ముక్కు సరిగా!

ముక్కు చూడు ముక్కందం చూడు అని ఊరికే అనలేదు. ముఖ సౌందర్యంలో ముక్కు ప్రాధాన్యం అలాంటిది. మహిళల నాసికను సంపెంగ, పురుషుల ముక్కును కోటేరుతో పోల్చి కవులు మురిసి పోయారు.

Updated : 20 Feb 2024 07:12 IST

ముక్కు చూడు ముక్కందం చూడు అని ఊరికే అనలేదు. ముఖ సౌందర్యంలో ముక్కు ప్రాధాన్యం అలాంటిది. మహిళల నాసికను సంపెంగ, పురుషుల ముక్కును కోటేరుతో పోల్చి కవులు మురిసి పోయారు. కానీ అందరికీ ఈ ఉపమానాలు సరిపడకపోవచ్చు. గద్ద ముక్కు, చప్పిడి ముక్కు, వంకర ముక్కులతో ఎంతోమంది లోలోపలే మథనపడుతుండటం తెలిసిందే. అలాగే బాధపడుతూ ఉండాల్సిన పనేమీ లేదని ముక్కును సరిదిద్దే రైనోప్లాస్టీ చికిత్స భరోసా ఇస్తోంది. పుట్టుకతోనో, గాయాలతోనో మారిన ముక్కు ఆకారాన్ని సరిచేసి, సౌందర్యాన్ని తిరిగి ఇనుమడింప జేయటం దీని ప్రత్యేకత. ఇప్పటికే ప్రముఖులతో పాటు ఎంతోమంది సామాన్యులూ దీని సాయంతో నాసికలను చూడ ముచ్చటగా తీర్చిదిద్దుకున్నారు. మరి దీని వివరాలేంటో చూద్దామా.

పొద్దున లేచి అద్దంలో ముఖాన్ని చూసుకుంటే కొట్టొచ్చినట్టు కనిపించేది ముక్కే. ఒక్క సౌందర్యపరంగానే కాదు.. శ్వాస తీసుకోవటం, వాసనలు గ్రహించటం వంటి పనులకూ ఇదే ఆధారం. ముఖంలో సరిగ్గా మధ్యలో ఉంటూ అందానికి ప్రతిబింబంలా భాసిల్లుతుంది. అందుకేనేమో ముక్కు ఏ కొంచెం తేడాగా ఉన్నా ఏదోలా అనిపిస్తుంటుంది. మనసు కలుక్కుమంటుంది. ముక్కు ఎబ్బెట్టుగా కనిపిస్తోందని భావించేవారు మానసిక ఒత్తిడికి, ఆందోళనకూ గురవుతుంటారు. ఇలాంటివారికి రైనోప్లాస్టీ బాగా ఉపయోగపడుతోంది. దీన్ని ప్లాస్టిక్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ద నోస్‌ అనీ అంటుంటారు. ప్లాస్టిక్‌ అంటే ముక్కులో ఏదో ప్లాస్టిక్‌ అమరుస్తారని కాదు. కృత్రిమ పదార్థం గానీ పరికరాన్ని గానీ ఏమీ అమర్చరు. ఎబ్బెట్టుగా కనిపించటానికి కారణమయ్యే భాగాలను తొలగించి సరిచేస్తారంతే. అందుకే ఈ పద్ధతిని కాస్మెటిక్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ద నోస్‌ అని అనటమే సబబు. దీంతో ముక్కు ఆకారాన్ని సరిదిద్దొచ్చు, మరింత అందంగా కనిపించేలానూ తీర్చిదిద్దొచ్చు. అంతేకాదు.. ముక్కు పనితీరు సజావుగా ఉండేలా చూడటానికీ ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా చేయించుకునే సౌందర్య శస్త్రచికిత్సల్లో ఇది ప్రధానమైంది.

మూడు భాగాలుగా..

ముక్కును అడ్డంగా మొదటి నుంచి కొస వరకూ మూడు వంతులుగా విభజించొచ్చు. కనుబొమల మధ్య నుంచి ఆరంభమయ్యే తొలి భాగంలో ఎముకలు.. మధ్య, చివరి వంతుల్లో మృదులాస్థి ఉంటాయి. వీటి మీద మృదు కణజాలం, చర్మం పరచుకొని ఉంటాయి. ముక్కుకు ఒక ఆకారాన్ని తెచ్చిపెట్టేవి ఇవే. కొందరికి ముక్కు ఎముక మెలి తిరిగి పోవచ్చు. ఎముక ఎత్తుగా, పెద్ద మొత్తంలోనూ ఉండొచ్చు. మధ్య, చివరి భాగాల్లో మృదులాస్థి పెద్దగా లేదా చిన్నగా ఉండొచ్చు. ఫలితంగా రకరకాల మార్పులు తలెత్తుతుంటాయి. ఇందులో చర్మం పాత్ర కూడా కీలకమే. చర్మం పలుచగా ఉన్నవారికి.. ముఖ్యంగా ఆడవారిలో కింద ముక్కు నిర్మాణమూ కనిపిస్తుంటుంది. దీంతో మార్పులూ స్పష్టంగా కనిపిస్తుంటాయి.


మార్పులు రకరకాలు

గద్ద ముక్కు (నేసల్‌ హంప్‌): మామూలుగా ముక్కు తిన్నగా, వాలుగా ఉంటుంది. కానీ కొందరికి పైభాగంలో ఎముక ఎత్తుగా ఉండొచ్చు. కొందరికి మృదులాస్థి కూడా పెద్దగా ఉండొచ్చు. దీంతో ముక్కు మధ్యలో మూపురం మాదిరిగా ఎత్తుగా.. చూడ్డానికి గద్ద ముక్కులా కనిపిస్తుంది. కొందరికి జన్యు స్వభావం వల్ల పుట్టుకతోనే గద్ద ముక్కు ఏర్పడొచ్చు. ఇది బాల్యంలో అంతగా కనిపించదు. యుక్తవయసులో ముక్కు ఇంకా ఎదుగుతున్న దశలో ప్రస్ఫుటం కావటం మొదలవుతుంది.
వంగటం (డీవియేటెడ్‌ నోస్‌): ముక్కు తిన్నగా ఉండటానికి ముక్కుదూలం ముఖ్యం. దీన్ని బట్టే ముక్కు ఆకారం ఆధారపడి ఉంటుంది. ఇది వంపు తిరిగితే పై నుంచి ముక్కూ పక్కలకు వంగుతుంది. కొందరిలో ముక్కు సి ఆకారంలో కుడికి గానీ ఎడమకు గానీ వంగి ఉంటుంది. దీన్ని క్రుకెడ్‌ నోస్‌ అనీ అంటారు. కొందరికి గాయాల మూలంగానూ ముక్కు వంగిపోవచ్చు. ముక్కు పక్కకు ఒరిగిన వారు జీవితంలో ఎప్పుడో అప్పుడు గాయాలకు గురవ్వటం కనిపిస్తుంటుంది.
చప్పిడి ముక్కు (సాడిల్‌ నోస్‌): కొందరిలో ముక్కు మీది ఎముక చిన్నగా ఉంటుంది. మృదులాస్థి కూడా చిన్నగా ఉండొచ్చు. దీంతో మధ్యభాగంలో ముక్కు అణగిపోయినట్టు కనిపిస్తుంది. ఇది కొందరిలో శ్వాసకూ ఇబ్బంది కలిగించొచ్చు. కొందరికిది పుట్టుకతో రావొచ్చు. ముక్కుదూలంలో గాయం కారణంగా రక్తం గూడు కట్టటం, ఇన్‌ఫెక్షన్‌ మూలంగా చీము ఏర్పడటం, వాపు వంటివీ దీనికి దారితీయొచ్చు. వీటితో ముందు భాగంలో ఉన్న మృదులాస్థి కరిగిపోయి, చప్పిడి ముక్కు ఏర్పడుతుంది.  
పెద్ద ముక్కు (బల్బస్‌ టిప్‌): ముఖాన్ని నిలువుగానూ మూడు వంతులుగా విభజించొచ్చు. ముక్కు పక్కల కనుబొమ్మల కొసల నుంచి నిలువుగా రెండు గీతలు గీస్తే ముక్కు వెడల్పు వీటికి మధ్యలో ఉండాలి. ఇలా ఉంటే సరిగా ఉన్నట్టు. ముక్కు వెడల్పు గీతలను దాటుకొని వస్తే పెద్ద ముక్కు ఉన్నట్టు. ముఖ్యంగా వీరిలో ముక్కు చివరి భాగం పెద్దగా, లావుగా ఉంటుంది. మృదులాస్థి, మృదుకణజాలం, చర్మం మందంగా ఉండటం దీనికి కారణం.
చిన్నగా, పొడవుగా: కొందరికి ముక్కు మరీ చిన్నగా ఉండొచ్చు. కొందరికి పొడవుగా.. పై పెదవినీ దాటుకొని రావొచ్చు.
-నిజానికి పుట్టుకతో సహజంగా ఏర్పడే ఇలాంటి నాసికా మార్పులేమీ ప్రమాదకరమైనవి కావు. హాని చేసేవీ కావు. కానీ కొందరిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లేలా చేయొచ్చు. శస్త్రచికిత్సతో సరిచేసుకోవటం ద్వారా హాయిగా, ఆనందంగా ఉండొచ్చు.

కొన్ని సమస్యలతోనూ..

అందంగా, ఆకర్షణీయంగా కనిపించటానికి ముక్కు సరిచేసుకోవాలని భావించేవారు తక్కువే. ముఖ్యంగా యువతీ యువకులు, పెళ్లి చేసుకోవాలని అనుకునేవారు, టీవీ, సినిమా రంగాల్లో పనిచేసేవారు ఆకర్షణీయంగా కనిపించటానికి ముక్కు సరి చేసుకోవాలని భావిస్తుంటారు. అయితే వీరిలో చాలామందికి ముక్కుదూలం వంకరగా ఉండటం వంటి ఇతరత్రా సమస్యలూ ఉంటుంటాయి. వీటికీ రైనోప్లాస్టీ అవసరమవుతుంది.
- దూలం వంకర: ముక్కు రంధ్రాలను వేరు చేస్తూ.. మధ్యలో దూలం ఉంటుంది. దీనిలోనూ వెనక భాగంలో ఎముక, ముందు భాగంలో మృదులాస్థి ఉంటాయి. కొందరికిది ఒకవైపునకు వంగుతుంటుంది. ఇది తిన్నగా ఉంటేనే శ్వాస సరిగా ఆడుతుంది. వంకర తిరిగితే గాలి సరిగా ఆడదు.
- గాయాలు: కొందరికి గాయాలతోనూ ముక్కు ఆకారం మారిపోవచ్చు.  
- గ్రహణ మొర్రి: ఇది కేవలం పెదవి, అంగిలి చీలికతోనే ముడిపడి ఉండదు. వీరిలో చాలామందికి ముక్కు వంకరగానూ ఉంటుంది. దీనికి కారణం ఒక వైపు మృదులాస్థి చిన్నగా, మరోవైపు పెద్దగా ఉండటం. గ్రహణం మొర్రి పిల్లలకు చిన్నప్పుడే.. ఆరునెలల వయసులోనే చీలిపోయిన పెదవిని సరిచేయాలి. 18 నెలల వయసులో అంగిలిని సరిచేయాలి. పెద్దగా అయ్యాక ముక్కునూ సరిచేయాల్సి ఉంటుంది.


శస్త్రచికిత్స- రెండు రకాలు

రైనోప్లాస్టీ రెండు రకాలు. ఒకటి- ముక్కులోపలి నుంచి చేసేది (ఎండో నేసల్‌ అప్రోచ్‌). చిన్న చిన్న సవరణలను దీంతోనే చేయొచ్చు. ఇందులో బయట ఎలాంటి కోతలు, కుట్లు ఉండవు. ముక్కు చుట్టుపక్కలే మత్తుమందు ఇచ్చి దీన్ని చేస్తారు. ముక్కు రంధ్రాల్లోంచి వెళ్లి ఎముకలు, మృదులాస్థి వంటి వాటిని తొలగిస్తారు. రెండు- బయటి నుంచి చేసేది (ఓపెన్‌ స్ట్రక్చర్‌ రైనోప్లాస్టీ). ఇది పెద్ద సవరణలకు ఉపయోగపడుతుంది. బయటి నుంచి చిన్న గాటు పెట్టి దీన్ని చేస్తారు. దీనికి జనరల్‌ అనస్తీషియా అవసరమవుతుంది. మత్తుమందు ఇచ్చిన తర్వాత పై పెదవి మీద, ముక్కు రంధ్రాల మధ్య (కాల్‌మెల్లా) తలకిందుల వీ ఆకారంలో గాటు పెడతారు. అలాగే ముక్కు రంధ్రాల పక్కల లోపలి నుంచి చర్మం కిందుగా కోత పెడతారు. తర్వాత పై చర్మాన్ని, మృదుకణజాలాన్ని పైకి లేపి.. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేస్తారు. (వివిధ చికిత్సల వివరాలు బాక్స్‌లో)

చికిత్స అనంతరం

  • ఓపెన్‌ పద్ధతిలో శస్త్రచికిత్స చేసినవారికి పెదవి పైన వేసిన కుట్లను ఐదు రోజులకు తీసేస్తారు. అతి సన్నటి పోచలతో కుట్లు వేస్తారు కాబట్టి కోత మానిన తర్వాత మచ్చ ఏమీ ఏర్పడదు.
  •  శస్త్రచికిత్స చేశాక ముక్కు మీద చిన్న పట్టీలు (స్ప్లింట్స్‌), ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ పట్టీ వేస్తారు. వీటిని వారం తర్వాత తీసేస్తారు.
  • ముక్కు ఎముకలు కుదురుకోవటానికి 2-4 వారాలు పడుతుంది. కాబట్టి తొలి రెండు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బోర్లా పడుకోవద్దు. బోర్లా పడుకుంటే ఎముకలు పక్కకు ఒరిగి, ఆకారం మారిపోవచ్చు. ముక్కును చేత్తో రుద్దుకోవటం, ఈత కొట్టటం వంటివి చేయొద్దు. ముక్కుకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. మరీ బిగ్గరగా నవ్వకూడదు. ముక్కు మీద అద్దాలు పెట్టుకోవద్దు. మొత్తమ్మీద ముక్కు మీద ఒత్తిడి, భారం పడకుండా చూసుకోవాలి.
  •  శస్త్రచికిత్స అనంతరం 6 వారాల వరకు వాపు ఉంటుంది. నిజానికి తొలివారంలోనే 80-90% వరకూ వాపు తగ్గిపోతుంది. వారం తర్వాత యథావిధిగా ఉద్యోగాలు, పనులు చేసుకోవచ్చు. 4-6 వారాల తర్వాత ఫొటోలు తీస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. చర్మం మందంగా, కణజాలం పెద్దగా ఉన్నవారికి మొదట్లోనే తేడా కనిపించినా ఏడాది తర్వాత గానీ పూర్తి మార్పు కనిపించదు.  
  •  శస్త్రచికిత్సతో సంతృప్తి పొందనివారికి తర్వాత చిన్న చిన్న మార్పులు చేయాల్సిన అవసరముంటుంది. సుమారు 5% మందికిది అవసరమవుతుంది.
  •  చర్మం మందంగా గలవారికి ముక్కును సరిచేయటం కాస్త కష్టమైన పనే అని చెప్పుకోవాలి. వీరికి చర్మం కింద ఎముక, మృదులాస్థి మాత్రమే కాకుండా మృదు కణజాలం, కొవ్వునూ తగ్గించాల్సి ఉంటుంది. అప్పుడే చర్మం మందం తగ్గి మంచి ఫలితం కనిపిస్తుంది. కాకపోతే ఇందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది.

ఫొటోలు ముఖ్యం

ముక్కు సరిచేసుకోవాలనుకునేవారికి ముందుగా ముక్కు తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఇందులో ఫొటోలు తీయటం చాలా ముఖ్యం. చికిత్స చేయటానికి ముందు ముఖాన్ని రకరకాల కోణాల్లో ఫొటోలు తీస్తారు. ముఖాన్ని ముందు నుంచి, కింది నుంచి, పక్కల నుంచి, పై నుంచి ఫొటోలు తీసి చూడటం తప్పనిసరి. ఎందుకంటే శస్త్రచికిత్స అనంతరం అంతకుముందు ముక్కు ఎలా ఉందనే విషయాన్ని చాలామంది మరచిపోతారు. చిన్న చిన్న మార్పులైతే అసలే కనిపించవు. చికిత్సకు ముందు, తర్వాత ఫొటోలను తీసి, వాటిని పోల్చి చూస్తే గానీ మార్పులు తెలియవు. ముక్కు సరిచేయించుకున్నవారు తృప్తి పడటానికి ఈ ఫొటోలు బాగా ఉపయోగపడతాయి.
 ముక్కు, ముక్కు చుట్టుపక్కల గాలిగదుల (సైనసెస్‌) తీరుతెన్నులను తెలుసుకోవటానికి సీటీ స్కాన్‌ అవసరం.
ఇప్పుడు ముక్కు శస్త్రచికిత్సను నిర్ణయించటంలో కొన్ని సాఫ్ట్‌వేర్లు కూడా తోడ్పడుతున్నాయి. వీటి సాయంతో శస్త్రచికిత్స అనంతరం ముక్కు ఎలా కనిపిస్తుందో చూచాయగా ముందే తెలుసుకోవచ్చు.


ఏ ముక్కును ఎలా సరి చేస్తారు?

ముక్కు కొస పెద్దగా 

ముందు                              తర్వాత 

 గద్ద ముక్కు గలవారికి ఎక్కువగా ఉన్న ఎముక, మృదులాస్థిని తొలగిస్తారు. అలాగే ముక్కు పక్కభాగాలు ముఖానికి కలిసే చోట ఎముకలను విరగ్గొట్టి (ఆస్టియాటమీ), లోపలికి నెడతారు. ఇలా సరైన ఆకారం వచ్చేలా కుదురుస్తారు.  

  •  ముక్కు కొస (టిప్‌) పెద్దగా ఉన్నవారికి ప్రత్యేకమైన పద్ధతిలో కుట్లు వేసి మృదులాస్థి సైజును తగ్గిస్తారు. అవసరమైతే చర్మం కింద మృదుకణజాలం మందాన్నీ తగ్గిస్తారు. ఈ కుట్లు ఆరునెలల తర్వాత వాటంతటవే కరిగిపోతాయి. ముక్కు ఆకారం సరిదిద్దుకుంటుంది. ముక్కు కొస మరీ పెద్దగా ఉంటే కొందరికి అధికంగా ఉన్న మృదులాస్థిని కూడా తొలగించాల్సి రావొచ్చు.
  • చప్పిడి ముక్కు, చిన్న ముక్కు గలవారికి ముక్కుదూలం, చెవుల నుంచి మృదులాస్థిని తెచ్చి, అవసరమైన ఆకారంలోకి మలిచి, కుడతారు. లోపం మరీ ఎక్కువగా ఉంటే పక్కటెముక మృదులాస్థిని కూడా వాడుకోవచ్చు. ఇది అక్కడే కుదురుకొని ముక్కు ఆకారం సరి అవుతుంది. త్వరగా శస్త్రచికిత్స పూర్తి కావటానికి కృత్రిమ పదార్థాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి కొన్నిసార్లు బయటకు పొడుచుకొచ్చి, ఊడిపోయే ప్రమాదముంది. అందువల్ల సొంత మృదులాస్థిని వాడుకోవటానికే ప్రాధాన్యమిస్తారు.

చప్పిడి ముక్కు 

ముందు                              తర్వాత 

  •  ముక్కు పొడవుగా ఉన్నవారికి మృదులాస్థిని కత్తిరించి, ముక్కుదూలం సైజును తగ్గిస్తారు. దీంతో ముక్కు పొడవూ తగ్గుతుంది.
  •  ముక్కుదూలం వంకరగా ఉన్నవారికి వెనక ఎముక, మృదులాస్థి మధ్యలో కత్తిరించి వేరు చేస్తారు. ఎక్కువగా ఉన్నభాగాన్ని తీసేసి, తిన్నగా ఉండేలా అమర్చుతారు (సెప్టోప్లాస్టీ). వంపు తిరిగిన భాగాన్ని సరిచేసి, మధ్యలోకి తీసుకొస్తారు. దీంతో చాలావరకు ముక్కు తిన్నగా అవుతుంది.
  •  కొందరికి పుట్టుకతోనే గడ్డం భాగం చిన్నగా ఉంటుంది. వీరికి ముక్కును సరిచేసినా అంత బాగా కనిపించరు. అందువల్ల గడ్డాన్ని కూడా సరిదిద్దాల్సి ఉంటుంది (మెంటోప్లాస్టీ). గడ్డానికి కింద ఇంప్లాంట్‌ను అమర్చి పెద్దగా చేయాల్సి ఉంటుంది. అప్పుడు ముఖంలో అడ్డం భాగాలన్నీ సమానమవుతాయి. అందంగా కనిపిస్తారు.
  •  ప్రమాదాల్లో ముక్కు ఎముకలు విరిగినవారికి వీలైనంత త్వరగా.. 7-10 రోజుల్లోనే ఎముకలను కుదిర్చి, సరిచేయాలి. ఆలస్యమైతే ఎముకలు అలాగే గట్టిపడతాయి. మున్ముందు రైనోప్లాస్టీ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని