రొమ్ముక్యాన్సర్‌పై కొత్త చూపు

రొమ్ముక్యాన్సర్‌ పెద్ద శాపంగా పరిణమిస్తోంది. మనదేశంలో ఇది ఇంకాస్త చిన్న వయసులోనే దాడిచేస్తోంది. రొమ్ముక్యాన్సర్‌ బారినపడుతున్న మహిళల్లో 30% మంది 40 ఏళ్లలోపు వారేనని ఇటీవల ఎయిమ్స్‌ నిర్వహించిన అధ్యయనంలో బయటపడటమే దీనికి నిదర్శనం.

Published : 02 Jan 2024 01:11 IST

రొమ్ముక్యాన్సర్‌ పెద్ద శాపంగా పరిణమిస్తోంది. మనదేశంలో ఇది ఇంకాస్త చిన్న వయసులోనే దాడిచేస్తోంది. రొమ్ముక్యాన్సర్‌ బారినపడుతున్న మహిళల్లో 30% మంది 40 ఏళ్లలోపు వారేనని ఇటీవల ఎయిమ్స్‌ నిర్వహించిన అధ్యయనంలో బయటపడటమే దీనికి నిదర్శనం. మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ తరచూ కనిపించే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్‌ ఒకటి. అందుకే దీని నిర్ధరణ, చికిత్సలను మెరుగుపరచటానికి పరిశోధకులు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు. ఇవి అద్భుతమైన ఫలితాలనూ అందిస్తున్నాయి. నానోటెక్నాలజీ దగ్గరి నుంచి అధునాతన పరీక్షల వరకూ కొత్త పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని..


 మెరుగైన ఇమేజింగ్‌

 సాధారణంగా మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌ ద్వారా రొమ్ముక్యాన్సర్‌ పరీక్షలను నిర్వహిస్తుంటారు. కొన్నిసార్లు రొమ్ము ఎంఆర్‌ఐ కూడా చేస్తారు. ఇవే కాదు.. కొత్తరకం ఇమేజింగ్‌ పరీక్షల మీదా పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
ఆప్టికల్‌ ఇమేజింగ్‌: రొమ్ముల్లోకి కాంతిని ప్రసరింపజేయటం ఇందులోని కీలకాంశం. కణజాలం గుండా ప్రసారమైన లేదా వెనక్కి తిరిగి వచ్చే కాంతి మొత్తాన్ని బట్టి క్యాన్సర్‌ ఉన్నదీ, లేనిదీ తేలుతుంది. ఎంఆర్‌ఐ లేదా 3డీ మామోగ్రామ్‌లతో ఈ పరీక్షను మేళవించి రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధరించటం మీదా పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
మాలిక్యులర్‌ బ్రెస్ట్‌ ఇమేజింగ్‌ (ఎంబీఐ): డాక్టర్లు సిర ద్వారా స్వల్ప రేడియోధార్మికతతో కూడిన మందును ఒంట్లోకి ఎక్కిస్తారు. ఇది రొమ్ముల్లోకి వెళ్లి క్యాన్సర్‌ కణాలకు అంటుకుంటుంది. ప్రత్యేక కెమెరా సాయంతో మందును, కణాలను గుర్తిస్తారు.
రొమ్ము కణజాలం మందంగా గలవారిలో మామోగ్రామ్‌తో పాటు ఈ పరీక్షను నిర్వహించటం మీద పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. రొమ్ముల్లో గడ్డలు, అసాధారణ భాగాలు ఉన్నట్టు మామోగ్రామ్‌లో తేలినవారికీ ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నారు.
పొసిట్రాన్‌ ఎమిషన్‌ మామోగ్రఫీ (పీఈఎం): రేడియోధార్మిక రేణువులకు చక్కెరను జోడించి క్యాన్సర్‌ కణాలను పట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎంఆర్‌ఐ అవసరమైనప్పటికీ ఈ పరీక్ష చేయటం కుదరనివారికిది మేలు చేస్తుంది.
ఎలక్ట్రికల్‌ ఇంపీడెన్స్‌ టోమోగ్రఫీ (ఈఐటీ): ఇందులో చర్మం మీద చిన్న ఎలక్ట్రోడ్లు అమర్చి, వీటి ద్వారా కొంత విద్యుత్తును రొమ్ములోకి పంపిస్తారు. మామూలు కణాల కన్నా రొమ్ము క్యాన్సర్‌ కణాల నుంచి కాస్త భిన్నంగా విద్యుత్తు ప్రసారమవుతుంది. ఈ తేడాల సాయంతో క్యాన్సర్‌ కణాలను గుర్తిస్తారు.


కృత్రిమ మేధ ప్లస్‌ మామోగ్రామ్‌

మామోగ్రామ్‌లను రేడియాలజిస్టులు పరిశీలించి రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను పట్టుకుంటారు. అయితే మనుషులు పొరపాటు చేసే అవకాశం లేకపోలేదు. కొందరిలో జబ్బు లేకపోయినా ఉన్నట్టు, జబ్బు ఉన్నా లేనట్టు నిర్ణయించొచ్చు. ఇలాంటి తప్పులను నివారించటానికి నిపుణులు ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌ సాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఒకటి కన్నా ఎక్కువ ఆల్గారిథమ్‌లతో పరిశీలిస్తే మరింత కచ్చితంగా క్యాన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటోంది. అందుకే మానవ, కృత్రిమ మేధ రెండింటినీ మేళవించటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.


టార్గెటెడ్‌ చికిత్స

కొందరు రొమ్ముక్యాన్సర్‌ బాధితుల్లో హెచ్‌ఈఆర్‌2 ప్రొటీన్‌ కనిపిస్తుంటుంది. దీన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే కణాలపై నేరుగా దాడిచేసే మందులు ఎందరికో మేలు చేస్తున్నాయి. ఇలాంటి కొత్త కొత్త మందులను ఎన్నింటినో శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఇవి మంచి ఫలితాన్ని చూపిస్తున్నాయి.


ఎముక మీద చికిత్స

రొమ్ముక్యాన్సర్‌ ఎముకకూ విస్తరించొచ్చు. దీన్ని నివారించటానికి, చికిత్స చేయటానికీ మందులు అందుబాటులోకి వచ్చాయి. పామిడ్రోనేట్‌, జోలెండ్రోనిక్‌ యాసిడ్‌ వంటి మందులు ఎముక బలంగా ఉండేందుకు తోడ్పడతాయి. రొమ్ముక్యాన్సర్‌ మూలంగా ఎముక విరిగే ముప్పును తగ్గించటానికీ ఇవి ఉపయోగపడతాయి. అలాగే డెనోసుమాబ్‌ మందూ మేలు చేస్తుంది.


లిక్విడ్‌ బయాప్సీ

రక్తంలో స్వల్ప మొత్తంలో సంచరించే క్యాన్సర్‌ కణితి డీఎన్‌ఏను గుర్తించటం దీని ప్రత్యేకత. చికిత్స తీసుకునే సమయంలో కణితి ఎలా మారుతోందో తెలుసుకోవటానికిది తోడ్పడుతుంది. ఇలా ఆయా వ్యక్తులకు అనుగుణంగా చికిత్సలను నిర్ణయించటానికి దోహదం చేస్తుంది. ఈ పరీక్ష కణితిలో జన్యు మార్పులనూ పసిగడుతుంది. కాబట్టి డాక్టర్లు త్వరగా చికిత్సల్లో మార్పులు చేయటానికి అవకాశముంటుంది. అయితే దీనికి కొన్ని పరిమితులు లేకపోలేదు. క్యాన్సర్‌ కణాల కన్నా తెల్ల రక్తకణాలకు చెందిన మార్పులే ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. అందుకే రొమ్ముక్యాన్సర్‌ చికిత్సలో లిక్విడ్‌ బయాప్సీని అత్యుత్తమంగా ఉపయోగించుకునే మార్గాలను గుర్తించటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.


నానోటెక్నాలజీ

నానోటెక్నాలజీ అనేది కంటికి కనిపించని అతి సూక్ష్మ రేణువులతో ముడిపడిన పరిజ్ఞానం. ఈ రేణువులను కీమోథెరపీతో జోడించి నేరుగా క్యాన్సర్‌ కణాల మీదే దాడిచేసేలా చేయొచ్చు. అప్పుడు చుట్టుపక్కల కణజాలానికి ఎలాంటి హాని కలగదు. దీంతో మందులు ఇంకాస్త సమర్థంగా పనిచేస్తాయి. దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. ఇందుకోసం చాలా మందులకు అనుమతి లభించింది. కొన్ని మందులపై ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి. నానోటెక్నాలజీతో కూడిన పరికరాలు క్యాన్సర్‌ను గుర్తించటానికీ తోడ్పడతాయి. రక్తం, ఇతర శరీర ద్రవాల్లో క్యాన్సర్‌ ఆనవాళ్లను పట్టుకోవటంలోనూ సాయం చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని