ఎల్లలు దాటే ముందు ఏం గమనించాలి?

ఉన్నత విద్యాభ్యాసం కోసం సరిహద్దులు దాటి విదేశాల బాట పట్టే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. కెరియర్‌నూ, జీవితాన్నీ మలుపు తిప్పే ఈ కీలక నిర్ణయానికి ముందు..

Published : 11 Jan 2024 00:09 IST

ఉన్నత విద్యాభ్యాసం కోసం సరిహద్దులు దాటి విదేశాల బాట పట్టే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. కెరియర్‌నూ, జీవితాన్నీ మలుపు తిప్పే ఈ కీలక నిర్ణయానికి ముందు.. అక్కడి వాతావరణ, సామాజిక స్థితిగతులపై తగిన అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.

తెలిసినవారు ఎవరో చెప్పారనో, అక్కడ ఉన్న స్నేహితుల నుంచి సాయం అందుతుందనే ఆశతో, ఆలోచనతో ఫలానా దేశంలో చదవాలనే నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. ఈ విషయంలో అన్ని కోణాల్లోనూ ఆలోచించాలి. విదేశీ విద్య నిర్ణయానికి ముందే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి సమగ్ర అవగాహన అవసరం. అవేమిటో చూద్దాం.

ఏ యూనివర్సిటీ: మీరు ఎంచుకున్న కోర్సు ఏ దేశంలో, ఏ యూనివర్సిటీలో అందుబాటులో ఉంది? ఇంజినీరింగ్‌, సైన్స్‌, లా, మేనేజ్‌మెంట్‌, వైద్యం.. ఇలా వివిధ విభాగాలకు చెందిన కోర్సులను అందించడంలో యునైటెడ్‌ స్టేట్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇప్పటికే ప్రసిద్ధిచెందాయి. ఇంజినీరింగ్‌, సైన్స్‌లకు సంబంధించిన కోర్సులకు జర్మనీ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, కెనడాల్లో పరిశోధనావకాశాలు బాగుంటాయి. మీ ఆసక్తి, వృత్తిపరమైన లక్ష్యాలు.. ఈ రెండూ నెరవేరేలా చదవాల్సిన దేశాన్ని ఎంచుకోవాలి.  

బడ్జెట్‌ ముఖ్యం: విదేశాల్లో చదవాలనే కల నెరవేరాలంటే ఆర్థిక పరిస్థితి బాగుండటం ఎంతో అవసరం. ట్యూషన్‌ ఫీజు, వసతి ఖర్చులు, పుస్తకాలు, జీవిత బీమా.. మొదలైనవాటికి ఎంత ఖర్చు అవుతుందనే విషయంలో ముందుగానే బడ్జెట్‌ వేసుకోవడం ఎంతో అవసరం.
ఆరోగ్యం సంగతి: ఆరోగ్యంపైన వాతావరణమూ ప్రభావం చూపుతుంది. మొదటి నుంచీ అలవాటుపడిన వాతావరణానికి భిన్నమైన పరిస్థితులు విదేశాల్లో ఉండొచ్చు. అనుకోని కారణాల వల్ల అనారోగ్య సమస్యలూ ఎదురుకావచ్చు. కాబట్టి ఈ ఖర్చులు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాలి. వైద్యపరమైన ఖర్చుల నిమిత్తం ఆరోగ్య బీమా ఉండేలా జాగ్రత్తపడాలి.

విద్యేతర కార్యక్రమాలు: ఒక్క చదువే కాకుండా.. విద్యేతర విషయాల్లోనూ చురుగ్గా ఉండాలి. యూనివర్సిటీల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొనాలి. సాంస్కృతికపరమైన ప్రదర్శనలు, క్రీడలు, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండాలి. 

తెలుసుకోవాలనే ఆసక్తి: చుట్టూ ఉన్న పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటుపడుతున్నారనే దానిపైనా విద్యార్థి విజయం ఆధారపడి ఉంటుంది. యూనివర్సిటీ ప్రాంగణాల్లోనే కాకుండా డార్మెటరీలు, అపార్ట్‌మెంట్లలో ఉండటం వల్ల విదేశీ సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుంది. అలాగే ఆతిథ్యం ఇచ్చిన దేశ సంప్రదాయాలను తెలుసుకోవాలనే ఆసక్తీ విద్యార్థులకు ఉండాలి.

చట్టాలు, ఆంక్షలు: ముఖ్యమైన కొన్ని విదేశీ చట్టాలు, ఆంక్షల గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటి గురించి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు యూకేలో ఉన్న కొత్త నియమాల ప్రకారం.. వర్క్‌ వీసాలను పొందడానికి ముందే కోర్సులను పూర్తిచేయాలి. అంటే విద్యా, వృత్తిపరమైన మార్గాల మధ్య స్పష్టమైన విభజన ఉండాలి. ఏ యూనివర్సిటీలో, దేశంలో చదవాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు.. ఇలాంటి విషయాలు తెలిసి  ఉండటం చాలా అవసరం. అలాగే వాతావరణం, వెళ్లబోయే దేశానికి సంబంధించిన సాంఘిక, రాజకీయ పరిస్థితుల పట్లా అవగాహన ఉంటే ఇంకా మంచిది. బాధ్యతగా మెలుగుతూ ఉన్నత విద్యను అభ్యసిస్తే .. మాతృదేశానికే గర్వకారణంగా నిలుస్తారు.

ఉద్యోగావకాశాలు: ఉద్యోగావకాశాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఎక్కువమంది విదేశీ విద్యను ఎంచుకుంటారు. ఎంచుకున్న రంగంలో కోర్సు పూర్తిచేసిన తర్వాత వెంటనే ఉద్యోగం పొందే అవకాశం ఉందో లేదో చూసుకోవాలి. చాలా దేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు అంతర్జాతీయంగా ఖ్యాతి గడించాయి. అలాంటి సంస్థలకు పరిశ్రమలతోనూ సంబంధాలు ఉంటాయి. కాబట్టి త్వరగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. వివిధ యూనివర్సిటీల్లో చదివిన వారికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయనే దాని మీదా అవగాహన ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని