వీర్య పుష్టి కోసం

సంతానలేమిని చాలావరకు మహిళల సమస్యగానే చూస్తుంటారు. నిజానికి మగవారూ తక్కువేమీ కాదు. కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నవారిలో దాదాపు 30% మంది మగవారే.

Updated : 23 Jan 2024 09:53 IST

సంతానలేమిని చాలావరకు మహిళల సమస్యగానే చూస్తుంటారు. నిజానికి మగవారూ తక్కువేమీ కాదు. కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నవారిలో దాదాపు 30% మంది మగవారే. సంతాన సామర్థ్యం గల మగవారితో పోలిస్తే ఇలాంటివారు మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. వీరిలో కుంగుబాటు లక్షణాలు, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆత్మ విశ్వాసమూ తక్కువే. ప్రపంచవ్యాప్తంగా మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి జీవనశైలి, పర్యావరణ అంశాల వంటివి కారణం కావొచ్చు. మగవారిలో సంతానలేమికి దోహదం చేస్తున్న చాలా అంశాలను నివారించుకోలేకపోవచ్చు గానీ కొన్ని జాగ్రత్తలతో సంతాన సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

బరువు అదుపులో..

 ఊబకాయం మూలంగా హార్మోన్ల మోతాదులు అస్తవ్యస్తమవుతాయి. ఇది వీర్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. శుక్ర కణాల సంఖ్య తగ్గటం, చురుకుగా కదల్లేకపోవటం, వీర్య కణాల ఆకారం సజావుగా లేకపోవటం వంటివి తలెత్తొచ్చు. ఇవి సహజ గర్భధారణలోనే కాదు.. కృత్రిమ గర్భధారణలోనూ ఇబ్బంది కలిగిస్తాయి. మంచి విషయం ఏంటంటే- బరువు తగ్గించుకుంటే సంతాన సామర్థ్యాన్ని పెంచుకునే వీలుండటం. క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇది వీర్యం నాణ్యత మెరుగు పడటానికీ తోడ్పడుతుంది. పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాలు, వెన్న తీసిన పాల ఉత్పత్తులు ఎక్కువగా తినటం.. మాంసం, మిఠాయిలు, తీపి పానీయాలు తగ్గించటంతో వీర్యం నాణ్యత పుంజుకుంటున్నట్టు అధ్యయనాలు బలంగా చెబుతున్నాయి.

మత్తు మందులకు దూరం..

కొకైన్‌, బెంజోడయాజెపైన్స్‌, హెరాయిన్‌, మెథాంఫెటమైన్‌, ఆక్సీకోడోన్‌ వంటి మత్తు పదార్థాలు పునరుత్పత్తి అవయవాల పనితీరును దెబ్బతీస్తాయి. శృంగారాసక్తి, టెస్టోస్టీరాన్‌ ఉత్పత్తి, వీర్యం ఉత్పత్తి, వీర్యం నాణ్యత మీద ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తరచూ గంజాయిని వాడేవారిలో వీర్యం నాణ్యత దెబ్బతినటమే కాకుండా వృషణాల క్యాన్సర్‌ ముప్పూ పెరుగుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

పొగతాగటం మానెయ్యాలి

సిగరెట్లు, చుట్టలు, బీడీలు ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతాయి. ఇవి మగవారిలో సంతాన సామర్థ్యాన్నీ తగ్గిస్తాయి. ఇటీవల ఇ-సిగరెట్లు తాగటమూ ఎక్కువైంది. ఇవీ హానికరమే. పొగ తాగటం వల్ల శుక్ర కణాల సంఖ్య పడిపోతుంది. అందువల్ల గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతాయి. వీర్య కణాల చురుకుదనమూ తగ్గుతుంది. దీంతో అవి గర్భాశయం వరకు చేరుకోవటం కష్టమవుతుంది. మరీ ఎక్కువగా సిగరెట్లు తాగేవారిలో స్తంభన లోపమూ తలెత్తుతుంది.  వీర్యం డీఎన్‌ఏ దెబ్బతినటం మరో ప్రమాదం. ఒకవేళ సంతానం కలిగితే ఈ జన్యు మార్పులు పుట్టబోయే బిడ్డకూ సంక్రమిస్తాయి. కాబట్టి పొగతాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. దీంతో సంతాన సామర్థ్యం మెరుగవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

కృత్రిమ టెస్టోస్టీరాన్‌ వద్దు

కొందరు శరీర సామర్థ్యాన్ని, ఆకృతిని మెరుగు పరచుకోవటానికి కృత్రిమ టెస్టోస్టీరాన్‌ వంటి అనబాలిక్‌ స్టిరాయిడ్స్‌ వాడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి 16 మందిలో ఒకరు జీవితంలో ఎప్పుడో అప్పుడు వీటిని తీసుకుంటున్నారని అంచనా. ఫైటర్లు, సెక్యూరిటీ గార్డుల వంటివాళ్లు ఎక్కువగా వీటిని వాడుతుంటారు. ఇవి కండరాల వృద్ధికి, కొవ్వు తగ్గటానికి తోడ్పడినప్పటికీ వృషణాల సైజు తగ్గటానికి.. వీర్యం ఉత్పత్తి తగ్గటం లేదా పూర్తిగా ఆగిపోవటానికి దారితీయొచ్చు. ఫలితంగా శృంగార సామర్థ్యం లోపించొచ్చు. సంతానం కలగకపోవచ్చు. అనబాలిక్‌ స్టిరాయిడ్స్‌ వాడకాన్ని ఆపేస్తే కొందరికి ఏడాది లోపు వీర్యం తిరిగి ఉత్పత్తి అవుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ కొందరిలో చాలాకాలమైనా ఫలితం కనిపించకపోవటం గమనార్హం.

కాలుష్య కారకాలతో జాగ్రత్త..

మనం రోజూ రకరకాల పర్యావరణ రసాయనాల ప్రభావానికి గురవుతుంటాం. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి వంటి వాటితో ఇవి శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి. హార్మోన్లను అస్తవ్యవస్తం చేసే ఇలాంటి రసాయనాలు వీర్యం నాణ్యతను దెబ్బతీయొచ్చు.సెక్స్‌ హార్మోన్లను అనుకరించటం లేదా వాటిని అడ్డుకోవటం ద్వారానూ సంతాన సామర్థ్యాన్ని తగ్గించొచ్చు. కాలుష్య కారకాలు మన చుట్టూ ఆవరించి ఉండటం వల్ల వీటిని పూర్తిగా తప్పించుకోవటం అసాధ్యం. కానీ వీటి బారినపడకుండా తగ్గించుకోవచ్చు. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగటం.. ప్యాకెట్లలో, క్యాన్లలో అమ్మే ఆహార పదార్థాలు తగ్గించటం.. త్వరగా కరిగిపోయే పాస్లిక్‌ బాటిళ్లతో నీరు తాగకపోవటం వంటివి మేలు చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని