డాక్టర్‌ వద్దకు వెళ్తున్నారా?

ఇతర దేశాల్లో మాదిరిగా మనదగ్గర రోగుల వివరాలను నమోదు చేసే కేంద్రీకృత వ్యవస్థ ఏదీ లేదు.

Updated : 09 Jan 2024 04:29 IST

ఇతర దేశాల్లో మాదిరిగా మనదగ్గర రోగుల వివరాలను నమోదు చేసే కేంద్రీకృత వ్యవస్థ ఏదీ లేదు. ఆరోగ్యబీమా ఉన్నా అది వ్యక్తిగతమే గానీ సార్వత్రికం కాదు. పెద్ద పెద్ద ఆసుపత్రులు కొంతవరకు రోగుల వివరాలను నమోదు చేస్తున్నా చిన్న క్లినిక్కులైతే అదీ పాటించటం లేదు. కాబట్టి డాక్టర్‌ దగ్గరికి వెళ్లే ముందు ఎవరికివారే కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. మనదేశంలో ఇది మరింత అవసరం కూడా.  

లోపతీ, సిద్ధ, సహజ, ఆయుర్వేద.. ఇలా ఎన్నో రకాల వైద్యాలు మూలమూలకూ ప్రత్యక్షమవుంటాయి. ఇరుగు పొరుగు చెప్పారనో.. బంధువులు చూపించుకున్నారనో అప్పటివరకు తీసుకుంటున్న చికిత్సలనూ పక్కనపెట్టి వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు ఎందరో. చవకగా చికిత్స చేస్తున్నారో, అద్భుతాలు జరుగుతున్నాయనో తెలిస్తే పట్టతరమే కాదు. వీటికిప్పుడు వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల ప్రచారాలూ తోడవుతున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా గుంపులు గుంపులుగా తరలిపోతుంటారు. అక్కడ ఫలితం కనిపించకపోగా సమస్య తీవ్రమై మళ్లీ ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు ఎందరో. అప్పటివరకు తీసుకున్న చికిత్సలు, వేసుకున్న మందుల వివరాలు, ఆరోగ్య తీరుతెన్నులు డాక్టర్లకు తెలియకపోతే సరైన వైద్యం దక్కటం కష్టం.

  • డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు అన్ని వైద్య రికార్డులూ వెంట తీసుకెళ్లాలి. తెలిసిన డాక్టరే అయినా వారికి అన్నీ గుర్తుండాలనేమీ లేదు. చాలాకాలం తర్వాత వెళ్తున్నట్టయితే గతంలో జరిగిన శస్త్రచికిత్సలు, చేయించుకున్న పరీక్షలు, వేసుకున్న మందులు, జబ్బులు, అలర్జీలు, మందులు పడకపోవటం.. ఇలా అన్ని వివరాలూ దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడేది అవసరపడుతుందో తెలియదు. ఒకప్పుడు వచ్చిన జబ్బులకూ ఇప్పటి జబ్బులకూ సంబంధం ఉండొచ్చు. వాటి వివరాలు తెలిస్తే చికిత్స నిర్ణయం తేలికవుతుంది. అనవసరంగా పరీక్షలు చేయించుకోవటం తప్పుతుంది.
  •  టీకాలు కేవలం పిల్లలకే కాదు. పెద్దయ్యాకా వేసుకోవాల్సి ఉంటుంది. వీటిని సమయానికి తీసుకుంటే సుమారు 30 రకాల ఆకస్మిక, దీర్ఘకాల జబ్బులను నివారించుకోవచ్చు. తీసుకున్న టీకాల వివరాలు తెలిస్తే జ్వరమో, ఇన్‌ఫెక్షనో వచ్చినప్పుడు అది ఏ జబ్బు కాకపోవచ్చనేది డాక్టర్లు వెంటనే తేల్చుకోవటానికి వీలవుతుంది. పిల్లల విషయంలోనైతే ఇది మరింత బాగా ఉపయోగపడుతుంది.
  • డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకొని, ఆ సమయానికి ఆసుపత్రికి చేరుకునేలా చూసుకోవాలి. దీనికోసం ముందే సిద్ధం కావాలి. డాక్టర్‌ గది వద్ద నిరీక్షించే వారు కూడా జబ్బుపడ్డవారేనని గుర్తించాలి. ముందు తమనే చూడాలని పదే పదే పట్టుబట్టటం తగదని తెలుసుకోవాలి.
  • అవసరమైన సమాచారాన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. డాక్టర్‌ అడిగే ప్రశ్నలకు నిజాయతీగా, సరైన సమాధానాలు ఇవ్వాలి. ఉదాహరణకు- మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌ చికిత్స కోసం వెళ్లారనుకోండి. లైంగిక సంబంధాల గురించి డాక్టర్‌ అడిగితే నిజాయతీగా జవాబివ్వాలి. నిజాలు దాస్తే చికిత్స తారుమారయ్యే ప్రమాదముంది.
  • డాక్టర్లకు ఎక్స్‌రే చూపేమీ ఉండదు. కొన్నిసార్లు శరీరాన్ని తాకి చూసి, పరీక్షించాల్సి ఉంటుంది. దీనికి తిరస్కరిస్తే జబ్బు నిర్ధరణ కష్టం కావొచ్చు. అలాగే తగు విధంగా వస్త్రాలు ధరించాలి. ఉదాహరణకు- కాళ్లలో సమస్య ఉందనుకోండి. బిగుతైన ప్యాంట్లు ధరిస్తే అవి వెంటనే తీయటానికి కుదరదు. రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, స్కాన్‌లు జబ్బు నిర్ధరణకు తోడ్పడినప్పటికీ అవి శరీరాన్ని తాకి పరీక్షించటానికి ప్రత్యామ్నాయం కావని తెలుసుకోవాలి.
  • రాసిచ్చిన మందులను సూచించిన మోతాదులో మొత్తం కోర్సు వేసుకోవాలి. ఒకసారి వేసుకుంటే తగ్గింది కదాని ఆపేయొద్దు. ఒక మోతాదుతో ఉపశమనం కలిగితే జబ్బు తగ్గిందని అనుకోవద్దు. డాక్టర్‌ చెప్పినన్ని రోజులు వేసుకోవాలి. యాంటీబయాటిక్‌ మందుల విషయంలో ఇది తప్పనిసరి. లేకపోతే బ్యాక్టీరియా మందులను తట్టుకొనే శక్తిని సంతరించుకొని, మొండిగా తయారవుతుంది. మరోసారి ఆ మందు రాసినా సరిగా పనిచేయదు. అసలు పనిచేయకపోవచ్చు కూడా.
  • మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్‌ లోపం వంటి దీర్ఘకాల, జీవనశైలి సమస్యలు నయం కావు. వీటిని నియంత్రించుకోవటం ఒక్కటే మార్గం. మందులు, ఆహార నియమాలను అలాగే కొనసాగించాలి. వీటిని పాటిస్తున్నప్పుడు మరో డాక్టర్‌ దగ్గరికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు ఫలితాలు నార్మల్‌గా ఉండొచ్చు. అంతమాత్రాన జబ్బు నయమైనట్టు కాదు. మందుల మూలంగానే జబ్బు అదుపులో ఉందని తెలుసుకోవాలి. మందులు ఆపేస్తే తిరిగి సమస్య తీవ్రమవుతుంది. కొత్త పరీక్ష ఫలితాలను మరో డాక్టర్‌కు చూపించినప్పుడు అంతకుమందు వేసుకుంటున్న మందుల వివరాలు తెలపాలి. లేకపోతే డాక్టర్‌ అంతా బాగానే ఉందనుకోవచ్చు. మందులేవీ సూచించకపోవచ్చు. దీంతో పరిస్థితి విషమిస్తుంది.
  • అన్నింటికన్నా ముఖ్యంగా వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలను గుడ్డిగా నమ్మొద్దు. ఆరోగ్యానికి సంబంధించిన వాటిల్లో చాలావరకు అసత్యాలే ఉంటాయని గుర్తించాలి. నిజం డాక్టర్‌కు గూగుల్‌ డాక్టర్‌ ప్రత్యామ్నాయం కాదని తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని