వింటున్నారా.. శ్రద్ధగా.. ఆసక్తిగా!

కొత్త తరం కొలువులకు ఎంపిక కావాలంటే..   ప్రభావశీలమైన భావ ప్రసారం (ఎఫెక్టివ్‌ కమ్యూని  కేషన్‌) అవసరమని అందరికీ తెలిసిందే. అంటే..  సమర్థంగా మాట్లాడితే సరిపోతుందా? ఎంతమాత్రం కాదు. మెరుగైన కమ్యూనికేషన్‌ను సాధ్యం చేసే కీలక నైపుణ్యం.. వినటం! ముఖ్యంగా విద్యార్థి దశలో, ఉద్యోగాన్వేషణ దశలో దీన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం.

Updated : 08 Nov 2023 04:35 IST

కొత్త తరం కొలువులకు ఎంపిక కావాలంటే..   ప్రభావశీలమైన భావ ప్రసారం (ఎఫెక్టివ్‌ కమ్యూని  కేషన్‌) అవసరమని అందరికీ తెలిసిందే. అంటే..  సమర్థంగా మాట్లాడితే సరిపోతుందా? ఎంతమాత్రం కాదు. మెరుగైన కమ్యూనికేషన్‌ను సాధ్యం చేసే కీలక నైపుణ్యం.. వినటం! ముఖ్యంగా విద్యార్థి దశలో, ఉద్యోగాన్వేషణ దశలో దీన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. మరి ఇందుకు ఉపకరించే  మెలకువలను తెలుసుకుందాం!  

రిగా వినకపోతే ఏం జరుగుతుంది? ఎదుటివారు చెప్పింది వేరే రకంగా అర్థం చేసుకునే ప్రమాదం ఏర్పడుతుంది. వినియోగదారుల సేవలతో ముడిపడిన ఉద్యోగ జీవితంలో దీని పర్యవసానాలు ఒక్కోసారి తీవ్రంగా ఉండొచ్చు. అందుకే ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులకు ‘లిసనింగ్‌ స్కిల్స్‌’పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాయి. దీనివల్ల వినియోగదారుల సంతృప్తి, తద్వారా సంస్థల ఎదుగుదల సాధ్యమవుతుంటాయి. అందుకే చాలామంది పారిశ్రామికవేత్తలూ, నాయకులూ.. శ్రద్ధగా ఆలకించగలిగే నైపుణ్యమే తమ అభ్యున్నతికి కారణమని చెప్తుంటారు.

‘వినటం’ అనే పదానికి ఇంగ్లిష్‌లో ‘హియరింగ్‌’, ‘లిసనింగ్‌’ అనే రెండు పదాలున్నాయని తెలిసిందే. అయితే ఈ రెండూ వేర్వేరు భావనలు. చెప్తున్న మాటలూ, శబ్దాలను వినటం - హియరింగ్‌. కానీ లిసనింగ్‌కు ఇంతకుమించి ఏకాగ్రత తప్పనిసరి. వినే అంశంపైనే కాకుండా ఎలా చెప్తున్నారు, స్వరం ఏ తీరులో ఉంది, మాట్లాడే భాష, శరీర భాష ఎలా ఉన్నాయి.. వీటన్నిటినీ గమనించటం. క్లుప్తంగా చెప్పాలంటే... వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ సందేశాలను పరిశీలనతో అవగాహన చేసుకోవటమే- ‘లిసనింగ్‌’.  


ఎలా పెంచుకోవచ్చు?

లిసనింగ్‌ స్కిల్స్‌ను పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. వాటి ఆంగ్ల పదాల మొదటి అక్షరాలను కలిపితే LARSEN.- 
Looks at speakers
:వింటున్నపుడు చెప్పే వ్యక్తిని చూస్తుండటం (ఐ కాంటాక్ట్‌) ముఖ్యం. ఇలా చేస్తే.. పూర్తి ఆసక్తితో, శ్రద్ధతో మనం వింటున్నట్లు చెప్పేవారికి అర్థమవుతుంది.

Asks questions when necessary: అవసరమైన సందర్భంలో ప్రశ్నలు అడగాలి. ఇలా చేస్తే.. ఆ సబ్జెక్టుపై మనకు నిజమైన ఆసక్తి ఉన్నట్టు, అవగాహన చేసుకుంటున్నట్టు... చెప్పే వ్యక్తి గ్రహించగలుగుతాడు.  

Responds regularly & frequently :  క్రమబద్ధంగా, తరచూ స్పందిస్తుండాలి. సంభాషణ సాగుతున్నపుడు ఇలా చేస్తుంటే.. తాను చెపుతున్న విషయం సరిగా, అపార్థాలకు తావు లేకుండా మనకు చేరుతోందని అవతలి వ్యక్తి భావించటానికి ఆస్కారం ఉంటుంది. మన ముఖ కవళికలు మన ఆసక్తిని సూచిస్తాయి.

Stays on subject: చర్చించే సబ్జెక్టును మార్చేలా మన వైఖరి ఉండకూడదు. సంభాషణ దిశ వేరేవైపు మళ్లేలా ప్రశ్నలు అడిగితే.. అది చెప్పేవారికి అసౌకర్యం, విసుగు కలిగించవచ్చు.    

Emotions under control: ఉబలాటంతోనో, తొందరపాటుతోనో మన ఉద్వేగాలను నియంత్రించుకోకపోతే ఎదుటి వ్యక్తి కించపడవచ్చు. ఉదాహరణకు- సంభాషణలో పాల్గొంటున్నపుడు ఎదుటి వ్యక్తి మాట్లాడే తీరునో, మ్యానరిజాలనో ఎత్తి చూపకూడదు. అలా చేయటం సరికాదు. విషయాన్ని వివరించటంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో పద్ధతీ, శైలీ ఉంటాయని మర్చిపోవద్దు.

Never interrupts: ఎదుటివారి మాటలకు మధ్యలో అంతరాయం కల్గించి మనం మాట్లాడటానికి తొందరపడకూడదు. అతడు చెప్తున్నది ముగించేదాకా ఆగి, తర్వాత మాత్రమే మన ఉద్దేశం/ అభిప్రాయం చెప్పాలి.


తరగతి గదిలో...

పాఠాలను చక్కగా అర్థంచేసుకుంటేనే పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలా రాస్తేనే మంచి ర్యాంకూ సాధించగలుగుతారు. ఇది సాధ్యంకావాలంటే.. ముందుగా అధ్యాపకులు చెప్పేది శ్రద్ధగా వినాలి.  

అధ్యాపకులు పాఠాలు బోధిస్తుంటే మానస అన్యమనస్కంగా ఉంటుంది. అదే సమయంలో ఆమె తన కుటుంబ ఆర్థిక సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.  శ్రద్ధగా వినాల్సిన సమయంలో ఇలా ఆలోచించడం తప్పని తెలిసినా.. తన పద్ధతిని మార్చుకోలేకపోతోంది. దాంతో అన్ని సబ్జెక్టుల్లోనూ సహ విద్యార్థులకంటే తక్కువ మార్కులే సాధించగలుగుతోంది.

రోషన్‌ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. రోజూ అర్ధరాత్రి వరకూ స్మార్ట్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తుంటాడు. తరగతిలో అధ్యాపకులు పాఠాలు చెబుతున్నప్పుడు కునికిపాట్లు పడుతుంటాడు. దీంతో పాఠాలేవీ అర్థంకాక ఇబ్బంది పడుతుంటాడు. ఇకనుంచైనా పాఠాలను శ్రద్ధగా వినాలని అనుకుంటున్నాడుగానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాడు.

ఈ విధంగా కొందరు విద్యార్థులు శ్రద్ధగా వినడాన్ని అంత ముఖ్యమైనదిగా గుర్తించరు. భౌతికంగా తరగతిలోనే ఉంటారుగానీ.. ఆలోచనలు మాత్రం మరెక్కడో విహరిస్తుంటాయి. అసలు బోధించేటప్పుడే జాగ్రత్తగా వింటే పాఠ్యాంశం చక్కగా అర్థమై తర్వాత దాన్ని చదవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరమే ఉండదు. శ్రద్ధగా వినడానికి పాటించాల్సిన వివిధ జాగ్రత్తలు ఏమిటంటే..

చెవికి ఎక్కుతోందా: అధ్యాపకులను చూస్తూ పాఠాలు వినడానికి ప్రయత్నించాలి. అంతేగానీ తరగతి గదిలో ఉన్న వివిధ వస్తువులను చూడటం లేదా బయట అటూఇటూ వెళ్లే వాళ్లను గమనించడం లాంటివి చేయకూడదు. దృష్టి ఎటువైపు వెళితే ఆలోచనలూ అటే మళ్లుతాయి. అందుకే అధ్యాపకుల మీదే దృష్టిని నిలిపి పాఠాలు వింటే.. వాళ్లు చెప్పేది చెవికెక్కుతుంది.

కూర్చునే విధానం: శ్రద్ధగా వినడమనేది.. కూర్చునే తీరు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏకాగ్రతతో వినాలంటే వెనక్కు జారబడి విశ్రాంతిగా కాకుండా నిటారుగా కూర్చోవాలి. వెన్నెముకను నిటారుగా పెట్టి.. పాదాలను నేల మీద ఆన్చి కూర్చోవాలి. మోచేతులను ముందు ఉండే బెంచి మీద పెట్టుకోవచ్చు.

ఆలోచనల విహారం: పాఠాలు వినేటప్పుడైనా లేదా ఇతరులు ఏదైనా మాట్లాడేటప్పుడైనా మీ ఆలోచనలన్నీ గతంలోనే.. భవిష్యత్తులోనో విహరిస్తే ప్రయోజనం ఉండదు. కాబట్టి వర్తమానంలో.. అందులోనూ ఈ క్షణంలోనే ఉండటానికి ప్రయత్నించాలి. సాధారణంగా కొంతమంది ఎదుటివాళ్లు చెప్పే దాన్ని సరిగా వినకుండా.. ఆ తర్వాత చేయబోయే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇలా కాకుండా. వింటున్న విషయం మీదే మనసు కేంద్రీకరించాలి.

మొక్కుబడిగా: కొంతమంది మొక్కుబడిగా వింటున్నట్టుగా నటిస్తారు. నిజానికి నేర్చుకోవాలనే తపన ఉన్నవాళ్లు ఎవరూ ఇలా చేయరు. రోజు మొత్తం గడిచిన తర్వాత నిద్రపోవడానికి ముందు.. ‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నాను. ఏవైనా పొరపాట్లు చేశానా?’ లాంటి ప్రశ్నలు ఎవరికివాళ్లు వేసుకుంటే చేసిన తప్పులు తెలుస్తాయి, సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

నియంత్రణ ముఖ్యం: ఆలోచనలను ఎంతవరకు నియంత్రించగలరనే దాని మీదే వినే నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు ఎప్పుడూ నియంత్రణలోనే ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటేనే పాఠ్యాంశాలను శ్రద్ధగా, ఆసక్తితో వినగలుగుతారు. ఒక్కోసారి పాఠం మొత్తం పూర్తయినా ఏమీ అర్థం కాదు. దీని అర్థం- ఆ పాఠాన్ని సరిగా వినలేదనే.  

ప్రశ్నించగలగాలి: సరిగా వినకపోతే అసలు సందేహాలే రావు. ప్రశ్నించారు అంటే.. పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారనే అర్థం. ఈ నైపుణ్యం భవిష్యత్తులోనూ ఎంతో ఉపయోగపడుతుంది. విన్నదాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించడం, అర్థం కానప్పుడు ప్రశ్నించడం విద్యార్థిగానే కాకుండా.. బృంద సభ్యుడిగానో, సంస్థలో ఉద్యోగిగానో.. ఎక్కడైనా సరే ఉపయోగపడుతుంది.

నోట్సు రాయాలంటే: ముఖ్యమైన పాయింట్లను నోట్సులో రాసుకోవాలంటే పాఠం జాగ్రత్తగా వినడం ఎంతో అవసరం. తేలిగ్గా అర్థమయ్యేట్టుగా కీలక పదాలు రాసుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి అధ్యాపకులు ముఖ్యాంశాలను బోర్డు మీద రాస్తుంటారు. వాటిని నోట్‌బుక్‌లో రాసుకున్నా ఫలితం ఉంటుంది. విన్నదాన్ని రాస్తారు.. రాసినదాన్ని మళ్లీ చదువుకుంటారు. కాబట్టి వీటిని మర్చిపోయే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు.

గుర్తుచేసుకోవడం: విన్న విషయం ఎంతవరకూ అర్థమైందో తెలుసుకోవాలంటే.. దాన్నోసారి గుర్తుచేసుకోవడానికీ ప్రయత్నించాలి. ఏకాగ్రతతో విన్నప్పుడే విన్న విషయం గుర్తుకొస్తుంది. అన్యమనస్కంగా వింటే అధ్యాపకులు చెప్పింది ఏమీ గుర్తుకురాదు.

ఫలితాలను ఊహిస్తే: అన్ని సబ్జెక్టులనూ ఒకే విధమైన ఆసక్తితో వినడం అందరికీ సాధ్యంకాకపోవచ్చు. లెక్కలంటే కొందరికి భయం ఉండొచ్చు. దాంతో విసుగ్గా ఇక తప్పదన్నట్టుగా వింటే అవి ఎప్పటికీ అర్థంకావు. ఈ సబ్జెక్టులో నైపుణ్యం సాధించడం వల్ల భవిష్యత్తులో పొందే ఫలితాను ఒకసారి ఊహించుకుంటే శ్రద్ధగా వినగలుగుతారు.

ఆహారమూ ముఖ్యమే: కొంతమంది ఉదయం ఏమీ తినకుండానే తరగతులకు హాజరవుతారు. దీనివల్ల కూడా వినే పాఠ్యాంశాలపై ఏకాగ్రత నిలపలేరు. లంచ్‌టైమ్‌ వరకూ చురుగ్గా ఉండలిగేలా అల్పాహారాన్ని తీసుకోవాలి. అలాగే అర్ధరాత్రి వరకూ మేలుకునివుండి పొద్దున్నే లేచినా.. శ్రద్ధగా వినలేరు. నిద్ర ముంచుకువచ్చి చెప్తున్నవేవీ ఓ పట్టాన బోధపడవు. అందుకని త్వరగా పడుకుని తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని