నవతరానికి నారాయణమూర్తి సవాల్‌!

‘దేశం ముందుకెళ్లాలంటే యువత కష్టపడి పని చేయాలి.. వారానికి 70 గంటలు శ్రమించాలి’ అంటున్నారు టెక్‌ దిగ్గజం నారాయణ మూర్తి! దీనిపై మాటల మంటలు చెలరేగాయి.

Updated : 04 Nov 2023 07:13 IST

‘దేశం ముందుకెళ్లాలంటే యువత కష్టపడి పని చేయాలి.. వారానికి 70 గంటలు శ్రమించాలి’ అంటున్నారు టెక్‌ దిగ్గజం నారాయణ మూర్తి! దీనిపై మాటల మంటలు చెలరేగాయి. వాడీవేడీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఇదెలా సాధ్యం? అత్యధిక పనివేళలతో అసలుకే మోసం’ అంటున్నారు కొందరు. ‘ఆ అభిప్రాయంలో తప్పేముంది? అలా చేస్తే వ్యక్తిగత ఎదుగుదలకూ అవకాశం ఉంద’న్నది ఇంకొందరి వాదన. అసలు మూర్తి చెప్పినదాంట్లో ఉన్న సాధకబాధకాలేంటి? ఈ సవాళ్లు తొలగాలంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన వర్క్‌కల్చర్‌ కోసం ఎవరెలాంటి పాత్ర పోషించాలి? ఈ విషయాలపై యువ ఉద్యోగులు, నిపుణుల అభిప్రాయాలు సేకరించింది ‘ఈతరం’.

భద్రత లేదు

అందరూ భావిస్తున్నట్టుగా సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ ఉద్యోగాలు ఏమంత గొప్పగా లేవు. పోటీ వాతావరణం ఎక్కువైంది. ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు ఉద్యోగులకు పింక్‌స్లిప్‌లు ఇస్తున్నాయి. ఒత్తిడితో కూడిన పని చేస్తూనే.. మనుగడ కోసం ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు, కొత్త కోర్సులు నేర్చుకుంటున్నాం. లేదంటే ఉద్యోగ భద్రత ఉండదు. లక్ష్యాల ఒత్తిడి సరేసరి. ఫ్రెషర్‌కి పదేళ్ల కిందట ఉన్న వేతనమే ఇప్పుడూ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి ఉత్సాహంగా పని చేసే పరిస్థితి లేదు.

సుగుణాకర్‌రెడ్డి, ప్రాజెక్ట్‌ లీడర్‌

ది జనరేషన్‌ జడ్‌ కాలం. యువతకి పనితోపాటు వ్యక్తిగత జీవితమూ ముఖ్యమే. వారాంతాల్లో స్నేహితుడితో సరదాగా టూర్‌కెళ్లాలి. థియేటర్‌కి వెళ్లి నచ్చిన సినిమా చూడాలి.. కుటుంబంతోనూ జాలీగా గడపాలి. మరి రోజుకి పధ్నాలుగు గంటలు ఆఫీసుకే అంకితమైతే ఇవన్నీ చేయడానికి సమయం ఎక్కడ? అనేది అత్యధికుల వాదన. ప్రముఖ పారిశ్రామికవేత్త అధినేత హర్ష్‌ గోయెంకా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే.. మధ్యేమార్గంగా యువత హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌కి సిద్ధం కావాలంటున్నారు. కార్యాలయంలో, వర్క్‌ ఫ్రం హోం ద్వారా సమానంగా పని చేయడమే.. ఈ సిద్ధాంతం. ‘మనసుంటే మార్గం ఉంటుంది. చేయాలనే కసి ఉంటే.. పద్దెనిమిది గంటలైనా ఏకధాటిగా పని చేయగలరు’ అన్నది ఓలా కుర్ర సీఈవో భవీష్‌ అగర్వాల్‌ మాట. పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌ సైతం మూర్తి నిర్ణయాన్ని సమర్థిస్తూ.. అత్యధిక పని గంటలు సంస్థ అభివృద్ధితోపాటు.. ఉద్యోగుల వ్యక్తిగత సామర్థ్యాన్నీ వెలికితీస్తాయంటారు.  

సజ్జన్‌ జిందాల్‌

భవీష్‌ అగర్వాల్‌

‘చైనా, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనవాళ్లు చేసే పనిగంటలు తక్కువ.. వాళ్లతో పోటీ పడాల్సిందే’ అంటూ మరో మాట చెప్పారు నారాయణమూర్తి. దీనిపై ప్రముఖ ఐటీ కంపెనీలో టీం లీడర్‌గా పని చేస్తున్న సుగుణాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ‘ఆ దేశాల్లో చేసే పని గంటలకు వేతనం ఉంటుంది. ఇక్కడలా కాదు.. పేరుకి ఎనిమిది గంటలైనా ఒక్కో ఉద్యోగి సగటున పది నుంచి పన్నెండు గంటలు కష్టపడతాడు. కొందరైతే వారాంతాల్లోనూ ఆఫీసులో గడుపుతుంటారు. దీనికి మించి ఇంకా చేయడం ఆచరణసాధ్యం కాద’ంటున్నారు. అత్యధిక పని వేళలతో నడుము, మెడనొప్పి, కంటి సమస్యలూ ఎక్కువ అవుతాయన్నది వాళ్ల వాదన. ముఖ్యంగా ఐటీ, కార్పోరేట్‌, మార్కెటింగ్‌ రంగాల్లోని ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం. ఇంకా పొడిగించడం అంటే.. పని వాతావారణాన్ని దెబ్బతీయడమేనంటున్నారు.

‘మన దగ్గర ఉడుకు రక్తంతో ఉరకలెత్తే, పని అంతు చూడాలనుకునే ఉద్యోగులకు కొదవ లేదు. కానీ పదేళ్ల కిందట కొత్తగా కొలువులో చేరేవాళ్లకు ఎంత వేతనం చెల్లించేవారో ఇప్పుడూ అవే ఇస్తున్నాయి ప్రముఖ ఐటీ కంపెనీలు. అదే సమయంలో సీఈవోలాంటి ఉన్నతోద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. ఖర్చులు, జీవన వ్యయాలు విపరీతంగా పెరిగిపోయిన ఈ కాలంలోనూ తక్కువ వేతనాలకే పని చేయించుకుంటూ.. అత్యధిక పని గంటలు చేయాలని కోరడం అసమంజసం’ అంటారు కెరియర్‌ కౌన్సిలర్‌ పవన్‌ గోపరాజు. ఒకవేళ పనికి తగ్గ జీతం వచ్చినా.. ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కినా.. ఏకధాటిగా అన్నిగంటలు పని చేయడం అనేక మానసిక సమస్యలకు దారి తీస్తుంది.. పరోక్షంగా ఇది కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది’ అంటారాయన.

ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన పని సంస్కృతి ఏర్పడినప్పుడే సంస్థ, ఉద్యోగి బాగు పడతారంటారు నిపుణులు. అందుకు ఇద్దరూ చేయాల్సిన కొన్ని సలహాలు ఇలా సూచిస్తున్నారు.

నమ్మకం: సంస్థలో పని వాతావరణం బాగున్నప్పుడే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. ఆ అనుబంధం ఏర్పరచాల్సిన బాధ్యత కంపెనీపైనే ఉంటుంది. సంస్థ ఉద్యోగికి భరోసానిస్తే.. ఉద్యోగి నిబద్ధతతో పని చేస్తూ విధేయత చూపాలి. సంస్థ నిబంధనలు పాటించాలి.

లక్ష్యాలు: కొన్ని కంపెనీలు తమ లక్ష్యం, ప్రణాళిక గురించి ఉద్యోగులకు వివరించవు. దాంతో ఉద్యోగులు ఏం చేయాలో తెలియక ఒక అనిశ్చితిలో ఉంటారు. ఈ సందేహాలు తొలగించి ముందుకు నడిపించే బాధ్యత సీనియర్‌ ఉద్యోగులదే. వాళ్లు కంపెనీ, ఉద్యోగుల మధ్య వారధిలా ఉండాలి.

పరస్పరం: మూసధోరణిలో వెళ్తుంటే ఏ సంస్థ మనుగడకైనా ఇబ్బందే.  డైనమిక్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు మార్పులు చూపించాలి. ఏం చేస్తే కంపెనీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందో ఆలోచించాలి. దీనికోసం అందరి అభిప్రాయాలూ స్వీకరించాలి. ఫీడ్‌బ్యాక్‌ కోరాలి. ఉద్యోగులు చొరవ తీసుకోవాలి. సంస్థ ఆ వాతావరణం కల్పించాలి.

గుర్తింపు: పనికి తగ్గ గుర్తింపు ఉన్నప్పుడు ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేస్తారు. ఆ భరోసా ఇవ్వగలిగినప్పుడు సంస్థ తమదిగానే భావిస్తారు. ఎక్కువ పని గంటలను పెద్ద భారంగా భావించరు. డెడ్‌లైన్‌కి ముందే పని ముగిస్తే గుర్తించడం.. ప్రతిభ ఉన్నవాళ్లకి రివార్డులు.. ఇలాంటివి ఉద్యోగుల్ని మోటివేట్‌ చేస్తాయి.

సాయం: ఉద్యోగి, యజమాని భావన చెరిగిపోయి.. నాది, నావాళ్లు అనే అనుబంధం ఏర్పడినప్పుడు ఆ సంస్థ అభ్యున్నతి ఉంటుంది. ఉద్యోగుల వ్యక్తిగత కష్టాల్లో ఆదుకోవడం.. వ్యక్తిగత ఉత్సవాలు నిర్వహించడం.. సంస్థపై ప్రేమ పెరిగేలా చేస్తాయి. సంస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలబడతారు.

సాధ్యం కాదు

దేశంలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తుల్లో నారాయణ మూర్తి ఒకరు. ఎన్నో త్యాగాలు చేసి, ప్రతిక్షణం సంస్థ కోసం ధారపోసి ఒక గొప్ప కంపెనీని నిర్మించగలిగారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అత్యధిక ఉద్యోగాలు మెట్రో నగరాల్లో కేంద్రీకృతమయ్యాయి. రెండు, మూడు గంటల ట్రాఫిక్‌ అవాంతరాలను దాటుకొని, ఆఫీసులో 14 గంటలు పని చేస్తే ఇంకా మిగిలేది ఎంత సమయం? నిద్ర, ఇతర వ్యాపకాలు పోను కుటుంబానికి కేటాయించే సమయం ఎక్కుడుంటుంది? ఇలాంటి ధోరణులతో కుటుంబాల్లో అస్థిరత ఏర్పడుతుంది. దేశం బాగు పడాలంటే ముందు మెరుగైన సమాజం ఉండాలి. అసలే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాల్లో ఇంకా పనిగంటలు పెరిగితే మానసిక సమస్యలు తీవ్రమవుతాయి.

అనీస్‌, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

స్టార్టప్‌ యుగంలో తప్పదు

నారాయణమూర్తి చెప్పినట్టు.. అత్యధిక పనివేళలు ఉద్యోగికి, సంస్థకూ లాభదాయకమే. తద్వారా దేశమూ బాగు పడుతుంది. యువ ఉద్యోగులు సహజంగానే ఉత్సాహానికి ప్రతీకలు. ఎక్కువ గంటలు పని చేసే శక్తిసామర్థ్యాలుంటాయి. వాళ్లకున్న ప్రతిభ, సమయాన్ని పనిలో పెట్టడం ఏమంత కష్టం కాదు. ముఖ్యంగా ఈ స్టార్టప్‌ యుగంలో.. నెగ్గుకురావాలంటే చెమట చిందించాల్సిందే. కొత్తగా పని మొదలు పెట్టినప్పుడు ఎవరైనా వారానికి 70, 80 గంటలు కష్టపడక తప్పదు. ఈ వయసులో కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతాం.

సాత్విక ఇంజమల్ల, ఇంటీరియర్‌ డిజైనర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని