జ్ఞాపకం అనుకున్న ప్రేమ.. జీవితమైంది!

ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లడం, సాయంత్రానికి ట్రాఫిక్‌ జామ్‌లో సరదాగా గడిపి ఇంటికి చేరడం.. ఇదే నా దినచర్య. పనే నా ఆస్తులు.. దోస్తులు. ఇక అమ్మాయిల వైపు అయితే కన్నెత్తి చూడను. వాళ్లతో మాట కలపడం అంటేనే జంకు.

Updated : 04 Nov 2023 07:09 IST

మనసులో మాట

దయాన్నే ఉద్యోగానికి వెళ్లడం, సాయంత్రానికి ట్రాఫిక్‌ జామ్‌లో సరదాగా గడిపి ఇంటికి చేరడం.. ఇదే నా దినచర్య. పనే నా ఆస్తులు.. దోస్తులు. ఇక అమ్మాయిల వైపు అయితే కన్నెత్తి చూడను. వాళ్లతో మాట కలపడం అంటేనే జంకు.

కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఒక్కోసారి అనుకోని చిక్కులొస్తాయి. ఊహించని అద్భుతాలు జరుగుతాయి. నాకూ అలాగే జరిగిందోసారి. అర్జెంట్‌ పని పడటంతో బాస్‌ దగ్గర అనుమతి తీసుకుని ఊరెళ్లాను. అక్కడ పని పూర్తవకపోవడంతో రెండ్రోజులు ఎక్కువగా సెలవు పెట్టాల్సి వచ్చింది. మా బాస్‌ అసలే కోపిష్టి. క్యాబిన్‌కి పిలిచి చీవాట్లు పెట్టాడు. వాడిపోయిన మొహంతో బయటికొస్తుంటే.. ఓ అమ్మాయి నన్ను చూస్తూ ముసిముసిగా నవ్వుతోంది. తన కళ్లు.. ఆకాశంలోని నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. మోము పట్టపగలే వెన్నెల పంచుతోంది. మొత్తానికి ఆ క్షణం నాలో ఏదో తెలియని ఫీలింగ్‌. తను మా జూనియర్‌ సాయిశ్రీ. ఆమె కనిపించినప్పుడల్లా నేనెప్పుడో బంధించిన నా మనసు.. గుండె గోడల్ని చీల్చుకుంటూ బయటికొచ్చేది. కాఫీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకునే అమ్మాయిలు, అబ్బాయిల్ని చూసినప్పుడు, మాటలు పంచుకుంటూ లంచ్‌ చేసే జంటల్ని గమనించినప్పుడూ.. నాకూ ఆ అమ్మాయితో అలాగే చేయాలనిపించేది. సాయంత్రాలు పక్కపక్కనే నడుస్తూ తనతో ఎన్నో కబుర్లు చెప్పాలనిపించేది. కానీ అడుగు ముందుకు పడితేగా! చాటుమాటుగా తనని చూడటం.. తను గమనించగానే చప్పున తల దించుకోవడం. ఏదో చెప్పాలని తన కుర్చీదాకా వెళ్లడం.. గుండెలోని మాట గొంతు దాకా వచ్చి ఆగిపోవడం. ఇంతే. ఎప్పుడైనా కళ్లూకళ్లూ కలుసుకొని.. ఓ రెండు సెకన్లు ఊసులు చెప్పుకుంటే ప్రపంచాన్ని గెలిచినంత సంబరం. ఈ మూగ సైగలు, ఎదురుచూపులతోనే ఏడాది గడిచింది.

ఎన్నాళ్లిలా? ఏదేమైనా చెప్పి తీరాల్సిందే.. మనసులోని భారాన్ని దించుకోవాల్సిందే.. అనుకుంటున్న తరుణంలో తనే నా దగ్గరికొచ్చింది. ‘హాయ్‌ రాఘవ్‌.. ఈ సండే మా ఇంటికి భోజనానికి రావాలి. మనవాళ్లంతా వస్తున్నారు’ అంది. ఇది కలా? నిజమా? అనుకుంటూ ఆశ్చర్యపోయా. ‘వాళ్లింటికి వెళ్లాకైనా.. నీ మనసులో మాట చెప్పెయ్‌’ అంటూ ఆత్మారాముడు గోల చేయసాగాడు.
భోజనాలు మొదలయ్యాయి. వంటకాలతోపాటు అప్పుడప్పుడూ కొంటెచూపులూ.. చిలిపి నవ్వులూ వడ్డిస్తోంది తను. ఓవైపు సిగ్గు.. మరోవైపు పట్టలేనంత సంతోషం. భోజనం మధ్యలో ఉండగానే ‘రాఘవ్‌.. నీకు మా అమ్మాయంటే ఇష్టమా?’ అన్నారు సాయిశ్రీ నాన్న. ఆ ప్రశ్నతో పొలమారింది. ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మళ్లీ ఆయనే కల్పించుకుంటూ.. ‘సాయిశ్రీ నిన్ను ఇష్టడుతున్నట్టు చెప్పింది. మాకు ఒక్కగానొక్క కూతురు. తనడిగింది ఏదీ కాదనం. మీ అమ్మానాన్నలతోనూ మేమే మాట్లాడతాం’ అంటుంటే మనసు గాల్లో తేలిపోతోంది. నా కన్ఫ్యూజన్‌ని కనిపెట్టేసింది. బయటికి రమ్మంటూ సైగ చేసింది. వెళ్లా. ‘ఏంటి మూగ దెయ్యంలా మౌనం. నోరు తెరిచి ఇష్టమని చెప్పొచ్చుగా’ అంది. ఇక నేను ఆగలేకపోయా. సంతోషంతో తనని గట్టిగా హగ్‌ చేసుకున్నా. ‘నీ దొంగచూపులు.. నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ చెప్పలేకపోయే నీ అవస్థ.. ప్రతీదీ గమనిస్తూనే ఉన్నా. నేనూ ఎంక్వైరీ చేశా. ‘రాఘవ్‌ ఈజ్‌ ఏ గుడ్‌బోయ్‌’ అన్నారంతా. అందుకే మీపై ఇష్టం పెరిగింది. ఆలస్యం ఎందుకని డైరెక్ట్‌గా ఇలా సెట్‌ చేశా’ అని చెప్పుకొచ్చింది.

సీన్‌ కట్‌ చేస్తే.. అందరి ఆమోదం, ఆశీస్సులతో మేం అధికారికంగా భార్యాభర్తలం కాబోతున్నాం. అమ్మాయిలంటేనే జంకే నేను.. ప్రేమలో పడిపోవడం.. ప్రేమించిన అమ్మాయే పెద్దలతో చెప్పి ఒప్పించి నా సొంతమవడం.. అంతా ఓ కలలా ఉంది. నా జీవితంలో ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది అనుకున్న ప్రేమ.. జీవితాంతం తోడుండే భాగస్వామిలా మారడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.

రాఘవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని