ఎండు గజ్జి అదుపులో..

ఎండు గజ్జి (ఎగ్జిమా) మొండి సమస్య. ఒక పట్టాన తగ్గకుండా తీవ్రమైన దురదతో వేధిస్తుంది. గోకటం మొదలెడితే చేయి తీయాలనైనా అనిపించదు. ఇది ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది. గోకటం వల్ల చర్మం గీసుకుపోతుంది.

Published : 12 Dec 2023 01:00 IST

ఎండు గజ్జి (ఎగ్జిమా) మొండి సమస్య. ఒక పట్టాన తగ్గకుండా తీవ్రమైన దురదతో వేధిస్తుంది. గోకటం మొదలెడితే చేయి తీయాలనైనా అనిపించదు. ఇది ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది. గోకటం వల్ల చర్మం గీసుకుపోతుంది. వాపు సరేసరి. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి పొక్కులు ఏర్పడతాయి. అవి పగిలి రసి కారుతుంది. క్రమంగా అట్టకడుతుంది. దీంతో చర్మం గరుకుగా అవుతుంది. చెక్కు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్మం మరింత దెబ్బతినకుండా, ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవటానికి ప్రయత్నించటం ముఖ్యం. మరి ఇందుకు ఏం చేయాలి?

గోకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి

దురద పుడితే గోకకుండా ఎలా ఉంటాం? ఇక గజ్జిలోనైతే అది మరింత కష్టం. అయినా కూడా వీలైనంత వరకు గోకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. గోళ్లతో గోకటానికి బదులు వేలి చివర్లతో నొక్కి పట్టొచ్చు, లేదా రుద్దొచ్చు. గజ్జి ఉన్న చోటును చూడకుండా ఉండటమూ మేలు చేస్తుంది. చూడకపోతే గోకాలనే ఆలోచనా తగ్గుతుంది.


చర్మం తేమగా

దెబ్బతిన్న చర్మం తేమను సరిగా పట్టి ఉంచలేదు. కాబట్టి అక్కడ రోజుకు చాలాసార్లు మందంగా మాయిశ్చరైజర్‌ రాసుకోవటం మేలు చేస్తుంది. ఇది తేమను పట్టి ఉంచటం ద్వారా హాయిని కలిగిస్తుంది. దురద భావన తగ్గుతుంది. మినరల్‌ నూనె, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకోవటమూ ఉపయోగపడతాయి. వీటిల్లో చర్మానికి సరిపోయినవి ఎంచుకోవాలి.


ఓట్స్‌ నీటితో స్నానం

ఓట్స్‌లోని ప్రత్యేక రసాయన మిశ్రమాలు చర్మం పైపొరను బలోపేతం చేస్తాయి. కాబట్టి ఓట్స్‌ అటుకులను మెత్తగా పొడి చేసి, గోరు వెచ్చటి నీటిలో కలిపి 10 నిమిషాల సేపు స్నానం చేయటం మంచిది. స్నానం పూర్తయ్యాక తువ్వాలుతో అద్దుకొని, చర్మం పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఆ వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.


తడి పొరల మేలు

దురద తీవ్రంగా ఉన్నప్పుడు తడి పొర హాయిని కలిగిస్తుంది. ఇది ఉబ్బిన చర్మానికి సాంత్వన చేకూరుస్తుంది. తేమను పట్టి ఉంచుతుంది. బ్యాండేజీ గుడ్డను గోరు వెచ్చటి నీటిలో ముంచి, దాన్ని గజ్జి ఉన్న చోట పెట్టి నెమ్మదిగా అదమాలి. దీని మీద పొడి బట్టను గానీ బ్యాండేజీ గుడ్డను గానీ చుట్టాలి. కొద్ది గంటల పాటు అలాగే ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రంతా ఉంచినా మేలే. అయితే తడి ఆరకుండా చూసుకోవాలి.


అలర్జీ మందులు

దురద మరీ ఎక్కువగా ఉంటే సిట్రిజిన్‌, ఫెక్సోఫెనడైన్‌ వంటి యాంటీహిస్టమిన్‌ మాత్రలు వాడుకోవచ్చు. ఇవి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. అయితే డైఫెనీడ్రమైన్‌ మందు నిద్రమత్తు కలిగిస్తుంది. ఇలాంటి మందులను పడుకునేటప్పుడే వేసుకోవాలి. వీటిని వేసుకొని వాహనాలు నడపటం వంటి పనులు చేయొద్దు.


చర్మ సంరక్షణతోనూ..

రోజువారీ చర్మ సంరక్షణ పద్ధతులూ గజ్జి నుంచి ఉపశమనం పొందటానికి తోడ్పడతాయి. చర్మం మరింత దెబ్బతినకుండా కాపాడతాయి.

  •  కఠినమైన, మరీ ఘాటు వాసనలతో కూడిన సబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవి చర్మం నుంచి సహజ నూనెలను ఎక్కువగా తొలగిస్తాయి. వీటిల్లోని వాసనలు, రంగులు, సుగంధ ద్రవ్యాలు దురద, అలర్జీకి కారణం కావొచ్చు. కాబట్టి స్నానానికి మృదువైన సబ్బులు వాడుకోవాలి.
  •  బిగుతైనవి, అలాగే గరుకుగా ఉండే ఉన్ని దుస్తులు చర్మానికి చికాకు కలిగిస్తాయి. అందువల్ల వదులైన దుస్తులు వేసుకోవాలి. మెత్తటి, నూలు దుస్తులైతే మరీ మంచిది.
  •  గజ్జి ఉన్నవారికి చెమట మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. కాబట్టి గదిలో ఫ్యాన్‌, ఏసీ వేసుకోవాలి. గాలి ఆడే దుస్తులు ధరించాలి.
  •  వేడి, పొడి గాలి చర్మం నుంచి తేమను లాగేస్తుంది. ఇది దురద పుట్టేలా చేస్తుంది. అందువల్ల వీలైతే ఇంట్లో హ్యూమిడిఫయర్‌ పరికరం అమర్చుకోవాలి. ఇది నీటి ఆవిరిని గాలిలోకి వెదజల్లుతుంది. ఇలా చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.
  •  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటమూ ముఖ్యమే. ఎందుకంటే ప్రతికూల ఆలోచనలు గజ్జి ఉద్ధృతమయ్యేలా చేస్తాయి. యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులతో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే మానసిక నిపుణుల సాయమూ తీసుకోవాలి.
  •  మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయాటిక్స్‌ను ఆహారంలో చేర్చుకోవటమూ ఉపయోగపడుతుంది. ఇవి గజ్జి అదుపులో ఉండటానికి, లక్షణాలు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రొబయాటిక్స్‌ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. అలర్జీలను నియంత్రిస్తాయి. మనం రోజూ వాడే పెరుగు, మజ్జిగ ప్రొబయాటిక్స్‌గా ఉపయోగపడతాయి. ఇవి మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు