బీటెక్‌ తర్వాత.. భేషైన మార్గాలెన్నో!

తెలుగు రాష్ట్రాల్లో యూజీ స్థాయిలో ఎక్కువమంది చదువుతోన్న కోర్సు ఇంజినీరింగ్‌.

Updated : 16 Nov 2023 11:13 IST

తెలుగు రాష్ట్రాల్లో యూజీ స్థాయిలో ఎక్కువమంది చదువుతోన్న కోర్సు ఇంజినీరింగ్‌. భారీగా అవకాశాలు అందించడమే ఇందుకు కారణం. బహుళ జాతి సంస్థల్లో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగానికి, మేటి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు, అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలకూ బీటెక్‌ బాటలు వేస్తుంది. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగమైనా, ఉన్నత  చదువులైనా ముందస్తు ప్రణాళికతో సన్నద్ధమైతేనే విజయం సొంతమవుతుంది. అందువల్ల బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని నాలుగేళ్లూ ఆచరిస్తే భవిష్యత్తుకు తిరుగుండదు. తర్వాత ఏంటి? అనే ఆలోచన రాదు.

బీటెక్‌ పూర్తిచేసుకున్నవారికి ఉన్న మార్గాల్లో ముఖ్యమైనవి.. విదేశాల్లో ఎంఎస్‌, ఐఐటీల్లో ఎంటెక్‌, ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు, కార్పొరేట్‌ కొలువులు, ప్రభుత్వ ఉద్యోగాలు. అయితే వీటిలో గమ్యం ఎటువైపో విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం నైపుణ్యాలు, బలాలు, ఆసక్తులు, అవసరాలూ... అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే విజయం దిశగా తొలి అడుగు పడినట్లే. మేటి ఎంపికకు స్వీయ సమీక్ష అత్యున్నత ప్రామాణికం. నచ్చినమార్గాన్ని ఎంచుకున్నవారికి మెచ్చిన అవకాశాలు సొంతమవుతాయి.

ఉన్నత విద్య, ఉద్యోగం... లక్ష్యం ఏదైనప్పటికీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కీలకం. అందువల్ల ప్రథమ సంవత్సరంలోనే ఆంగ్లంపై, భావ వ్యక్తీకరణ మెలకువలపై దృష్టి సారించాలి. అలాగే ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవడానికీ తొలి ఏడాదిని సద్వినియోగం చేసుకోవాలి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో మెరవాలనుకునేవారు అకడమిక్స్‌తోపాటు ఆప్టిట్యూడ్‌పైనా దృష్టి సారించాలి.

విదేశీ విద్య

బీటెక్‌ అనంతరం విదేశాల్లో అందులోనూ ముఖ్యంగా యూఎస్‌లో ఎంఎస్‌ పూర్తిచేయాలనే లక్ష్యం ఉన్నవాళ్లే ఎక్కువ. విదేశాల్లో మేటి సంస్థల్లో ఉన్నత విద్యకు అకడమిక్‌ ప్రతిభతోపాటు జీఆర్‌ఈ స్కోరు కీలకం. అందువల్ల తొలి ఏడాది నుంచే సన్నద్ధతను ప్రారంభిస్తే కోర్సు పూర్తయ్యేసరికి అకడమిక్స్‌తోపాటు జీఆర్‌ఈలోనూ మంచి స్కోరు సాధించడం తేలికవుతుంది. లేదంటే బీటెక్‌ అనంతరం మరో ఏడాది ఆగాలి. ప్రసిద్ధ యూనివర్సిటీల్లో ప్రమాణాలు మెరుగ్గా ఉండటం వల్ల ప్రవేశాలూ అంతే కఠినంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ముందస్తు ప్రణాళిక ఉంటే సమయం వృథా కాకుండా బీటెక్‌ పూర్తవ్వగానే విదేశాలకు వెళ్లిపోవచ్చు.

మేనేజ్‌మెంట్‌

ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఐఐఎంల్లో చేరే బీటెక్‌ విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. పలు కంపెనీలు సాంకేతిక నేపథ్యంతో ఎంబీఏ చదివినవాళ్లను ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికచేస్తున్నాయి. క్యాట్‌ స్కోరుతో ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీ స్కూళ్లలో ప్రవేశాలు లభిస్తాయి. ఎంపికలో ఆప్టిట్యూడ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలకు ప్రాధాన్యం. అందువల్ల ముందునుంచే అందుకు సరిపోయేలా సన్నద్ధం కావాలి. విదేశాల్లోనూ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. కాకపోతే.. యూఎస్‌లో ప్రముఖ యూనివర్సిటీలు పని అనుభవానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అందువల్ల అవకాశాలు పరిమితం. కనీసం రెండు లేదా మూడేళ్ల పని అనుభవం ఉంటే అక్కడ పేరున్న సంస్థల్లో జీమ్యాట్‌ స్కోరుతో అవకాశం పొందవచ్చు.

బోధన- పరిశోధన

అత్యున్నత సాంకేతిక నైపుణ్యం/పరిజ్ఞానం పొందాలని ఆశించే బీటెక్‌ విద్యార్థులు ఎంటెక్‌లో చేరడం మేలు. ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎంటెక్‌+పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికీ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. బోధన, పరిశోధన రంగాల్లో రాణించడానికి ఈ చదువులు దోహద పడతాయి. ఈ విధానంలో చేరినవారికి ఏడాది సమయమూ ఆదా అవుతుంది. గేట్‌ స్కోరుతో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్‌ కాలేజీలు, ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారు ఎంటెక్‌లో రెండేళ్లపాటు ప్రతి నెలా రూ.12,400 స్టైపెండ్‌ పొందవచ్చు. గేట్‌లో అవకాశం రానివాళ్లు పీజీఈసెట్‌ ద్వారా రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరొచ్చు. అయితే ఎంటెక్‌ మేటి సంస్థల్లోనే చదవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తేనే పీజీకి విలువ పెరుగుతుంది. విద్యార్హత పెంచుకోవడానికే ఎంటెక్‌ చదివితే ప్రయోజనం ఉండదు.

భద్రమైన జీవితానికి..

ఒడుదొడుకులు లేని, భద్రమైన కెరియర్‌కు ప్రాధాన్యమిచ్చేవారి సంఖ్యా పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడేవారిలో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉంటున్నారు. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ ఆశావహుల్లోనూ సింహభాగం వీళ్లే. బీటెక్‌ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలెన్నో ఉన్నాయి. ఇంజినీరింగ్‌ అర్హతతోనే ఉన్న కొలువులూ తక్కువేమీ కాదు. అందువల్ల చదువుకున్న ఇంజినీరింగ్‌ బ్రాంచీపై పట్టు సాధిస్తే అది ఉద్యోగానికీ, ఉన్నత విద్య(ఎంటెక్‌)కూ ఉపయోగం.

యూపీఎస్‌సీ: ఇంజినీరింగ్‌ విభాగంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే బీటెక్‌ విద్యార్థులకు.. యూపీఎస్‌సీ ఏటా నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష అత్యుత్తమమైనది. ఎంపికైనవాళ్లు కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగాల్లో రాణించవచ్చు. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపు సివిల్‌ సర్వెంట్లకు ఉన్న ప్రాధాన్యం ఐఈఎస్‌తో ఎంపికైన ఇంజినీర్లకు ఉంటుంది. ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచీల విద్యార్థులూ పరీక్ష రాసుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే జేఈ పరీక్షతో భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు డిప్లొమా విద్యార్హత సరిపోతుంది. అయితే ఇంజినీరింగ్‌ నేపథ్యంతో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఏటా ఈ ప్రకటన వెలువడుతోంది.

ఆర్‌ఆర్‌బీ: రైల్వేల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. రెండు మూడేళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు.  

రక్షణ రంగం: యూపీఎస్‌సీ నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ)లో నేవీ విభాగంలోని ఖాళీలకు బీటెక్‌ చదివినవారే అర్హులు. ఆర్మీలో.. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) ఇంజినీర్స్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ టెక్నికల్‌ పోస్టులకు నిర్దేశిత బ్రాంచీల్లో బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు పోడీపడవచ్చు. ఎయిర్‌ ఫోర్స్‌లో ఏఎఫ్‌క్యాట్‌తో గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ ఉద్యోగాలకు మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవన్నీ అత్యున్నత స్థాయి కొలువులే.

పీఎస్‌యూలు: గేట్‌ స్కోర్‌తో పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్‌ (పీఎస్‌యూ)లు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్నల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇలా సుమారు 50 సంస్థల్లో మేటి కొలువులకు గేట్‌ స్కోరే ప్రామాణికం. సంస్థను బట్టి వార్షిక వేతనం రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు అందుకోవచ్చు. ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సైంటిస్ట్‌ ఇంజినీర్‌ పోస్టులనూ గేట్‌ స్కోరుతోనే భర్తీ చేస్తుంది. అందువల్ల ఇంజినీరింగ్‌ డొమైన్‌ ఉద్యోగాలు ఆశించేవారు బీటెక్‌ ప్రథమ సంవత్సరం నుంచే గేట్‌పై దృష్టిసారించాలి. ఈ పరీక్ష ఉన్నత విద్యకు, అత్యున్నత ఉద్యోగాలకూ దారిచూపుతుంది.  

రాష్ట్ర స్థాయిలోనూ...

ఇంజినీరింగ్‌ పట్టభద్రులు చదువుకున్న విభాగంలో సొంత రాష్ట్రంలోనూ సేవలు అందించడానికి మార్గాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ పరీక్షలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహిస్తున్నాయి. మిగిలిన వాటికి ఆ శాఖల ఆధ్వర్యంలో నియామకాలుంటాయి.

  • రూరల్‌ వాటర్‌ సప్లై శానిటేషన్‌ విభాగంలో.. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులు సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారితో భర్తీ చేస్తారు.
  • ఐఅండ్‌ సీఏడీ, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ తదితర విభాగాల్లో అసిప్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ బ్రాంచీలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లో.. టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీస్‌ పోస్టులకు సివిల్‌ బ్రాంచీ చదివినవారు అర్హులు.
  • అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీలవారుపోటీపడవచ్చు.
  • మెట్రోపాలిటన్‌ అండ్‌ వాటర్‌ సప్లై సివరేజ్‌ బోర్డులో మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) ఉద్యోగాలకు సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బ్రాంచీలవారు సన్నద్ధం కావచ్చు.
  • ఇంజినీర్‌ సబార్డినేట్‌ సర్వీసుల్లో.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు సివిల్‌, మెకానికల్‌ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
  • సివిల్‌ ఇంజినీర్లకు.. రోడ్లు, భవనాలు; పంచాయతీరాజ్‌, ప్రభుత్వ నీటిసరఫరా విభాగాల్లో ఎక్కువ అవకాశాలుంటాయి.
  • ఎలక్ట్రికల్‌ ఇంజీనీర్లకు విద్యుత్‌ సంస్థలు, పంపిణీ బోర్డుల్లో అవకాశాలు లభిస్తాయి.
  • సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీలవాళ్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్‌ ఉద్యోగాలు పొందవచ్చు.
  • బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారు బీటెక్‌ అర్హతతో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ ఉద్యోగానికి పోటీపడవచ్చు.

ఇవేకాకుండా ఏదైనా డిగ్రీ అర్హతతో నిర్వహిస్తోన్న జనరల్‌ ఉద్యోగాలైన.. సివిల్‌ సర్వీసెస్‌, ఆర్‌ఆర్‌బీ నాన్‌టెక్నికల్‌, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌, ఐబీపీఎస్‌ పీవో, క్లరికల్‌; సీడీఎస్‌ఈ, ఏఎఫ్‌క్యాట్‌, సీఏపీఎఫ్‌, గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఎస్సై, కానిస్టేబుల్‌, వీఆర్వో, పంచాయతీ సెక్రెటరీ...తదితర పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

లక్ష్యంపై స్పష్టత ఏర్పరచుకుని మొదటి నుంచీ సరైన ప్రణాళిక రూపొందించుకుని, క్రమశిక్షణతో దాన్ని ఆచరిస్తే బీటెక్‌ పూర్తికాగానే కోరుకున్న దిశలో ప్రయాణం ప్రారంభించవచ్చు. లేదంటే.. తర్వాత ఏంటి? అనే ఆలోచనతో కాలయాపనతోపాటు, తీవ్రమైన పోటీ ఎదుర్కోక తప్పదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు