స్తంభనకు షాక్‌

అంగ స్తంభన లోపానికి షాక్‌ చికిత్స! నిజంగా ఇది షాక్‌ కొట్టే విషయమే. జననాంగాలు ఎంత సున్నితమో తెలిసిందే. అలాంటి చోట్ల షాక్‌ చికిత్స అంటే ఎవరికైనా భయం పుట్టుకొస్తుంది.

Updated : 26 Mar 2024 20:59 IST

అంగ స్తంభన లోపానికి షాక్‌ చికిత్స! నిజంగా ఇది షాక్‌ కొట్టే విషయమే. జననాంగాలు ఎంత సున్నితమో తెలిసిందే. అలాంటి చోట్ల షాక్‌ చికిత్స అంటే ఎవరికైనా భయం పుట్టుకొస్తుంది. కానీ అంగ స్తంభన లోపానికి తక్కువ తీవ్రతతో కూడిన షాక్‌వేవ్‌ చికిత్స (ఎల్‌ఐఎస్‌డబ్ల్యూటీ) కొత్త విధానంగా ఉపయోగపడుతుండటం విచిత్రం. కిడ్నీల్లో రాళ్లను పగలగొట్టటానికి వాడే ఇది స్తంభన లోపానికి ఎలా పనికొస్తుంది?

అంగం స్తంభించి, గట్టిపడాలంటే తగినంత రక్తం సరఫరా కావాలి. రక్త ప్రసరణను తగ్గించే రక్తనాళాల్లో పూడికలు, మధుమేహం వంటి జబ్బులేవైనా స్తంభన సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చు. తక్కువ తీవ్రతతో కూడిన షాక్‌ చికిత్సతో అంగంలోని రక్తనాళాలు తిరిగి కోలుకుంటున్నట్టు, మరింత బలోపేతమవుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా స్తంభన సామర్థ్యం పుంజుకుంటోందని చెబుతున్నాయి. కిడ్నీ రాళ్లను పగల గొట్టటానికి చాలాకాలంగా షాక్‌ చికిత్సను వాడటం చూస్తూనే ఉన్నాం. దీర్ఘకాలంగా మానకుండా వేధించే పుండ్లకు.. ప్లాంటార్‌ ఫేషియైటిస్‌ వంటి కండర బంధనాలు, స్నాయువుల చికిత్సలోనూ ఇది ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఒక మాదిరి, స్వల్ప స్తంభన లోపానికి కొత్త చికిత్సగానూ పేరొందుతుండటం గమనార్హం. వయాగ్రా వంటి మందులతో మంచి ఫలితం కనిపించేవారికి దీంతో గుణం కనిపిస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. నాడులు దెబ్బతినటం, మానసిక సమస్యల వంటివాటితో స్తంభనలోపం గలవారికి మాత్రం అంతగా ఉపయోగపడదు.

 ఎలా పనిచేస్తుంది?

 ఎల్‌ఐఎస్‌డబ్ల్యూ చికిత్సను దఫదఫాలుగా నెల వరకూ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చికిత్సకు సుమారు 15 నిమిషాలు పడుతుంది. ఇందులో మత్తుమందేమీ ఇవ్వరు. పొడవైన, పల్చటి కర్ర మాదిరిగా ఉండే పరికరంతో అంగానికి స్వల్పంగా షాక్‌ తరంగాలను ప్రసారం చేస్తారు. ఈ సమయంలో నొప్పేమీ కలగదు. చాలామందికి చికిత్స చేస్తున్న విషయమూ తెలియదు. ఎవరికైనా ఏదైనా భాగంలో అసౌకర్యంగా అనిపిస్తే అక్కడ షాక్‌ తీవ్రతను తగ్గిస్తారు. అయితే దీని ఫలితాలు శాశ్వతమేమీ కాదు. ఒకట్రెండు ఏళ్ల వరకే ఫలితం కనిపిస్తుంది. షాక్‌ చికిత్స తీసుకున్నవారిలో వయాగ్రా వంటి మందుల అవసరం లేకుండానే అంగం స్తంభిస్తున్నట్టు కొందరి అనుభవాలు చెబుతున్నాయి. కొందరికి మాత్రం మందులు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అయితే షాక్‌ చికిత్స అనంతరం మరింత తృప్తి కలుగుతోందనీ కొందరు భావిస్తుండటం గమనార్హం. మొత్తమ్మీద పూర్తిగా కాకపోయినా 75% వరకూ షాక్‌ చికిత్సతో సంతృప్తి కలుగుతుండటం విశేషం.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు