కట్టడి చేద్దాం..కీబోర్డ్‌ వారియర్లని!

పోస్ట్‌ నచ్చలేదా... తోక తొక్కిన పాములా కస్సున ఇంతెత్తున లేస్తారు... అసలు మనిషే నచ్చలేదా.. ఏకంగా తిట్ల దండకమే. ఎఫ్‌బీ, ఎక్స్‌, ఇన్‌స్టా.. సామాజిక మాధ్యమం ఏదైనా సరే.. ఆగమాగం చేసేస్తారు. అంతా ఆన్‌లైన్‌లోనే! బయటికొచ్చేసరికి రాముడు మంచి బాలుడు అన్నట్టు బుద్ధిమంతుల్లా కనిపిస్తారు. ఎవరు వీళ్లు అంటే ‘కీబోర్డ్‌ వారియర్లు’.

Updated : 02 Dec 2023 09:19 IST

పోస్ట్‌ నచ్చలేదా... తోక తొక్కిన పాములా కస్సున ఇంతెత్తున లేస్తారు... అసలు మనిషే నచ్చలేదా.. ఏకంగా తిట్ల దండకమే. ఎఫ్‌బీ, ఎక్స్‌, ఇన్‌స్టా.. సామాజిక మాధ్యమం ఏదైనా సరే.. ఆగమాగం చేసేస్తారు. అంతా ఆన్‌లైన్‌లోనే! బయటికొచ్చేసరికి రాముడు మంచి బాలుడు అన్నట్టు బుద్ధిమంతుల్లా కనిపిస్తారు. ఎవరు వీళ్లు అంటే ‘కీబోర్డ్‌ వారియర్లు’.

ఈమధ్యకాలంలో ఈ పదం బాగా వినిపిస్తోంది. వారం కిందట ఓ గాయని ఇన్‌స్టాలో మగాళ్లనుద్దేశించి ఓ పోస్టు పెట్టింది. చుట్టూ ఉన్న మహిళల్ని గౌరవించమంటూ అభ్యర్థన, సూచన కలగలిపి. దానిపై ఓ ముగ్గురు అసహ్యంగా, తీవ్ర అభ్యంతరకరంగా స్పందిస్తూ కామెంట్‌ చేశారు. వీళ్లే కీబోర్డు వారియర్లు. చేతిలో కీబోర్డు ఉంటే చాలు.. రెచ్చిపోతారు. వెనకాముందూ, ఉచితానుచితాలు చూడకుండా తిట్ల తూటాలు పేల్చుతారు. అవతలి వ్యక్తి మనసు ఎంత గాయపడుతుందన్నది వాళ్లకనవసరం. వాళ్ల పోస్టులు, ఫొటోలపై వచ్చే నచ్చని వ్యాఖ్యలకు సైతం ఇలాగే స్పందిస్తారు. తమకి నచ్చే వ్యక్తులు, అభిమానించే తారల్ని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా విరుచుకుపడుతారు. వీళ్లే ఆఫ్‌లైన్‌కి వచ్చసరికి గప్‌చుప్‌.

ఎందుకిలా?

ప్రేమ, జీవితంలో ఓడిపోవడం.. ఎవరి చేతిలో అయినా మోసపోవడం.. ఇతరుల సంతోషాన్ని ఓర్వలేనితనం.. తీవ్రమైన ఆర్థిక, కుటుంబ సమస్యలు.. ఈ కీబోర్డ్‌ వారియర్లు పుట్టుకు రావడానికి కారణమంటారు మానసిక నిపుణులు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల విజయంపై వంకలు పెడుతూనే ఉంటారు. అమాయకులతో ఆడుకోవాలనుకుంటారు. వెర్రి ఆనందం పొందుతారు. ఇతరుల్ని ఓ మాట అంటేగానీ ఇగో సంతృప్తి చెందనివారూ ఇదేరకం. దీర్ఘకాలంలో ఇది ఒక మానసిక సమస్యగా మారి వల్గర్‌, సెక్సిస్ట్‌, రేసిస్ట్‌.. కామెంట్లు చేయడానికీ వెనకాడరు. ఆఖరికి తమను తాము ఎవరికీ భయపడని ధీరులుగా భ్రమ పడుతుంటారు. ఆత్మన్యూనతతో ఉన్నవారు, అభద్రతాభావానికి గురయ్యేవారూ.. ఈ బాట ఎంచుకుంటారట.  ఎవరూ భౌతికంగా దాడి చేయలేరనే భరోసా.. మహా అయితే కామెంట్ల దాడి తప్ప మరేమీ చేయలేరనే అలుసు వీళ్లిలా రెచ్చిపోవడానికి కారణం.

ఇలాంటి వాళ్లను అదుపు చేయాలంటే.. వీరిని అసలు పట్టించుకోకపోవడమే ఒక మార్గం అంటారు మానసిక నిపుణులు.  ఈ తరహా స్వభావం ఉన్నవాళ్లని సన్నిహితులు గుర్తించి వాళ్లకి అర్థమయ్యేలా కౌన్సెలింగ్‌ ఇప్పించినా ఫలితం ఉంటుందంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని