కాజీ కార్డియో.. ఎంత ఈజీయో!

ఫిట్‌నెస్‌పై ఏమాత్రం అవగాహన ఉన్న కుర్రకారుకైనా ఈపాటికే ‘కాజీ కార్డియో’ అనే పదం చెవిన పడి ఉంటుంది. ఇది అంతర్జాలంలో వైరల్‌ అవుతున్న సరికొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌.

Published : 17 Feb 2024 01:39 IST

ఫిట్‌నెస్‌పై ఏమాత్రం అవగాహన ఉన్న కుర్రకారుకైనా ఈపాటికే ‘కాజీ కార్డియో’ అనే పదం చెవిన పడి ఉంటుంది. ఇది అంతర్జాలంలో వైరల్‌ అవుతున్న సరికొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌. దీని కథాకమామీషు ఏంటంటే...

ఏంటీ ట్రెండ్‌?: సాధారణంగా కార్డియో కసరత్తులు అత్యధిక తీవ్రతతో ఉంటాయి. జంపింగ్‌, స్ప్రింటింగ్‌ చేస్తూ.. బాడీ చెమట్లు చిందించేలా చేస్తాయి. కీళ్లపై ప్రభావమూ ఎక్కువే. దీనికి పూర్తి భిన్నంగా తేలికపాటి వ్యాయామాలతో చేసేదే ‘కాజీ కార్డియో’. ఇందులో యోగాలోని భుజంగాసనంలాంటి వర్కవుట్‌ని ఎక్కువగా చేస్తుంటారు. పొట్టవరకు నేలకు ఆనించి.. తలని వెనక్కి వంచడంలాంటిది. దాంతోపాటు మధ్యమధ్యలో శరీరం డీహైడ్రేషన్‌కి గురి కాకుండా మంచినీళ్లు తాగడం.. ఐస్‌ కాఫీ తీసుకోవడం.. ల్యాప్‌టాప్‌ లేదా పీసీల్లో సరదా వీడియోలు చూస్తూనే కసరత్తులు కొనసాగిస్తుంటారు.

ఎలా మొదలైంది?: టిక్‌టాక్‌ క్రియేటర్‌ హోప్‌ జుకర్‌బ్రో ఈ ట్రెండ్‌కి తెర తీసింది. నలభై నిమిషాల సెషన్‌లో 10 నిమిషాలు విరామాలకే కేటాయిస్తూ.. ‘వ్యాయామం సరదాగా ఉండాలే తప్ప అదో కష్టమైన వ్యాపకం కాకూడదంటూ పిలుపునిచ్చింది. తన వీడియోలు ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లో బాగా పాపులరయ్యాయి.

లాభాలేంటి?: ఈ వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు.. మనసు, మెదడులకు కూడా మహా మంచిదట. కాజీ కార్డియో వర్కవుట్లతో శరీరంలో ఎండార్ఫిన్‌, సెరటోనిన్‌, డోపమైన్‌లాంటి హార్మోన్లు అత్యధికంగా విడుదలవుతాయట. ఇవి మనసు, మెదడును ఉల్లాసపరుస్తాయి. అనవసర ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈ కసరత్తుల్ని ఇంట్లోనే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాటర్‌ బాటిళ్లను డంబెల్స్‌లా.. రుమాళ్లను రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌గా వాడుకోవచ్చు. కుర్చీలతో ట్రైసెప్‌ డిప్స్‌ ప్రయత్నించవచ్చు అంటూ ఎన్నో చిట్కాలు చెబుతోంది హోప్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని