200 డైనోసర్ల పేర్లు చెబుతాడు!

డైనోసర్ల గురించి మీకేం తెలుసు అని మనల్ని అడిగితే అదొక జంతువని, భయంకరంగా ఉంటుందని, దాని ఆకారం గురించి మాత్రమే చెప్పగలం కదా! అదే ఈ పిల్లాడిని అడిగి చూడండి. దాని పుట్టు పూర్వోత్తరాలు ఏకరువు పెడతాడు. ఎన్ని రకాలున్నాయో

Published : 26 Sep 2021 01:54 IST

డైనోసర్ల గురించి మీకేం తెలుసు అని మనల్ని అడిగితే అదొక జంతువని, భయంకరంగా ఉంటుందని, దాని ఆకారం గురించి మాత్రమే చెప్పగలం కదా! అదే ఈ పిల్లాడిని అడిగి చూడండి. దాని పుట్టు పూర్వోత్తరాలు ఏకరువు పెడతాడు. ఎన్ని రకాలున్నాయో పేర్లు చెబుతాడు. అలా చెబుతూ రికార్డులు సాధించేస్తున్నాడు. ఆ వివరాలన్నీ మీకోసం...

దికృష్ణన్‌ వి భరత్‌. ప్రస్తుత వయసు ఏడేళ్లు. అమ్మ విజిత ప్రసాద్‌, నాన్న భరత్‌ రాజన్‌. ఆది అయిదేళ్ల వయసు నుంచే డైనోసర్ల గురించి చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. దాదాపు 200 డైనోసర్ల పేర్లను అవలీలగా చెప్పగలడు. 2 నిమిషాల 50 సెకన్లలో 132 డైనోసర్లను గుర్తించాడు. మూడు పుస్తకాల్లోని 94 డైనోసార్లను ఒక్క నిమిషంలో చెప్పేసాడు. అంతేకాదు వాటి ఆహారపు అలవాట్లు, గుణగణాలు మొత్తం వివరించేశాడు. అలా తన ప్రతిభతో కలాం వరల్డ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇలా మొత్తం ఆరు రికార్డులను సొంతం చేసుకున్నాడు.

ఆసక్తి వల్లనే సాధ్యం..

‘తనకు నాలుగేళ్ల వయసప్పుడు జురాసిక్‌ పార్క్‌ సినిమాకి తీసుకెళ్లాం. అది చూశాక డైనోసర్ల గురించి ఆసక్తిగా అడిగేవాడు. మాకేం చెప్పాలో తెలియక టీవీలో నేషనల్‌ జాగ్రఫిక్‌ చానల్‌ పెట్టి చూడమనేవాళ్లం. అది చూస్తూ డైనోసర్ల గురించి రోజుకొక సందేహాన్ని వెలిబుచ్చేవాడు. మాకేమో వాటి గురించి అంతగా అవగాహన లేదు. కానీ పిల్లాడికి ఉన్న ఇష్టం చూసి డైనోసర్లకు సంబంధించిన పుస్తకాలను కొనిచ్చాం. తను వాటిని శ్రద్ధగా చదివేవాడు. మేం అప్పుడప్పుడు సరదాగా ఏం చదువుతున్నాడో తెలుసుకుందామని, ఆ పుస్తకాలను తీసుకుని కొన్ని ప్రశ్నలు వేసేవాళ్లం. అన్నింటికి చక్కగా జవాబులు ఇచ్చేవాడు. అలా మూడు పుస్తకాల్లోని 200 డైనోసార్ల పేర్లను కంఠతా చెప్పేశాడు. తన జ్ఞాపకశక్తిని చూసి చాలా ఆశ్చర్యపోయాం. ఇక తన ప్రతిభకు గుర్తుగా 7 ఏళ్లకే 6 రికార్డులు రావడం మరింత ఆనందాన్ని కలిగించింది’ అంటూ ఆది వాళ్ల అమ్మానాన్న తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆది కూడా పెద్దయ్యాక శిలాజ అధ్యయన వేత్త అవుతానని ధీమాగా చెబుతున్నాడు. మరింకేం ఆదికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని