ఎముక పటుత్వానికీ మలేరియా మందు

ఏయే ఔషధ మూలకాలు ఎలాంటి జబ్బులను నయం చేస్తాయి? ఇప్పుడున్న మందులను ఇతర జబ్బుల చికిత్సకు వాడుకోవచ్చా? ఇలాంటి విషయాలను శోధించటానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు

Updated : 26 Mar 2024 22:20 IST

ఏయే ఔషధ మూలకాలు ఎలాంటి జబ్బులను నయం చేస్తాయి? ఇప్పుడున్న మందులను ఇతర జబ్బుల చికిత్సకు వాడుకోవచ్చా? ఇలాంటి విషయాలను శోధించటానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు వీరికి కృత్రిమ మేధ (ఏఐ) కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది. తాజాగా బయటపడ్డ విషయమే దీనికి నిదర్శనం. మలేరియాను నయం చేసే డైహైడ్రోఆర్టెమిసినిన్‌ (డీహెచ్‌ఏ) మందు ఎముకలు గుల్లబారటాన్నీ తగ్గించగలదని తేలింది మరి. మన ఎముకలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్ని కణాలు కొత్త ఎముక ఏర్పడేలా, వృద్ధి చెందేలా చేస్తుంటాయి (ఆస్టియోబ్లాస్ట్స్‌). మరికొన్ని కణాలేమో ఎముకను విచ్ఛిన్నం చేస్తుంటాయి (ఆస్టియోక్లాస్ట్స్‌). ఆరోగ్యవంతుల్లో ఈ ప్రక్రియ సమతులంగా కొనసాగుతూ వస్తుంది. కానీ విచ్ఛిన్నం చేసే కణాలు అతిగా పనిచేస్తే ఎముక క్షీణిస్తుంది, గుల్లబారుతుంది. ఈ సమస్యను ఎక్కువగా వయసు మీరినవారిలో గమనిస్తుంటాం.

ఇలాంటివారికి ప్రస్తుతం ప్రధానంగా ఎముక క్షీణతకు కారణమయ్యే కణాల పనితీరును తగ్గించే మందులతో చికిత్స చేస్తున్నారు. అయితే ఎముకలు గుల్లబారినవారిలో కొత్త ఎముకను పుట్టించే మూలకణాలు కొవ్వును సృష్టించే కణాలుగా మారుతుండటం గమనార్హం. దీన్ని మార్చగలిగితే కొత్త చికిత్సలకు వీలవుతుంది కదా. ఇదే శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది. జబ్బుతో ముడిపడిన జన్యు వ్యక్తీకరణను చిన్న మూలక ఔషధాలతో ఎలా మార్చొచ్చో అనేది అంచనా వేయటానికి డీప్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్‌ను సృష్టించారు. దీని సాయంతోనే డీహెచ్‌ఏ సామర్థ్యాన్ని గుర్తించారు. ఎలుకల్లో ఎముక క్షీణించేలా చేసి ఈ మందును ఇచ్చి పరిశీలించారు. ఆరు వారాల్లోనే వీటి తుంటి ఎముకలో ఎముక క్షీణత తగ్గినట్టు, దాదాపుగా మునుపటి స్థితికి చేరుకున్నట్టు గుర్తించారు. డీహెచ్‌ఏతో కూడిన నానోపార్టికల్స్‌ను ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తే మరింత సమర్థంగా పనిచేస్తున్నట్టూ కనుగొన్నారు. ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోవటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు