CISEC Results: ఐసీఎస్‌ఈ 10, 12 ఫలితాలు మే 6న.. మరి సీబీఎస్‌ఈ పరీక్షల రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

ఐసీఎస్‌ఈ పది, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 6న విడుదల కానున్నాయి.

Updated : 05 May 2024 17:16 IST

దిల్లీ: ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 6 (సోమవారం) ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (CISCE) ఆదివారం వెల్లడించింది. విద్యార్థులు తమ ఫలితాలను results.cisce.org వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు మార్చి 28తో; ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 13తో ముగిశాయి. మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాలను సిద్ధం చేశారు. విద్యార్థులు తమ యూఐడీ, ఇండెక్స్‌ నంబర్‌లతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలను పొందొచ్చు. ఈ పరీక్షలను దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు రాశారు.

సీబీఎస్‌ఈ ఫలితాలు ఎప్పుడంటే?

లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షలను మే 20 తర్వాతే వెల్లడించే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు ఇటీవల స్పష్టం చేశారు. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు గత కొన్నేళ్లుగా మెరిట్‌ జాబితాలను వెల్లడించకూడదని సీబీఎస్‌ఈ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగ్గా.. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని