Exams: ‘పది’ పరీక్షలు రాస్తున్నారా? మార్కుల్ని పెంచే 3 ‘పీ’ వ్యూహం ఇదిగో!

మార్చి 18 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న వేళ పదో తరగతి విద్యార్థులకు కొన్ని కీలక సూచనలివే..

Updated : 13 Mar 2024 12:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు (SSC Exams) జరగబోతున్నాయి. విద్యార్థులంతా ప్రిపరేషన్‌ (Preparation)లో తీరికలేకుండా ఉన్నారు. పరీక్షలకు ఇంకా కేవలం ఐదు రోజులే ఉండటంతో విద్యార్థులు తాము ఏ సబ్జెక్టు బాగా చదివారో, దేన్ని సరిగా చదవలేదో నిజాయతీగా సమీక్షించుకొని అందుకనుగుణంగా ప్లాన్‌ చేసుకొని చదివితే మార్కుల్ని పెంచుకోవడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. ప్రిపరేషన్‌తో పాటు పరీక్ష రాసేముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివే..

  • కొద్ది రోజుల్లో జరగబోయే ఈ పరీక్షల కోసం 3 ‘పీ’ వ్యూహాన్ని అనుసరించండి. అవి ప్లానింగ్‌ (ప్రణాళిక), ప్రిపరేషన్‌ (సన్నద్ధత), ప్రెజెంటేషన్‌ (సమర్పణ). అధిక మార్కులు సాధించాలంటే ఈ మూడింటినీ మెరుగ్గా పాటించడం ఎంతో ముఖ్యం.
  • పాఠ్యాంశాల పునశ్చరణకు వీలుగా సొంతగా టైం టేబుల్‌ రూపొందించుకొని చదవాలి. తక్కువ సమయంలో ఎక్కువ చదవాల్సివుందని ఆందోళనకు గురికావొద్దు. ఇంతకుముందు చదివినవే కాబట్టి ప్రణాళిక ప్రకారం వేగంగా అవగాహనతో చదవడం ముఖ్యం.
  • ఇదివరకే పూర్తి స్థాయిలో అన్ని పాఠ్యాంశాల్నీ చదివి ఉన్నవారు అన్ని పాఠాల్లో కీలకాంశాలు, వ్యాకరణాంశాలు, ఆబ్జెక్టివ్‌ టైపు ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
  • పాఠాలను చదివిన తర్వాత ప్రశ్నలను ఊహించుకొని ‘ఫలానా ప్రశ్న వస్తే జవాబు రాయగలనా?’ అని కళ్లు మూసుకొని మననం చేసుకోవడం ఉత్తమం. బ్రేక్‌ పడితే ఎక్కడ సందేహం ఉందో దానిపై దృష్టి సారించి మరోసారి చదివి పట్టు సాధించాలి. గత మాదిరి ప్రశ్నపత్రాలు, పార్ట్‌-బిలను అభ్యాసం చేస్తే మేలు చేస్తుంది.
  • పరీక్ష రాసే ముందు.. ప్రశ్నపత్రం పూర్తిగా చదవాలి. అడిగిన ప్రశ్న, దానికి ఇచ్చిన మార్కులు, జవాబు ఎలా? ఎంత మేరకు రాయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి.
  • ప్రశ్నపత్రం చేతుల్లోకి తీసుకోగానే హడావిడిగా రాయడం మొదలు పెట్టకూడదు. మొదటి 15 నిమిషాలను ప్రశ్నపత్రం చదవడానికి ఉపయోగించాలి. ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవడంతోపాటు రాయడానికి ఒక ప్రణాళిక ఏర్పరుచుకోవాలి.
  • ప్రశ్నపత్రంలో ఛాయిస్‌ ఉన్నప్పుడు ప్రశ్నల ఎంపిక సరిగా ఉండాలి. కఠినంగా ఉన్న ప్రశ్నలపై ఆందోళన చెందొద్దు. తొలుత సులభంగా ఉన్న ప్రశ్నలకు జవాబులు రాసిన తర్వాత కఠిన ప్రశ్నలకు వెళ్లండి.
  • సమయంపై దృష్టి పెట్టండి. దేనికి ఎంత సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. పరీక్ష ముగిసే 5 నిమిషాల ముందు కాషన్‌ బెల్‌ కొడతారు గనక కంగారు లేకుండా రాయండి. ప్రశ్నల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మార్కుల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాసేలా జాగ్రత్త పడండి. 
  • జవాబులు రాయడం పూర్తయిన తర్వాత అన్నింటికీ రాశారా? ప్రశ్నల సంఖ్య సరిగా వేశారా లేదా? జవాబుల్లో అంకెలు సరిగ్గా రాశారో? లేదో? సరిచూసుకోవడం చాలా ముఖ్యం. 
  • సైడ్‌ హెడ్డింగ్‌లను పెన్నుతో అండర్‌లైన్‌ చేయండి. మార్జిన్లను పాటించండి. కోడ్‌ పదాలను రాయొద్దు. పదాలు, వాక్యాలు పూర్తిగా రాయండి. ముఖ్యంగా చేతి రాత బాగుంటేనే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడికి మీ పేపర్‌ పట్ల మంచి ఇంప్రెషన్‌ ఏర్పడటంతో పాటు మీరు రాసే జవాబుల్ని త్వరగా గుర్తించగలుగుతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని