వ్యక్తుల మధ్య విభేదాలు యుద్ధ పతనాన్ని శాసించాయి..!

ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, ఫ్రెంచ్‌, బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా మధ్య నెలకొన్న పోటీనే  మొదటి కర్ణాటక యుద్ధానికి కారణంగా పేర్కొనవచ్చు.

Published : 15 Mar 2024 00:22 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర

ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, ఫ్రెంచ్‌, బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా మధ్య నెలకొన్న పోటీనే  మొదటి కర్ణాటక యుద్ధానికి కారణంగా పేర్కొనవచ్చు. అలా ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతో ప్రారంభమైన తొలి కర్ణాటక యుద్ధం అది ముగియగానే ‘ఆక్స్‌-లా-ఛాపెల్‌’ సంధితో తాత్కాలికంగా ముగిసింది. ఫ్రెంచ్‌, ఈస్ట్‌ ఇండియా కంపెనీ వర్గాల మధ్య ఏర్పడిన వైరం తర్వాతి కాలంలో మరో యుద్ధానికి దారి తీసింది.

రెండో కర్ణాటక యుద్ధం (1749 - 1754)

  • రెండో కర్ణాటక యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధానికి కొనసాగింపుగా జరిగింది.
  • ఈ యుద్ధానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
  • మొదటిది భారతదేశంలో స్వదేశీ రాజ్యాలైన ఆర్కాట్‌, హైదరాబాద్‌లో తలెత్తిన వారసత్వ తగాదాలు.
  • రెండోది ఫ్రెంచ్‌, ఆంగ్లో కంపెనీ అధికారుల మధ్య ఏర్పడిన శత్రుత్వం.
  • హైదరాబాద్‌, ఆర్కాట్‌ వారసత్వ తగాదాల్లో ఇరు కంపెనీల్లో వారు వ్యతిరేక కూటమిల్లో చేరారు. దీంతో యుద్ధం తిరిగి మళ్లీ ప్రారంభమైంది.
  • మహారాష్ట్రులు చందాసాహెబ్‌ను 1748లో తమ చెర నుంచి విడుదల చేయడం, మొగల్‌ చక్రవర్తి మహ్మద్‌షా మరణించడం, ఛత్రపతి సాహూ మరణించడం తదితర పరిణామాలు 1748-49 మధ్య కాలంలో చోటుచేసుకున్నాయి. ఈ రాజకీయ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి.
  • ‘ఆక్స్‌-లా-ఛాపెల్‌’ సంధి (1748) ఫ్రెంచ్‌ వారికి భారతదేశంలో ఎలాంటి లాభాలను చేకూర్చలేదు.
  • డూప్లేకు ఈ సంధి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. అతడు భవిష్యత్‌లో ఫ్రెంచ్‌ ఈస్టిండియా ఆధిపత్యాన్ని నెలకొల్పాలనుకున్నాడు.
  • ఆంగ్లేయుల వద్ద ఉన్న పటిష్ఠమైన భారీ నౌకాదళం తమ వద్ద లేదని తెలిసినప్పటికీ డూప్లే యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే అన్వరుద్దీన్‌ను ఎదిరించడానికి సైన్యంతో వచ్చిన చందాసాహెబ్‌కు డూప్లే తన మద్దతు ప్రకటించాడు.
  • ఇదే కాలంలో నిజాం-ఉల్‌-ముల్క్‌ మరణానంతరం హైదరాబాద్‌లో అతడి రెండో కుమారుడు ‘నాజర్‌జంగ్‌’ సింహాసనం అధిష్ఠించాడు. కానీ అతడి పెద్దకుమార్తె కొడుకైన ముజఫర్‌జంగ్‌ హైదరాబాద్‌ సింహాసనం తనకే చెందాలని పట్టుబట్టాడు.
  • దీంతో డూప్లే ముజఫర్‌జంగ్‌కు తన మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా కర్ణాటకలో చందాసాహెబ్‌ను ఈయన సమర్థించాడు.
  • ఈ పరిస్థితులను అంచనా వేసిన ఈస్టిండియా వారు ఆర్కాట్‌ నవాబ్‌ అన్వరుద్దీన్‌తో సంధి కుదుర్చుకోవడానికి లేఖ రాశారు.
  • ఫ్రెంచ్‌ స్థావరాలైన శాంథోమ్‌, పాండిచ్చేరిలను తమకు ఇస్తే 2000 మంది సైనికులతో సహాయం చేస్తామని బ్రిటిష్‌ ఈస్టిండియా వాగ్దానం చేసింది. కానీ డూప్లే ఈ లేఖను నవాబ్‌ అన్వరుద్దీన్‌కు అందకుండా చేశాడు.
  • క్రీ.శ. 1749 ఆగస్టులో డూప్లే, ముజఫర్‌జంగ్‌, చందాసాహెబ్‌ మిత్రకూటమి సైన్యాలు ఆర్కాట్‌ నవాబ్‌ అన్వరుద్దీన్‌పై దండెత్తాయి. ఫ్రెంచ్‌ సైన్యాలకు ‘డి-అతుల్‌’ నాయకత్వం వహించాడు. ఇరుపక్షాల సైన్యాలకు ఆర్కాట్‌ సమీపంలో ఉన్న అంబూరు వద్ద భయంకర యుద్ధం జరిగింది.
  • ఈ యుద్ధంలో అన్వరుద్దీన్‌ మరణించాడు.
  • అన్వరుద్దీన్‌ కుమారుడైన మహ్మద్‌ అలీ ఆర్కాట్‌ వదిలి తిరుచునాపల్లి కోటలో రక్షణ పొందాడు.
  • డూప్లే, తన సేనలు ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకొని అక్కడ ముజఫర్‌జంగ్‌ను దక్కన్‌ సుబేదారుగా, చందాసాహెబ్‌ను కర్ణాటక నవాబ్‌గా ప్రకటించారు.
  • దీంతో మహ్మద్‌ అలీ ఆధీనంలో ఉన్న తిరుచునాపల్లి, జింజీలు తప్ప కర్ణాటక ప్రాంతమంతా ఫ్రెంచ్‌ వారు స్వాధీనం చేసుకున్నారు.
  • గతంలో చేసుకున్న ఒడంబడిక ప్రకారం ముజఫర్‌జంగ్‌ ఫ్రెంచ్‌ వారికి మచిలీపట్నం, దివి ఓడరేవులను అప్పగించారు.
  • కర్ణాటకలో తాము సాధించిన విజయోత్సవాల్లో ఫ్రెంచ్‌ వారు నిమగ్నమై ఉండగా తమ మిత్రుడైన నాజర్‌జంగ్‌ను తక్షణమే హైదరాబాద్‌ నుంచి సైన్యాలతో బయలుదేరి రావాల్సిందిగా ఆదేశాలు పంపారు.
  • క్రీ.శ. 1750లో నాజర్‌జంగ్‌ పదివేల మంది మరాఠా సైనికులతో 600 మంది ఆంగ్లేయ సైనికులతో ఆర్కాట్‌ను ముట్టడించాడు.
  • ఈ దాడిని ముజఫర్‌జంగ్‌ ఎదుర్కొనలేక తన మేనమామకు లొంగిపోయాడు. చందాసాహెబ్‌ పాండిచ్చేరికి పారిపోయాడు.
  • డూప్లే ఇలాంటి పరిస్థితుల్లోనూ బుస్సీ నేతృత్వంలో ఒక దళాన్ని జింజీ ఆక్రమణ కోసం, మరో రెండు సైనిక బలగాలను మచిలీపట్నం ఆక్రమించడానికి పంపాడు.
  • నాజర్‌జంగ్‌ శిబిరంలో తలదాచుకున్న ముజఫర్‌జంగ్‌తో సంధి ప్రయత్నాలు చేశాడు.
  • చివరకు నాజర్‌జంగ్‌ లా -టీషే అనే ఫ్రెంచ్‌ సేనాని నేతృత్వంలో జరిగిన ఆకస్మిక దాడిలో చనిపోయాడు. దీంతో ముజఫర్‌జంగ్‌ దక్కన్‌ (హైదరాబాద్‌) సుబేదార్‌ అయ్యాడు.
  • పాండిచ్చేరిలో డూప్లే సమక్షంలో పట్టాభిషేకం జరిగింది.
  • ముజఫర్‌జంగ్‌ ఫ్రెంచ్‌ వారికి కృష్ణానదికి దక్షిణాన ఉన్న సుబా ప్రాంతాలపై హక్కులు ప్రదానం చేశాడు. దీంతో భారతదేశంలో ఫ్రెంచ్‌వారి గౌరవ ప్రతిష్ఠలు పెరిగాయి.
  • క్రీ.శ.1751లో ఫ్రెంచ్‌ నేతృత్వంలోని సైన్యాల మద్దతుతో ముజఫర్‌జంగ్‌ పాండిచ్చేరి నుంచి హైదరాబాద్‌ ప్రయాణమయ్యాడు. కానీ కడప, కర్నూలు నవాబ్‌లు ముజఫర్‌ను రాయచోటి దగ్గర జరిగిన యుద్ధంలో ఓడించి హత్య చేశాడు.
  • బుస్సీ తెలివిగా వ్యవహరించి ముజఫర్‌జంగ్‌ సోదరుడైన సలాబత్‌జంగ్‌ను హైదరాబాద్‌ సుబేదారుగా ప్రకటించారు. క్రమక్రమంగా హైదరాబాద్‌లో బుస్సీ నాయకత్వంలో ఫ్రెంచ్‌వారి ప్రాబల్యం బలపడింది.
  • రెండో కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి సంధితో ముగిసింది. దక్కన్‌ సుబాలో డూప్లే పథకం విజయవంతమైనా కర్ణాటకలో ఎదురుగాలి వీచింది.

పతనానికి కారణాలు

  • ఆంగ్లేయుల పథకం ప్రకారం రాబర్ట్‌ క్లైవ్‌ నేతృత్వంలో భారీ సైన్యాలను ఆర్కాట్‌ ఆక్రమణ కోసం పంపారు.
  • క్లైవ్‌ ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్న తరవాత కావేరి, శ్రీరంగపట్నం యుద్ధాల్లోనూ ఫ్రెంచ్‌ సేనలను ఓడించాడు. ఇది అతని ఘనతకు నాందిగా పేర్కొనవచ్చు. ఆ తరవాత తిరుచునాపల్లిపై దాడి చేశాడు.
  • ఆంగ్లేయుల సూచన మేరకు మహ్మద్‌ అలీ డూప్లేను నమ్మించి మోసం చేశాడు. తిరుచునాపల్లి వద్ద ఫ్రెంచ్‌ సేనలు ఓడాయి.
  • చందాసాహెబ్‌ను ఆంగ్లేయులు బంధించి, హతమార్చారు.
  • 1752లో మహ్మద్‌ అలీని కర్ణాటక నవాబ్‌గా  ఆంగ్లేయులు ప్రకటించారు.
  • దీంతో కర్ణాటకలో ఫ్రెంచ్‌ ఈస్టిండియా ప్రాబల్యం క్షీణించింది. డూప్లే పథకాలు విఫలమయ్యాయి.
  • మరాఠా, మైసూర్‌ పాలకులతో డూప్లే చర్చలు జరిపాడు. వారిని మహ్మద్‌ అలీ పక్షం చేరకుండా జాగ్రత్త పడ్డాడు.
  • క్రీ.శ. 1754లో పాండిచ్చేరి కొత్త గవర్నర్‌గా ఫ్రెంచ్‌ ఈస్టిండియా కంపెనీ తరపున వచ్చిన గాడెహ్యూ డూప్లేను పదవి నుంచి తొలగించి శాండర్స్‌తో సంధి చేసుకున్నాడు.
  • దీని షరతుల ప్రకారం క్రీ.శ.1748కి పూర్వపు స్థితికి తగ్గట్టుగా ఎవరి ప్రాంతాలను వారే తిరిగి పొందడానికి, స్వదేశీ వ్యవహారాల్లో రెండు కంపెనీలు జోక్యం చేసుకోరాదని ఒప్పుకున్నారు.
  • ఈ విధంగా రెండో కర్ణాటక యుద్ధం ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని నెలకొల్పింది.
  • డూప్లే పతనానికి అతని వ్యక్తిగత బలహీనత కొంతవరకు బాధ్యత అయితే, మాతృదేశం మద్దతు పూర్తిగా లేకపోవడం మరో కారణం.
  • డూప్లే చివరికి స్వదేశంలో 1763లో మరణించాడు.

     

మూడో కర్ణాటక యుద్ధం

(క్రీ.శ. 1756 - 63)

భారతదేశంలో కర్ణాటక ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఆంగ్లో-ఫ్రెంచ్‌ వారి మధ్య జరిగిన యుద్ధాల్లో చివరిది మూడో కర్ణాటక యుద్ధం. ఇది క్రీ.శ. 1756లో ప్రారంభమై ఏడేళ్లపాటు కొనసాగింది.

ముఖ్య కారణాలు

1. గాడెహ్యూ 1754, ఆగస్టు 1న ఈస్టిండియా కంపెనీతో కుదుర్చుకున్న ఒడంబడిక షరతులను ఇరుపక్షాలు చిత్తశుద్ధితో అమలు చేయలేదు.
2. క్రీ.శ. 1756లో ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం (1756 - 63) ఆరంభమైంది. దీంతో మరోసారి ఇంగ్లండ్‌, ఫ్రెంచ్‌ వారు శత్రువులుగా మారారు. ఫలితంగా భారతదేశంలో కూడా ఈ రెండు కంపెనీల మధ్య పోటీ మొదలైంది.

  • సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైందని తెలియగానే మద్రాస్‌ నుంచి వచ్చిన రాబర్ట్‌ క్లైవ్‌, వాట్సాన్‌ ఫ్రెంచ్‌ స్థావరమైన చందానగర్‌పై దాడి చేసి స్వాధీనపరుచుకున్నాడు.
  • గాడెహ్యూ అనంతరం ఫ్రెంచ్‌ ఈస్టిండియా కంపెనీ పాండిచ్చేరి గవర్నర్‌గా థామస్‌ ఆర్థర్‌-కౌంట్‌- డిలాలీని ఏప్రిల్‌ 1758లో నియమించింది.
  • ఇతడు మంచి యోధుడు, సైనికవేత్త. కానీ అతనికి  భారతదేశ రాజకీయాల్లో అనుభవం, సహనం లేవు. తీవ్రమైన ప్రతిఘటన అనంతరం డిలాలీ సెయింట్‌ డేవిడ్‌ కోటను ఆక్రమించాడు.
  • ఇతడు మద్రాస్‌పై దాడి చేశాడు. డూప్లే కాలంలో ఫ్రెంచ్‌ కంపెనీకి బకాయిపడిన తంజావూర్‌ రాజును డబ్బు చెల్లించాల్సిందిగా బలవంతం చేశాడు. అంతేకాకుండా మార్గమధ్యలోని నగోర్‌, తిరువల్లూర్‌ ప్రాంతాల్లో ఫ్రెంచ్‌ సేనలు విధ్వంసం సృష్టించాయి.
  • కానీ తంజావూర్‌ పట్టణాన్ని వశపర్చుకోవడంలో డిలాలీ విఫలమయ్యాడు.
  • ఇదే సమయంలో ‘అడ్మిరల్‌-డి-అషీ’ నేతృత్వంలోని ఫ్రెంచ్‌ నౌకాదళం, పోకాక్‌ నేతృత్వంలోని ఆంగ్లేయ నౌకాదళంతో రెండుసార్లు తలపడ్డాయి. ఇందులో వీరి నౌకాసామర్థ్యం అంతకంతకు తగ్గిపోయింది.
  • రాబర్ట్‌ క్లైవ్‌ సూచనల మేరకు అతడి సేనానులైన సర్‌ ఐర్‌ కూట్‌, ఫోర్డే నాయకత్వంలో ఫ్రెంచ్‌ వారిని దీటుగా ఎదుర్కొన్నారు.
  • డిలాలీ హైదరాబాద్‌లో ఉన్న బుస్సీని పాండిచ్చేరి రావాల్సిందిగా ఆదేశించాడు.
  • బుస్సీ, డిలాలీకి మధ్య విభేదాలే ఫ్రెంచ్‌ కంపెనీ పతనానికి దారి తీశాయి.
  • బుస్సీ హైదరాబాద్‌ నుంచి పాండిచ్చేరి బయలుదేరగానే ఫోర్డే అక్కడ ఫ్రెంచ్‌వారి గత ప్రాబల్యాన్ని తగ్గించాడు.
  • కోస్తా ప్రాంతంలో ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని పెంచుకోవడం ప్రారంభించారు. ఫ్రెంచ్‌ అధికారిని ఓడించి బెస్ట్‌ అనే వ్యక్తిని హైదరాబాద్‌లో సైనిక ఆదివాసీగా నియమించారు.
  • 1758 నవంబరు 17న ఆంగ్లేయులకు, విజయనగరం రాజుకు సంధి కుదిరింది.
  • దీని ప్రకారం కోస్తా ప్రాంతంలో ఫ్రెంచ్‌వారి స్థావరం రద్దయింది. ఆంగ్లేయులు ఉత్తర సర్కారు జిల్లాలను పొందారు.
  • బెంగాల్‌ నుంచి మద్రాస్‌ వరకు ఆంగ్లేయులకు ప్రత్యక్ష మార్గం ఏర్పడింది. క్రీ.శ. 1760 జనవరి 20న వందవాసి వద్ద జరిగిన యుద్ధంలో సర్‌ ఐర్‌ కూట్‌ అనే ఆంగ్ల సేనాధిపతి డిలాలీ, బుస్సీలను ఓడించాడు.
  • 1761లో డిలాలీ ఆంగ్లేయులకు లొంగిపోయాడు.  ఆంగ్లేయులు విడిచిపెట్టిన తర్వాత ఫ్రాన్స్‌లో ఇతడిని ఉరితీశారు.
  • మూడో కర్ణాటక యుద్ధంతో భారతదేశంలో ఫ్రెంచ్‌వారి ప్రాబల్యం బాగా క్షీణించింది.
  • 1763లో ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం పారిస్‌ సంధితో ఆగింది. దీంతో భారతదేశంలో మూడో కర్ణాటక యుద్ధం ముగిసింది.
  • ఈ సంధి ప్రకారం పాండిచ్చేరిని ఫ్రెంచ్‌వారు ఇంగ్లండ్‌కు అప్పగించారు. కానీ బెంగాల్‌లో కేవలం వర్తకం చేసుకోవడానికి ఆంగ్లేయులు వారికి అనుమతించారు.
  • కోటలు కట్టవద్దని ఆంక్షలు విధించారు. కోస్తా ప్రాంతంపై ఆంగ్లేయుల అధికారం విస్తరించింది.
  • మహ్మద్‌అలీ ఆంగ్లేయుల మద్దతుతో ఆర్కాట్‌ నవాబ్‌గా స్థిరపడ్డాడు.
  • హైదరాబాద్‌లో సలాబత్‌జంగ్‌ సంరక్షణ భారాన్ని ఆంగ్లేయులు స్వీకరించి, తమ ప్రాబల్యాన్ని స్థాపించారు.
  • కర్ణాటక యుద్ధాలు సుమారు 20 ఏళ్లపాటు కొనసాగాయి.
  • ఆంగ్లేయ సైనికులు, సేనాధిపతులు, గవర్నర్ల సమష్టి కృషితో ఫ్రెంచ్‌ సేనలు నిర్వీర్యమయ్యాయి.
  • బెంగాల్‌లో రాబర్ట్‌ క్లైవ్‌ ప్లాసీ విజయం (1757), పరిమిత వనరులు, బలహీనమైన నౌకాదళం, సైనిక బలహీనత, నాయకత్వ లోపం ఫ్రెంచ్‌ వారి పతనానికి ముఖ్య కారణాలుగా నిలిచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని