వేతనాలూ అందుకోవచ్చు!

మేనే జ్‌మెంట్‌ లేదా ఎంబీఏ కోర్సులను రెండు రకాలుగా విభజించుకోవచ్చు. జనరల్‌ ఎంబీఏ చదివినవారు పరిజ్ఞానాన్ని ఏ విభాగానికైనా అన్వయించుకోవడానికి వీలవుతుంది. అంటే వీరు అన్ని పరిశ్రమల్లోనూ సేవలు అందించవచ్చు. అదే సెక్టోరల్‌ ఎంబీఏ విషయానికొచ్చేసరికి.. ఆ విభాగానికి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. అందులో సేవలు అందిస్తోన్న సంస్థల అవసరాలు తీర్చేలా ఈ కోర్సులు రూపొందుతాయి. దీంతో వీరికి ఎక్కువ శాతం అవకాశాలు ఆ సెక్టార్‌తో ముడిపడే ఉంటాయి. దాదాపు కెరియర్‌ మొత్తం సంబంధిత విభాగంలో సేవలు అందిస్తోన్న సంస్థల్లోనే కొనసాగాల్సి వస్తుంది.

అందువల్ల విద్యార్థులు ఏ తరహా కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ఏ విభాగంలో సేవలు అందించాలని కోరుకుంటున్నారో పూర్తి స్పష్టత ఉంటేనే సెక్టోరల్‌ చదువుల దిశగా అడుగులు వేయవచ్చు. కొన్ని సెక్టోరల్‌ కోర్సుల విషయంలో మినహాయింపు లభిస్తుంది. ఉదాహరణకు ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సు పూర్తిచేసినవారు అంతర్జాతీయ వర్తకంతో ముడిపడే ఏ తరహా సంస్థలోనైనా ఉపాధి పొందడానికి వీలవుతుంది. సెక్టోరల్‌ కోర్సులు చదవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు పేరున్న బీ స్కూళ్లలో చేరితేనే మేటి విద్య దక్కుతుంది. అలాగే ప్రాంగణ నియామకాల్లోనూ ఉన్నత అవకాశాలు దక్కించుకోవచ్చు.

ఫార్మా మేనేజ్‌మెంట్‌: ఫార్మా సంస్థల్లో మేనేజీరియల్‌ ఉద్యోగాలు ఆశించేవారు ఫార్మా మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

మేటి సంస్థలు: దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌)లు పేరున్న సంస్థలు. అయితే వీటిలో ఫార్మా మేనేజ్‌మెంట్‌ కోర్సులకు బీఫార్మసీ చదివినవారికే ప్రాధాన్యం. మరికొన్ని సంస్థలు సాధారణ గ్రాడ్యుయేట్లకూ అవకాశం ఇస్తున్నాయి. నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎన్‌ఎంఐఎంఎస్‌), ముంబై, ఎస్‌ఐఈఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబై ప్రాధాన్య సంస్థలే.

రూరల్‌ మేనేజ్‌మెంట్‌: ప్రాంతీయ సహకార సంఘాలు, అభివృద్ధి సంస్థలు, ఎన్జీవోలు, ఫండింగ్‌ సంస్థలు, ఫౌండేషన్లలో ఈ కోర్సులు చదివినవారికి అవకాశాలుంటాయి. జాతీయ సంస్థలతోపాటు పలు బహుళజాతి సంస్థలు సైతం గ్రామీణాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి. ప్రస్తుతం చాలావరకు కార్పొరేట్‌ కంపెనీలు సీఎస్‌ఆర్‌లో భాగంగా పెద్దఎత్తున గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. స్థానిక వనరులపై దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేయడం, ఉత్పత్తులను మార్కెట్‌ చేయడంపైనా కృషి జరుగుతోంది. డెయిరీ, ఎరువులు, క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులు...తదితర సంస్థల్లో పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి.

మేటి సంస్థలు: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌ (ఐఆర్‌ఎంఏ), ఆనంద్‌ (గుజరాత్‌) ఈ విభాగంలో మేటి సంస్థ. క్యాట్‌ లేదా సొంత పరీక్షతో అవకాశం కల్పిస్తుంది. జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌- భువనేశ్వర్‌, వెల్లింగ్‌కర్‌- ముంబయి, అమిటీ-   నోయిడా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌), హైదరాబాద్‌లు.. రూరల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నాయి.

అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌: ఈ కోర్సు రూరల్‌ మేనేజ్‌మెంట్‌ను పోలి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఇందులో చేరిన ఐఐఎం విద్యార్థులు అగ్రికల్చర్‌ విభాగంతోపాటు సాధారణ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు పొందుతున్న అవకాశాలూ సొంతం చేసుకుంటున్నారు.

మేటి సంస్థలు: ఐఐఎం - అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, మేనేజ్‌- హైదరాబాద్‌, ఎస్‌ఐఐబీ- పుణె. ఎస్వీ అగ్రికల్చరల్‌ కాలేజ్‌- తిరుపతి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌- బెంగళూరు, నార్మ్‌- హైదరాబాద్‌.. ఈ సంస్థలన్నీ అగ్రి కోర్సులు అందిస్తున్నాయి.

రిటైల్‌ మేనేజ్‌మెంట్‌: దుస్తులైనా, సరుకులైనా, మరే వస్తువులైనా కార్పొరేట్‌ రీటైల్‌ కంపెనీల్లో కొనుగోలు చేసుకోవచ్చు. రిలయన్స్‌, ఐటీసీ, ఆదిత్య బిర్లా, టాటా, లైఫ్‌ స్టైల్‌, స్పెన్సర్స్‌, డీమార్ట, వాల్‌మార్ట్‌, ఐకియా... ఇలా పలు చోట్ల వీరికి అవకాశాలు లభిస్తున్నాయి.

మేటి సంస్థలు: నార్సీ మోంజీ- ముంబై, వెలింగ్‌కర్‌- ముంబై, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ- గ్రేటర్‌ నోయిడా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌- లఖ్‌నవూ, ఇండియన్‌ రిటైల్‌ స్కూల్‌- న్యూదిల్లీ. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ).. తదితర సంస్థల్లో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

ప్రవేశం, పరీక్షలు

ఎక్కువ సంస్థలు సాధారణ డిగ్రీతోనూ అవకాశం కల్పిస్తున్నాయి. కొన్నింటికి ఆ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ తప్పనిసరి. క్యాట్‌, జాట్‌, మ్యాట్‌, ఆ సంస్థ నిర్వహించే పరీక్షతో అభ్యర్థులను వడపోసి.. బృందచర్చ, ముఖాముఖి నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. వివిధ సంస్థల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి కూడా! 

టెలికాం మేనేజ్‌మెంట్‌: టెలికాం రంగంలో ఉద్యోగాలు లభిస్తాయి.

మేటి సంస్థలు: సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెలికాం  మేనేజ్‌మెంట్‌- పుణె, ఐఐటీ- దిల్లీ, అమిటీ- నోయిడా

ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని ఆశించేవారు ఈ కోర్సులో చేరవచ్చు. సృజన, తర్కం, నిర్వహణ నైపుణ్యాలు...వీటన్నింటినీ మెరుగులద్దుకోవచ్చు.

మేటి సంస్థలు: ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా- గాంధీనగర్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌- ముంబై, జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌- బెంగళూరు, నిర్మా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌- అహ్మదాబాద్‌, జామియా మిల్లియా ఇస్లామియా- న్యూదిల్లీ.

హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌: పెరుగుతోన్న జనాభా అవసరాలు తీర్చడానికి ఆసుపత్రులూ విస్తరిస్తున్నాయి. అయితే వీటి నిర్వహణకు సమర్థులైన మానవ వనరుల సేవలు కీలకం. ఇందుకోసమే పలు సంస్థలు ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో కొన్ని బ్యాచిలర్‌ స్థాయిలో వైద్యవిద్య అభ్యసించినవారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తుండగా మిగిలినవి సాధారణ డిగ్రీతోనూ చేర్చుకుంటున్నాయి.

మేటి సంస్థలు: ఎయిమ్స్‌- న్యూదిల్లీ, నిమ్స్‌- హైదరాబాద్‌ల్లో కోర్సులు చదవడానికి వైద్యవిద్య పట్టభద్రులు అర్హులు. అపోలో హాస్పిటల్‌- హైదరాబాద్‌, హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయం, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌- హైదరాబాద్‌, ఫోర్ట్‌ హాస్పిటల్‌...తదితర సంస్థలు సాధారణ గ్రాడ్యుయేట్లకూ అవకాశం కల్పిస్తున్నాయి.

ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎఫ్‌ఎం), భోపాల్‌ రెసిడెన్షియల్‌ విధానంలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందిస్తోంది. క్యాట్‌/ ఎక్స్‌ఏటీ స్కోరుతో దరఖాస్తు చేసుకోవచ్చు.

కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌: అడ్వర్టయిజింగ్‌, మీడియా, జర్నలిజం, పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

మేటి సంస్థలు: ముద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌- అహ్మదాబాద్‌, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌- పుణె, అమిటీ- నోయిడా.

ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌: బీమా రంగం, బ్యాంకింగ్‌ విభాగాల్లో కొలువులు ఆశించేవాళ్లు ఈ కోర్సులో చేరవచ్చు.

మేటి సంస్థలు: ఐఐఆర్‌ఎం- హైదరాబాద్‌, బీమ్‌టెక్‌- నోయిడా, ఐపీఈ-హైదరాబాద్‌, ఎన్‌ఐఏ- పుణె.

ఐటీ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌: ఐటీ, అనుబంధ రంగాల్లో మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలు ఆశించేవాళ్లు ఈ కోర్సులో చేరవచ్చు.

మేటి సంస్థలు: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలు, ఎండీఐ- గుర్‌గావ్‌, సింబయాసిస్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎస్‌సీఐటీ)- పుణె, సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీ, ఎస్‌పీ జైన్‌, ముంబై.


సెక్టోరల్‌ కోర్సులు

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌: జనరల్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు ఇంటర్నేషనల్‌ బిజినెస్‌పై పట్టు లభించేలా కరిక్యులమ్‌ ఉంటుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కోర్సు రూపొందుతుంది. బహుళజాతి కంపెనీల్లో ఈ స్పెషలైజేషన్‌కు ప్రాధాన్యం. స్థానిక మార్కెట్‌ పరిస్థితులు, అంతర్జాతీయ ట్రెండ్‌ రెండింటికీ సరిపోయేలా ఉత్పత్తులను తయారు చేయడం, అభివృద్ధి పరచడం, వర్తకాన్ని విస్తరించడం, ప్రచారం కల్పించడం లాంటివన్నీ చూసుకుంటారు. అంతర్జాతీయ పరిణామాలు స్థానిక మార్కెట్‌పై ఏ విధమైన ప్రభావాన్ని చూపగలవో అంచనా వేస్తారు. ప్రధాన కార్యాలయాలు విదేశాల్లో ఉంటాయి. సాధారణంగా వీరు స్వదేశం నుంచి సేవలు అందిస్తారు.
మేటి సంస్థలు: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌. ఈ సంస్థ ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సులో సొంత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తుంది. దిల్లీ, కోల్‌కతా, కాకినాడల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఎస్‌ఐబీ), పుణె కూడా ఈ కోర్సులో పేరున్నదే. శ్నాప్‌తో అవకాశం లభిస్తుంది. ఎండీఐ గుర్‌గావ్‌, కేజే సోమయ, ఫోర్‌ స్కూల్‌.. తదితర సంస్థలు కోర్సు అందిస్తున్నాయి. విదేశాల్లో అయితే హార్వార్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌, మసాచ్యుసెట్స్‌.. ఇలా మేటి సంస్థల్లో చదువుకోవచ్చు.


ఏది.. ఎవరికి?

స్పెషలిస్టు సేవలు ఆశించే విద్యార్థులు సెక్టార్‌ వైపు, జనరలిస్టుగా రాణించాలని కోరుకునేవాళ్లు రెగ్యులర్‌ ఎంబీఏ దిశగా అడుగులేయడం మేలు. విద్యార్థి యూజీలో చదివిన కోర్సుల ప్రకారమూ నిర్ణయం తీసుకోవచ్చు.

  • బీఫార్మసీ విద్యార్థి సాధారణ ఎంబీఏ బదులు ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరితే ప్రయోజనం ఎక్కువ.
  • బీఏలో రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు చదువుకున్నవారు రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
  • ఆసుపత్రుల్లోనే సేవలు ఆశిస్తే.. హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వైపు మొగ్గు చూపవచ్చు.

ఇలా విద్యార్థులు ఇష్టాలు, నైపుణ్యాలు, ఆసక్తులకు అనుగుణంగా సెక్టోరల్‌, జనరల్‌ ఎంబీఏల్లో ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని