‘నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌’ అంటూ ప్రచారం.. ఎన్‌టీఏ రియాక్షన్‌ ఇదే..

నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎన్‌టీఏ కొట్టిపారేసింది.

Published : 05 May 2024 21:17 IST

దిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2024) పరీక్ష పేపర్‌ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఖండించింది. పేపర్‌ లీక్‌ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌లోని మాంటౌన్‌లోని బాలికల హయ్యర్‌ సెకండరీ ఆదర్శ్‌ విద్యా మందిర్‌లో హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఆంగ్ల మాధ్యమం ప్రశ్నపత్రం వచ్చిందని.. ఇన్విజిలేటర్‌ ఆ పొరపాటును సరిదిద్దేటప్పటికే విద్యార్థులు పరీక్ష హాలు నుంచి ప్రశ్నపత్రంతో బలవంతంగా బయటకు వెళ్లిపోయినట్లు ఎన్‌టీఏ సీనియర్‌ అధికారి ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్ష ముగిసిన తర్వాతే విద్యార్థులు ప్రశ్నపత్రంతో హాలు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు. కానీ, కొందరు విద్యార్థులు అలా బలవంతంగా బయటకు వెళ్లడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసినట్లు సదరు అధికారి తెలిపారు. అయితే, ఆ సమయానికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలైపోయిందని, అందువల్ల ప్రశ్నపత్రం లీక్‌ కాలేదంటూ క్లారిటీ ఇచ్చారు.

ఆ 120మందికి మళ్లీ పరీక్ష! 

మరోవైపు, ఇదే అంశంపై ఎన్‌టీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్‌లోని మారుమూల పరీక్ష కేంద్రంలో పేపర్ల పంపిణీలో దొర్లిన పొరపాటు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఆ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 120 మంది విద్యార్థులకు అన్యాయం జరగకుండా వారికి చూసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించింది. ఆ విద్యార్థులకు వేరే తేదీలో మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.  ఈ పరీక్షలను నిర్వహణలో పారదర్శకత, సమగ్రత విషయంలో రాజీపడబోమని పేర్కొంది. ఈ ఘటన ద్వారా మిగతా చోట్ల ఎక్కడా పరీక్ష ప్రక్రియ సమగ్రతకు భంగం వాటిల్లలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా 557 నగరాలు/పట్టణాలు, ఇతర దేశాల్లో 14 సిటీల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్‌ యూజీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని