తినుబండారాల తీపి ప్రేమకథ

సునీత.. ఓ సునీతా.. ఎప్పుడైతే నీది గోదావరి జిల్లా అని తెలిసిందో అప్పుడే నా మనసు నీ దారి మళ్లింది. నాకు అత్యంత ఇష్టమైన తినుబండారాల మీద ఒట్టు.

Updated : 15 Jul 2023 00:40 IST

గోదారి పీతల సునీతకి రాదారి రుచుల రామ్‌ లేఖ

సునీత.. ఓ సునీతా.. ఎప్పుడైతే నీది గోదావరి జిల్లా అని తెలిసిందో అప్పుడే నా మనసు నీ దారి మళ్లింది. నాకు అత్యంత ఇష్టమైన తినుబండారాల మీద ఒట్టు. నిన్ను తప్ప మరొకర్ని కట్టుకోను. నువ్వు నాకు దక్కాలని మొదటిసారి అన్నవరం ప్రసాదం తింటూ ఆ సత్యదేవుడిని వేడుకున్నాను. మా ఇంటి కోడలు కావాలని ఆత్రేయపురం పూతరేకులు ఆరగిస్తూ ఆ వెంకన్నకి దండం పెట్టుకున్నాను. కాకినాడ గొట్టం కాజా తింటూ నీవైపు ప్రేమగా చూస్తే.. ఎవడో ఓ గొట్టంగాడిలా నన్ను నువ్వు చూస్తుంటే నా మనసు ఎంత మండిపోయింది? ఆ బాధలో మండపేట గవ్వలు ఎన్ని తిన్నానో నాకే గుర్తు లేదు. తర్వాత రోజూ నీ కోసం తిరిగీతిరిగీ అలసిపోయి ఆకలి తీర్చుకోవడానికి రావులపాలెం కుండ బిర్యానీ లాగించాను. విషయం తొందరగా తేల్చేయాలని మీ ఊరొచ్చాను. కత్తిపూడి కరకజ్జం తింటూ మీ ఇంటివైపు చూస్తుంటే.. మీ నాన్న పెద్ద కత్తి తీసుకుని వెంట పడ్డారు. నేను వెంటనే పరుగు అందుకున్నాను. అంబాజీపేట పొట్టిక్కలు తింటే అద్భుతమైన ఐడియాలు వస్తాయని మా ఫ్రెండ్‌ చెబితే అక్కడికెళ్లి లొట్టలేశాను. ఆపై ఓ అద్భుతమైన ఆలోచన తట్టడంతో బొబ్బర్లంక కొబ్బరుండలు తీసుకొచ్చి మీ అమ్మ చేతిలో పెట్టాను. ‘నా పేరు రుచుల రామ్‌.. మీ ఇంటికి అల్లుడు అవడమే నా ఎయిమ్‌’ అని చెప్పేసరికి మీవాళ్లు భీమవరం బజ్జీమిక్చర్‌లా నన్ను పిసికి పిసికి మరీ కొట్టారు. మామిడాడ మామిడితాండ్రలా ప్రేమగా ఇంట్లోకి తీసుకెళ్తారు అనుకుంటే.. వడిసలేరు చేగోడిలా నూనెలో వేయించినట్లు వాయించారు. మీ వాళ్లని నమ్ముకుంటే నా ప్రేమ కథ కంచికి చేరదని తెలిసి, తాడోపేడో నీతోనే తేల్చుకోవాలనుకున్నాను. పెరుమాళ్లపురం పాకంగారెలు తింటూ, నీ కోసం ముక్కామల పప్పుచెక్కలు తీసుకొచ్చాను. అది నీ చేతికందిస్తూ నా ప్రేమ సంగతి చెప్పాలనుకుంటున్నాను. నన్ను కూరలో కరివేపాకులా తీసేయకుండా.. జీడిపప్పు అచ్చులా నీ మనసులో అచ్చు వేసుకుంటావని ఆశిస్తున్నాను.                        

 ఇట్లు నీ రుచుల రామ్‌
నల్లపాటి సురేంద్ర, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు