అందరి బంధువయా నువ్వే ఆవకాయా!

ఎర్రెర్రని ఆవకాయ పచ్చడి..చూస్తే చాలు నోట్లో నీరూరుతుంది. నువ్వావకాయ, పెసరావకాయ, అల్లం ఆవకాయ, బెల్లం ఆవకాయ అంటూ ఆవకాయలో ఎన్నెన్ని రకాలో! దేని రుచి దానిదే. నూనె లేకుండా నీళ్లతో చేసేదీ ఉంది.

Updated : 21 Apr 2024 00:46 IST

 

ఎర్రెర్రని ఆవకాయ పచ్చడి..చూస్తే చాలు నోట్లో నీరూరుతుంది. నువ్వావకాయ, పెసరావకాయ, అల్లం ఆవకాయ, బెల్లం ఆవకాయ అంటూ ఆవకాయలో ఎన్నెన్ని రకాలో! దేని రుచి దానిదే. నూనె లేకుండా నీళ్లతో చేసేదీ ఉంది. ఆవకాయ మన తెలుగువాళ్లకే పరిమితం కాదండోయ్‌. ఏయే రాష్ట్రాల్లో ఎలా చేస్తారో చూడండి!


కేరళలో

కావలసినవి: మామిడికాయలు - 3, కశ్మీరీ కారం - 4 టేబుల్‌ స్పూన్లు, సైంధవ లవణం, ఆవాలు - 4 చెంచాల చొప్పున, మెంతులు - ఒకటిన్నర చెంచా, నువ్వులనూనె - అర కప్పు, పసుపు - ముప్పావు చెంచా, కరివేపాకు - 2 రెబ్బలు, ఇంగువ - అర చెంచా, కొబ్బరి వెనిగర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ: మామిడికాయలను కడిగి, నీళ్లలో వేయాలి. రెండు గంటల తర్వాత నీళ్లలోంచి తీసి, తడి లేకుండా తుడిచి అంగుళం అంత ముక్కలుగా కోసుకోవాలి. ముక్కల మీద ఉప్పు వేసి కలియ తిప్పి మూత పెట్టి రెండు రోజులు అలా ఉంచేయాలి. 3 చెంచాల ఆవాలు, ముప్పావు చెంచా మెంతులను మెత్తగా నూరాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. మిగిలిన ఆవాలు, మెంతులు వేయాలి. అవి వేగాక మెంతి-ఆవ పొడి, కరివేపాకు రెబ్బలు జతచేసి కొన్ని క్షణాలుంచి దించేయాలి. ఆ వేడి తగ్గకముందే.. కశ్మీరీ కారం, పసుపు, ఇంగువ వేసి కలియ తిప్పాలి. చల్లారిన తర్వాత ఊరిన మామిడికాయ ముక్కలు, కొబ్బరి వెనిగర్‌ వేసి కలియ తిప్పాలి. దీన్ని తడి లేని సీసాలో భద్రపరచుకుంటే సరిపోతుంది. ఈ లెక్కల ప్రకారం మరిన్ని కాయలతో చేసుకోవచ్చు.


గుజరాత్‌లో

కావలసినవి: మామిడికాయ ముక్కలు - కిలో, పసుపు - చెంచా, ఉప్పు - వంద గ్రాములు,  పల్లీ నూనె - ముప్పావు కిలో, కచ్చాపచ్చా దంచిన మెంతులు - 100 గ్రా, పసుపుపచ్చ ఆవాలు - 70 గ్రా, కారం - 150 గ్రా
తయారీ: మామిడికాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఈ ముక్కలను జాడీలోకి తీసి, మూత బిగించి పది గంటలు అలా ఉంచేయాలి. ఒక స్టీలు పాత్ర మీద రంధ్రాల గిన్నె ఉంచి.. అందులో మామిడికాయ ముక్కలు వేసి.. అరగంట ఉంచాలి. నీరంతా కింది గిన్నెలోకి దిగి.. ముక్కలు పై పాత్రలో మిగులుతాయి. ఈ ముక్కలను శుభ్రమైన వస్త్రం మీద పరిచినట్లు వేసి.. ఒక రోజంతా ఎండనివ్వాలి. కడాయిలో పావు వంతు నూనెను పొగలు వచ్చేదాకా వేడి చేసి చల్లారాక.. దంచిన మెంతులు, పసుపుపచ్చ ఆవాలు వేసి మూతపెట్టి పావు గంట పక్కనుంచాలి. అందులో కారం, మామిడికాయ ముక్కలు వేసి కలిపి.. జాడీలోకి తీయాలి. మూత పెట్టి, వస్త్రం కప్పి, ముడి వేయాలి. ఈ జాడీని పగలు ఎండలో ఉంచి, రాత్రి లోనికి తెచ్చి కలియ తిప్పాలి. ఇలా ఐదు రోజులు ఎండబెట్టిన తర్వాత, మిగిలిన నూనెను పొగలు వచ్చేదాకా వేడి చేసి, పూర్తిగా చల్లారాక ముక్కల్లో పోయాలి. మూత పెట్టేసి 15 రోజులు అలా ఉంచేస్తే సరి.. నోరూరించే ‘గుజరాతీ మ్యాంగో పికిల్‌’ సిద్ధమైపోతుంది.


పంజాబ్‌లో

కావలసినవి: మామిడికాయ ముక్కలు - ఏడున్నర కప్పులు, ఆవనూనె - 3 కప్పులు, ఉప్పు - అర కప్పు, ఆవాలు, మెంతులు, సోంపు, నల్ల జీలకర్ర, కారం - పావు కప్పు చొప్పున, పసుపు - 3 టేబుల్‌ స్పూన్లు
తయారీ: వెడల్పాటి పాత్రలో మామిడికాయ ముక్కలు, అర కప్పు ఆవనూనె, ఆవాలు, మెంతులు, సోంపు, నల్ల జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. బాగా కలిసిన తర్వాత తడి లేని జాడీలోకి మార్చాలి. మూత బిగించి, ఎండ బాగా తగిలే చోట ఉంచాలి. సాయంత్రం వేళ లోనికి తెచ్చి, ముక్కలను కలిపి మర్నాడు మళ్లీ ఎండలో పెట్టాలి. ఇలా నాలుగు రోజులు ఎండబెట్టిన తర్వాత.. మిగిలిన రెండున్నర కప్పుల ఆవనూనె కూడా వేసి కలపాలి. ముక్కల్లో తగినంత నూనె లేదనిపిస్తే.. ఇంకొంత వేయాలి. నూనె తేలుతున్నట్టు ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఈ పచ్చడి మొదట కాస్త చేదుగా అనిపిస్తుంది కానీ వారం తర్వాత కమ్మటి రుచితో సూపర్‌గా ఉంటుంది. ఏడాదికి పైగా నిలవుంటుంది.


రాజస్థాన్‌లో

కావలసినవి: మామిడికాయ ముక్కలు - 4 కప్పులు, పసుపు - చెంచా, ఆవనూనె - కిలో, నల్ల ఆవాలు, నల్ల జీలకర్ర - చెంచా చొప్పున, మెంతులు, పసుపుపచ్చ ఆవాలు - 2 చెంచాల చొప్పున, శనగపప్పు, ఆవపప్పులు, సోంపు, ఉప్పు - 4 చెంచాల చొప్పున, కారం - 7 చెంచాలు, ఇంగువ - పావు చెంచా
తయారీ: మామిడికాయ ముక్కలను శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. టెంక మీద పల్చని పొరను తీసేయాలి. బేసిన్‌లో మామిడికాయ ముక్కలు, పసుపు వేసి కలిపి రెండు గంటలు ఎండలో ఉంచాలి. ఈలోగా సగం ఆవనూనెను కాచి, చల్లార్చాలి. పసుపు పట్టించిన ముక్కలు తేమ లేకుండా ఎండి ఉంటాయి. కడాయిలో మిగిలిన సగం నూనెను కాగనిచ్చి మంట తీసేయాలి. నూనె వేడిగా ఉండగానే నల్ల ఆవాలు, నల్ల జీలకర్ర, మెంతులు, పసుపుపచ్చ ఆవాలు, శనగపప్పు, ఆవపప్పులు, సోంపు, ఇంగువ, మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి కలపాలి. ఉప్పు చాలినంత లేకుంటే పచ్చడి పాడైపోతుంది. కనుక తయారయ్యాక రుచి చూసి.. కాయల పులుపును బట్టి అవసరమైతే ఇంకాస్త వేసుకోవాలి. ముక్కలకు కారం, ఉప్పు పట్టేలా బాగా కలిపి.. తడి లేని జాడీలోకి తీయాలి. అందులో కాచి చల్లార్చిన నూనె పోసి.. మళ్లీ కలిపి, మూత పెట్టేయాలి. వారం తర్వాత ముక్కలను మరోసారి కలియతిప్పితే సరి.. ఘుమఘుమలాడే పచ్చడి సిద్ధం.


బెంగాల్‌లో

కావలసినవి: మామిడికాయ ముక్కలు - 5 కప్పులు, ఖర్జూరబెల్లం - అర కిలో, ఆవనూనె - 5 చెంచాలు, ఉప్పు - రుచికి సరిపోయేంత, పంచ పోరన్‌ (ఆవాలు, మెంతులు, సోంపు, నల్ల జీలకర్ర, వాము), ధనియాలు, జీలకర్ర - చెంచా చొప్పున, బిర్యానీ ఆకులు - 2, ఎండుమిరపకాయలు - 3
తయారీ: మామిడికాయల చెక్కు, టెంక తీయాలి. పొడుగ్గా నాలుగు లేదా ఆరు చీలికలుగా కోసి.. ఒక రోజంతా ఎండబెట్టాలి. లోనికి తెచ్చాక.. వాటి మీద కాస్త ఉప్పు చల్లాలి. కడాయిలో ధనియాలు నిమిషం వేగనిచ్చి, జీలకర్ర వేసి.. మరో పది క్షణాలు వేయించాలి. అవి చల్లారాక గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నూనె కాగాక.. బిర్యానీ ఆకులు, ఎండుమిరపకాయలు వేయాలి. అవి కాస్త వేగాక.. పంచ పోరన్‌, తర్వాత మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి, కలియ తిప్పుతుండాలి. నిమిషం తర్వాత మూత పెట్టి.. సన్న సెగ మీద మగ్గనివ్వాలి. నాలుగైదు నిమిషాల తర్వాత.. ధనియాలు-జీలకర్ర పొడి, ఖర్జూరబెల్లం వేసి.. సన్న సెగ మీద ఉడికించాలి. రుచి చూసి.. అవసరమైతే కాస్త ఉప్పు వేసి, చిక్కబడిన తర్వాత దించేయాలి. అంతే.. ప్రత్యేక రుచితో అలరించే ‘బెంగాలీ మామిడికాయ పచ్చడి’ తయారైనట్లే!


అరటిపండు ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది

అరటిపండు శక్తినిస్తుంది, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి నిగారింపునిస్తుంది, నిద్రపట్టేలా చేస్తుంది. ఇంత మేలు చేసే ఈ పండు ఖరీదు కూడా చాలా తక్కువే కనుక అందరికీ అందుబాటులో ఉంటుంది. చక్కెరకేళి, అమృతపాణి, లేడీ ఫింగర్‌, గోల్డ్‌ ఫింగర్‌, ప్రేయింగ్‌ హ్యాండ్స్‌, మైసూర్‌, హైదరాబాద్‌, మాల్‌భోగ్‌ లాంటి కొన్ని రకాలే మనకు పరిచయం కదూ! నిజానికి అరటిపండ్లలో వందల రకాలున్నాయంటే అతిశయం కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని