ts eapcet 2024: టీఎస్‌ ఈఏపీసెట్‌ పరీక్ష.. ఈ ఏడాది నుంచే ‘ఫేషియల్‌ రికగ్నేషన్‌’ అమలు

టీఎస్‌ ఈఏపీసెట్‌ రాసే విద్యార్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు.

Updated : 29 Apr 2024 17:31 IST

TS EAPCET 2024 Exam | హైదరాబాద్‌: తెలంగాణలో ఈఏపీసెట్‌(TS EAPCET 2024) పరీక్షకు ఈ ఏడాది 3.54 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు జేఎన్‌టీయూలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లకు అనుమతి లేదని స్పష్టంచేశారు. చేతులకు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడదని సూచించారు. విద్యార్థులు నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. 90 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి 20 కేంద్రాలు అదనంగా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఒకే సమయంలో మరో పరీక్ష రాయాల్సిఉంటే గనక విద్యార్థులు ముందుగా విజ్ఞప్తి చేసుకుంటే వారికి అనుకూలమైన తేదీలో పరీక్ష నిర్వహించేలా చూస్తామన్నారు.

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే..

ఈ ఏడాది నుంచే ఫేసియల్‌ రికగ్నేషన్‌ అమలు!

ఈ ఏడాది ఇంజినీరింగ్‌కు 2,54,543 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మాకు 1,00,260 మంది చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఈఏపీసెట్‌ కన్వీనర్‌ డీన్ కుమార్ తెలిపారు. మొత్తంగా 3,54,803 దరఖాస్తులు అందినట్లు చెప్పారు.  21 జోన్లలో పరీక్ష నిర్వహిస్తుండగా.. వీటిలో తెలంగాణలో 16, ఏపీలో 5 జోన్‌లు ఉన్నాయన్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మాకు 135, ఇంజినీరింగ్‌కు 166 కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కనీసం 20 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. నోటిఫికేషన్‌ ఇచ్చే సమయానికి విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు పూర్తి కాలేదని, అందువల్ల ఈ ఏడాది ఏపీ విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయని స్పష్టంచేశారు. గతేడాదితో పోలిస్తే ఏపీ నుంచి ఇంజినీరింగ్‌కు 2 వేల దరఖాస్తులు తగ్గాయన్నారు. ఈ ఏడాది ఫేషియల్‌ రికగ్నేషన్‌ ద్వారా అభ్యర్థుల గుర్తింపును అమలుచేస్తామని ఆయన తెలిపారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని