మధుమేహానికో సర్జరీ

బరువు తగ్గటానికి తోడ్పడే బేరియాట్రిక్‌ సర్జరీ మున్ముందు మధుమేహ చికిత్సల్లో ప్రముఖ స్థానం దక్కించుకోనుందా? తాజా అధ్యయన ఫలితాలను బట్టి చూస్తే ఇది నిజమయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు తోస్తోంది.

Updated : 12 Mar 2024 10:50 IST

బరువు తగ్గటానికి తోడ్పడే బేరియాట్రిక్‌ సర్జరీ మున్ముందు మధుమేహ చికిత్సల్లో ప్రముఖ స్థానం దక్కించుకోనుందా? తాజా అధ్యయన ఫలితాలను బట్టి చూస్తే ఇది నిజమయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు తోస్తోంది. ఆహార, వ్యాయామ నియమాల వంటి జీవనశైలి మార్పులతో పోలిస్తే బేరియాట్రిక్‌ సర్జరీతో మరింత మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు తేలింది మరి. మధుమేహ నియంత్రణలో జీవనశైలి మార్పులు, మందుల పాత్ర ఎనలేనిది. వీటితో మంచి ఫలితం కనిపిస్తుండటం కాదనలేని సత్యం. కానీ ఎందుకనో కొందరిలో ఇవి అంతగా ఉపయోగపడవు. రక్తంలో గ్లూకోజు, బరువు అదుపు కష్టమైన పనిగా మారుతుంది. ఇక్కడే బేరియాట్రిక్‌ సర్జరీ ప్రాధాన్యం సంతరించు కుంటోంది. నిజానికి బరువు తగ్గటం కోసమే ఇది పుట్టుకొచ్చింది. ఇప్పుడు మధుమేహం విషయంలోనూ ఆశా జనకంగా కనిపిస్తోంది. దీని ప్రయోజనాలు స్వల్ప వ్యవధికే పరిమితమా? దీర్ఘకాలంలోనూ కొనసాగుతాయా? అనే దానిపై పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు 14 ఏళ్ల క్రితం ఆరంభమైన దీని ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. మధుమేహంతో బాధపడుతూ.. అధిక బరువు, ఊబకాయం గల 262 మందిని ఎంచు కున్నారు. వీరిలో 166 మంది బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకోగా.. 96 మంది మందులు వేసుకోవటంతో పాటు జీవనశైలి మార్పులను పాటించారు. వీరిని పరిశోధకులు చాలాకాలం నిశితంగా పరిశీలించి, ఫలితాలను బేరీజు వేశారు. బేరియాట్రిక్‌ సర్జరీలో జీర్ణాశయం లేదా చిన్నపేగుల పరిమాణాన్ని తగ్గిస్తారు. ఇందులో గ్యాస్ట్రిక్‌ బైపాస్‌, గ్యాస్ట్రిక్‌ స్లీవ్‌ వంటి రకరకాల పద్ధతులున్నాయి. వీటిని చేయించుకున్నవారిలో రక్తంలో గ్లూకోజు నియంత్రణ, మధుమేహం వెనక్కి మళ్లటం, కొలెస్ట్రాల్‌ తగ్గటం, బరువు అదుపులో ఉండటం వంటివన్నీ మరింత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ దీర్ఘకాలం కొనసాగుతూ వస్తుండటం విశేషం. బేరియాట్రిక్‌ సర్జరీని చేయించుకున్నవారిలో ఏడేళ్ల తర్వాత 18% మందిలో మధుమేహం వెనక్కి మళ్లగా.. మందులు, జీవనశైలి మార్పులను అనుసరించినవారిలో 6% మందిలోనే జబ్బు వెనక్కి మళ్లింది. కానీ 12 ఏళ్ల తర్వాత పరిశీలించగా మందులు/జీవనశైలి బృందంలో మధుమేహం వెనక్కి మళ్లిన వారెవరూ కనిపించలేదు. అదే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవారిలో 13% మందిలో జబ్బు వెనక్కి మళ్లటం కొనసాగుతూ వచ్చింది. మందులు వేసుకోకపోయినా రక్తంలో గ్లూకోజు మోతాదులు నార్మల్‌కు చేరుకోవటాన్ని మధుమేహం వెనక్కి మళ్లటంగా భావిస్తారు. అలాగని సర్జరీ చేసుకున్నంత మాత్రాన ఎప్పటికీ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారేమో. కొందరికి మందులూ అవసరమయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు. సర్జరీ చేయించుకున్న ఏడాది తర్వాత కేవలం 38% మందే మందులు కొనసాగించగా.. ఏడేళ్ల తర్వాత వీరి సంఖ్య 61 శాతానికి ఎగబాకింది. అయితే వీరిలో బరువు తగ్గటం వంటి ఇతరత్రా ప్రయోజనాలు మెరుగ్గా ఉండటం గమనార్హం. వీరికి మధుమేహ దుష్ప్రభావాలూ తక్కువే అనుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని