సైంధవలవణం ఎంత మంచిదో తెలుసా!

ఉప్పు వీలైనంత తగ్గించమని పదేపదే హెచ్చరిస్తోన్న ఆహార నిపుణులు సైంధవ లవణం చాలా మంచిదని చెబుతున్నారు. పెద్ద పెద్ద చెఫ్‌లు కూడా ఇది ఆరోగ్యకరమని, కొన్ని వంటల్లో ప్రత్యేకంగా దీన్నే ఉపయోగించమంటున్నారు

Published : 07 Apr 2024 00:41 IST

ఉప్పు వీలైనంత తగ్గించమని పదేపదే హెచ్చరిస్తోన్న ఆహార నిపుణులు సైంధవ లవణం చాలా మంచిదని చెబుతున్నారు. పెద్ద పెద్ద చెఫ్‌లు కూడా ఇది ఆరోగ్యకరమని, కొన్ని వంటల్లో ప్రత్యేకంగా దీన్నే ఉపయోగించమంటున్నారు. ఇంతకీ సైంధవ లవణం ఎందుకు మంచిదో, దాని వల్ల ఏమేం లాభాలున్నాయో చూద్దాం.

పింక్‌సాల్ట్‌లో సోడియం, క్లోరైడ్‌, సల్ఫర్‌, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌, జింక్‌లు ఉన్నాయి. మామూలు ఉప్పు వాడటం వల్ల వచ్చే అనారోగ్యాలు దీని వల్ల రావు. సైంధవలవణాన్ని ఉపయోగించడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం పరిమాణం తక్కువ. కనుక శరీరంలో సోడియం పేరుకోదు. ఇది ఒంట్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి, జుట్టు రాలకుండా కాపాడుతుంది. శరీరంలో చేరిన అనేక రకాల సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్‌ గుణాలున్నాయి. ఎనీమియాతో బాధ పడుతున్న వారికి ఎంతో మేలు చేస్తుంది. గృహచిట్కాల్లో ఇది ముందుంటుంది. కడుపునొప్పి, మలబద్ధకం, గుండెమంట, కడుపుబ్బరం లాంటి ఇబ్బందులను నివారిస్తుంది. సోడియం స్థాయి మరీ తగ్గినా ప్రమాదమే నిద్రలేమి, మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది. తగినంత సైంధవలవణం తీసుకోవడం వల్ల ఆ సమస్యలు రావు. దీన్ని వేడినీళ్లలో వేసి పుక్కిలిస్తే గొంతు సమస్యలు తగ్గుతాయి. పింక్‌సాల్ట్‌ ఆరోగ్యకరమే కాదు, దీని వల్ల వంటలు ప్రత్యేకమైన రుచీ, వాసనలతో వహ్వా అనిపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని