ఈ ఆవకాయ మరింత ఘాటు!

మన తెలుగువాళ్లకి ఆవకాయ పచ్చడంటే మహా ఇష్టం కదూ! మామిడికాయలతో ఆవకాయ సంగతి సరే.. పచ్చి మిరప కాయలతోనూ ఆవకాయ పచ్చడి చేయొచ్చు. ఎలాగంటారా..

Published : 05 May 2024 00:23 IST

న తెలుగువాళ్లకి ఆవకాయ పచ్చడంటే మహా ఇష్టం కదూ! మామిడికాయలతో ఆవకాయ సంగతి సరే.. పచ్చి మిరప కాయలతోనూ ఆవకాయ పచ్చడి చేయొచ్చు. ఎలాగంటారా.. కూరల్లో వేసే సన్నటివి కాకుండా.. బజ్జీ మిరపకాయలు తీసుకోవాలి. కాయలను కడిగి, శుభ్రమైన వస్త్రంతో తడి లేకుండా తుడిచి, పూర్తిగా విడిపోకుండా సగానికి చీరాలి. కారం ఎక్కువ తినలేం అనుకునేవారు విత్తనాలు తీసేయొచ్చు. ఘాటు ఇష్టపడే వారు గింజలు తీయాల్సిన పని లేదు. అర కిలో కాయలకు కప్పు ఆవాలు, అర కప్పు మెంతులు పడతాయి. వాటిని కమ్మటి వాసన వచ్చేదాకా వేయించాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్‌ చేసి.. మిరపకాయల్లో వేయాలి. అలాగే కారం, ఉప్పు ఒక్కో కప్పు చొప్పున వేయాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ముప్పావు కప్పు, రెండు చెంచాల పసుపు, పావు కప్పు నిమ్మ రసం, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి ముద్ద చెంచా, ముప్పావు కిలో నువ్వుల నూనె వేసి కలపాలి. ఈ పచ్చడి మొదట కొంచెం చేదుగా ఉన్నా.. నాలుగైదు రోజుల తర్వాత మహా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరూ చేసి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని