Fresh Air - Health: స్వచ్ఛమైన గాలి ప్రయోజనాలు తెలుసా?

స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటం మనసుకే కాదు.. శరీరానికీ మంచిదే. అవేంటో తెలుసుకుందాం!

Updated : 14 Jan 2024 16:27 IST

ప్రశాంతమైన వాతావరణం. చల్లటి గాలి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. ఇలాంటి సమయంలో ఆరు బయట తాజా గాలిని (Fresh Air) పీల్చుకుంటుంటే కలిగే ఆనందమే వేరు. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చోకుండా, ఏసీ గదుల్లోనే గడపకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్లి, కాసేపు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటం మనసుకే కాదు.. శరీరానికీ (Helath) మంచిదే. దీంతో ఎన్నెన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. (Fresh Air Benefits)

ఊపిరితిత్తులు శుభ్రం

ఇంట్లోని గాలిలో.. ముఖ్యంగా గాలి ఆడని చోట ఆక్సిజన్‌, నైట్రోజన్‌, కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదులు సరైన పాళ్లలో ఉండవు. అదే ఆరుబయట తాజా గాలిలో ఆక్సిజన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా గాలిలో ఎక్కువ ఆక్సిజన్‌ ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలు విప్పారతాయి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రపడే ప్రక్రియ, కణజాలం మరమ్మతయ్యే ప్రక్రియ పుంజుకుంటాయి. ఆక్సిజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువుల మార్పిడి తేలికగా జరుగుతుంది. ఒకపక్క ఊపిరితిత్తులు శుభ్రం అవుతూనే మరోపక్క శరీరం విషతుల్యాలను వదిలించుకుంటుంది. అంటే ఒకే పనికి రెండు లాభాలు అన్నమాట.

ఏకాగ్రత మెరుగు

తాజా గాలిని ఎక్కువగా పీల్చుకుంటున్నకొద్దీ రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులూ పెరుగుతూ వస్తాయి. మనం పీల్చుకునే ఆక్సిజన్‌లో 20% మెదడే వాడుకుంటుంది. అందువల్ల రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు పెరిగితే మెదడు కూడా చురుకుగా, పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇనుమడిస్తాయి. రక్తంలో ఆక్సిజన్‌ పెరిగితే సెరటోనిన్‌ విడుదల కూడా ఎక్కువవుతుంది. ఇది ఆనందం, సంతోషం కలిగేలా చేస్తుంది. ఆందోళన తగ్గుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

రక్తపోటు తగ్గుముఖం

మన శరీరంలో ప్రతి కణానికీ ఆక్సిజన్‌ అవసరం. రక్తంలో ఆక్సిజన్‌ తగ్గినప్పుడు గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను అవసరమైన భాగాలకు చేరవేయటానికి ప్రయత్నిస్తుంది. అదే తాజా గాలిని పీల్చుకున్నామనుకోండి. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరిగి అన్ని కణాలకూ తగినంత అందుతుంది. గుండెకు శ్రమ తగ్గి విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా గుండె వేగం నెమ్మదిస్తుంది. రక్తపోటూ తగ్గుతుంది.

త్వరగా కోలుకోవటం

జబ్బులు, గాయాల నుంచి కోలుకునే సమయంలో శరీరం మీద తీవ్ర భారం పడుతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టుకు రావటానికి మరింత ఎక్కువ ఆక్సిజన్‌ అవసరమవుతుంది. ఇలాంటి సమయంలో తాజా గాలి ఎంతగానో మేలు చేస్తుంది. జబ్బుల నుంచి, గాయాల నుంచి త్వరగా కోలుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైన గాలిలో బ్యాక్టీరియా, వైరస్‌లు ఎంతోసేపు జీవించలేవు. అందువల్ల గాలి ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్ల ముప్పూ తగ్గుతుంది.

జీర్ణక్రియ మెరుగు

ఒక్క ఆక్సిజనే కాదు, ఆరుబయటకు వెళ్లటమే కొన్నిసార్లు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డెస్క్‌ దగ్గరో, ఏవో పనులు చేస్తూనో తింటున్నట్టయితే శరీరం జీర్ణాశయం నుంచి మెదడుకు రక్తాన్ని మళ్లించాల్సి వస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడయితే పరిస్థితి మరింత విషమిస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు శరీరం కండరాలకు ఎక్కువగా రక్తాన్ని సరఫరా చేస్తుంది. అందువల్ల ఆరుబయటకు వెళ్లి కాసేపు విశ్రాంతిగా గడిపితే కణాలకు తగినంత ఆక్సిజన్‌ లభిస్తుంది. అదే సమయంలో జీర్ణాశయానికి, పేగులకు రక్త సరఫరా పుంజుకొని జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని