ఒత్తిడి గజ్జి

ఎండుగజ్జి (ఎగ్జిమా) ఇబ్బంది పెడుతోందా? అయితే మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారేమో కూడా చూసుకోండి. ఎందుకంటే దీంతోనూ ఎండుగజ్జి ప్రేరేపితం కావొచ్చు.

Updated : 13 Feb 2024 00:45 IST

ఎండుగజ్జి (ఎగ్జిమా) ఇబ్బంది పెడుతోందా? అయితే మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారేమో కూడా చూసుకోండి. ఎందుకంటే దీంతోనూ ఎండుగజ్జి ప్రేరేపితం కావొచ్చు. మొదట్లో చర్మం ఎండిపోయి, దురద పెడుతుంది. తర్వాత దద్దు ఆరంభమవుతుంది. ఒత్తిడితో పాటు ఇదీ ఎక్కువవుతూ వస్తుంది. ఒత్తిడికి లోనైనప్పుడు కార్టిజోల్‌ హార్మోన్‌ పెద్దఎత్తున విడుదలవుతుంది. ఇది అన్ని అవయవాలతో పాటు చర్మానికీ చేరుకొని, ప్రభావం చూపుతుంది. మరోవైపు అలర్జీని తెచ్చిపెట్టే హిస్టమిన్లూ విడుదలవుతాయి. ఇవి దురదను పుట్టించి, ఎగ్జిమాకు దారితీస్తాయి. అలాగే ఒత్తిడి ప్రతిస్పందనలో భాగంగా పుట్టుకొచ్చే ఇమ్యునోగ్లోబులిన్‌ ఇ కూడా దురదను మరింత ఎక్కువ చేస్తుంది. మొత్తమ్మీద మానసిక ఒత్తిడి మూలంగా ఒంట్లో తలెత్తే ప్రతిచర్యలు చర్మం మీదా ప్రభావం చూపుతాయి. లోపల ఒత్తిడిని ఇలా బయటకు ప్రతిబింబించేలా చేస్తాయి.

 ఏంటీ సంబంధం?

 బ్యాక్టీరియా వంటి హానికారకాలు శరీరంలోకి ప్రవేశించకుండా చర్మం కోట గోడలా అడ్డుకుంటుంది. చర్మం మీద మంచి చేసే సూక్షక్రిములతో పాటు నూనెలు, తేమ కూడా ఉంటాయి. ఇవన్నీ చర్మం ఆరోగ్యానికి తోడ్పడతాయి. మానసిక ఒత్తిడితో ఈ సూక్ష్మక్రిముల ప్రపంచం కుదేలవుతుంది. వీటి మధ్య సమతుల్యత లోపిస్తుంది. కార్టిజోల్‌ హార్మోన్‌ చర్మం నూనెల ఉత్పత్తినీ దెబ్బతీస్తుంది. దీంతో చర్మం పొడిబారి, చికాకు తలెత్తుతుంది. ఎండుగజ్జి గలవారిలో చర్మం పొడిబారటం, గరుకుగా అవటం, దురద, దద్దు, వాపు, అక్కడక్కడా మందం కావటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒత్తిడి పెరుగుతున్నకొద్దీ ఇవీ ఎక్కువవుతుంటాయి.

కొందరికి ఎక్కువగా వస్తుందా?

తరచూ గజ్జి ఉద్ధృతమయ్యేవారికి ఒత్తిడి మరిన్ని చిక్కులు కలిగిస్తుంది. ఇది చర్మంలో వాపుప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) మరింతగా ప్రేరేపిస్తుంది. గజ్జి లేనివారిలోనూ మానసిక ఒత్తిడి మరీ ఎక్కువైతే ఎగ్జిమాకు దారితీస్తుంది. అతిగా ఒత్తిడికి గురిచేసే ఘటనలు ఎదుర్కొనవారికిది వచ్చే అవకాశముంది.

భావోద్వేగాలతోనూ..

ఎండుగజ్జి, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమస్యలకు దగ్గరి సంబంధముంది. నిజానికి ఎగ్జిమా గలవారిలో 30 శాతానికి పైగా మందిలో ఆందోళన, కుంగుబాటూ కనిపిస్తుంటాయి. పైకి స్పష్టంగా కనిపించే, బాగా దురద పెట్టే దీర్ఘకాల చర్మ సమస్యలేవైనా రోజువారీ జీవితం మీద చాలా ప్రభావం చూపుతాయి. ఇవి నిద్రను, మూడ్‌ను దెబ్బతీస్తాయి. ఇతరులు చూస్తే ఏమనుకుంటారోననే భావనతో నలుగురిలోకి వెళ్లటానికీ వెనకాడుతుంటారు. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ ఆందోళన, కుంగుబాటూ పెరుగుతాయి. ఇదో విష వలయంగా మారుతుంది. కాబట్టి దీన్ని ఛేదించే ప్రయత్నం చేయాలి.

అదుపులో ఉంచుకోవచ్చు..

మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఎండుగజ్జినీ అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

  •  వ్యాయామం: దీంతో హాయి భావన కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. సానుకూల భావనలు పుంజుకుంటాయి. ఆనందం, సంతోషంతో చేసే ఎలాంటి వ్యాయామమైనా ఉపయోగపడుతుంది. ఎంత ఎక్కువగా శ్రమిస్తే అంత ఎక్కువగా ఎండార్ఫిన్లు పుట్టుకొస్తాయి. అయితే వ్యాయామం చేశాక గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం మరవొద్దు. లేకపోతే చెమట, దద్దు చర్మాన్ని చికాకుకు గురిచేస్తాయి.
  •  ఆహారం: వాపు ప్రక్రియను తగ్గించే పండ్లు, కూరగాయలు, పప్పులు, చేపల వంటివి తినటం మంచిది. అలాగే పిండి పదార్థాలు, చక్కెర తగ్గించుకోవాలి.
  •  నిద్ర: ఒత్తిడి, గజ్జి తోడైతే కంటి నిండా నిద్ర పట్టటం కష్టం. కానీ నిద్ర పట్టేలా చూసుకోవటం అత్యవసరం. రోజూ వేళకు పడుకోవటం, లేవటం.. పడుకోవటానికి ముందు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాలకు దూరంగా ఉండటం.. పడకగది ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవటం వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు. మొత్తమ్మీద రాత్రిపూట 7-9 గంటలు నిద్రించాలి.
  •  ధ్యానం, యోగా: ఇవి మానసిక విశ్రాంతిని కలిగిస్తాయి. ఫలితంగా ఒత్తిడీ తగ్గుతుంది. కాబట్టి మనసును ఏదో ఒక దాని మీద నిలిపి కాసేపు ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. గాఢంగా శ్వాస తీసుకొని వదిలే ప్రాణాయామమూ మేలే.
  •  చికిత్స తోడు: కొన్నిసార్లు మానసిక వైద్యుడి సాయం అవసరమవ్వచ్చు. డాక్టర్‌తో మాట్లాడితే ఒత్తిడికి దారితీస్తున్న అంశాలు తెలిసి వస్తాయి. వాటి నుంచి బయటపడే మార్గాలనూ సూచిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని