అన్ని భాషల్లో నా గోస వినవే చెలీ!.. వెరైటీ ప్రేమలేఖ

ముద్దబంతి పువ్వులా ముద్దొచ్చేలా ఉన్న నిన్ను చూసి తొలిచూపులోనే పడిపోయాను ప్రవీణా! పలు భాషల్లో నీకు ప్రావీణ్యం ఉందని తెలిసి.. మొట్ట మొదటగా అచ్చ తెలుగులోనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను.

Updated : 17 Feb 2024 07:45 IST

భాషా ప్రవీణకి మాస్టర్‌ మురళి రాయు లేఖ

ముద్దబంతి పువ్వులా ముద్దొచ్చేలా ఉన్న నిన్ను చూసి తొలిచూపులోనే పడిపోయాను ప్రవీణా! పలు భాషల్లో నీకు ప్రావీణ్యం ఉందని తెలిసి.. మొట్ట మొదటగా అచ్చ తెలుగులోనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. ‘ఊ’ అని చెప్పాల్సిందిపోయి ఈడ్చి తల మీద కొట్టావు. అరవంలో అరిచి చెబితేనైనా కరిగిపోతావనుకొని నాన్‌ ఉన్నై కాధలికిరెన్‌ అంటే.. చెడామడా తిట్టేశావు. రాష్ట్రభాష హిందీలో చెబితే రాజసంగా ఉంటుందని మై తుమ్‌సే ప్యార్‌ కర్‌తా హూ అంటే.. అడ్డదిడ్డంగా వాగితే అడ్డంగా నరికేస్తానని పెద్ద వార్నింగే ఇచ్చావు. పరభాష కోసం పాకులాడి అమీ తోమాకే భలోబాషీ అని బెంగాలీలో చెబితే పటపటా పళ్లు కొరికావు. పంజాబీలో చెబితే పద్ధతిగా ఉంటుందని మైం తుహాను పిరా కరదా హాం అన్నప్పుడు పోలీసులకి చెప్పి పిప్పి చేయించావు. అయినా నేనొదులుతానా? ఒడియా నేర్చుకొని మరీ ము తుమాకు భళా పాయే అని నా ప్రేమకు ఒప్పించాలని ప్రయత్నిస్తే.. ‘నీ ముఖానికి నేను కావాలా’ అని కసురుకున్నావు. బట్టీ పట్టి మరీ గుజరాతీలో హువామ్‌ తనే ప్రేమా కరువామ్‌ చు’ అంటే.. చేతులు విరిచేస్తానని చెప్పుకొచ్చావు. సంస్కృతంలో చెబితే శాంతంగా ఆలోచిస్తావని అహం త్వయి స్నిహ్యమి అని అంటే.. కోపంతో రగిలిపోయావు. నాన్‌ నిన్నే స్నేహిక్కున్ను అని మలయాళంలో చెప్పి మాయ చేయాలనుకుంటే.. మరోసారి కనపడితే శాల్తీ మిగలదని బెదిరించావు. మీ తుఝ్యవర్‌ ప్రేమ కరతో అని మీఠీ మీఠీ మరాఠీలో చెప్పినా.. ఠపీఠపీమని నా బుర్రపై కర్రతో కొట్టేశావు. ఏం చేసినా నా మొర ఆలకించేలా లేవనుకొని, చిట్టచివరగా యూనివర్సల్‌ భాష ఆంగ్లంలో I LOVE YOU అని చెప్పేశాను. నీపై నా ప్రేమ ఆశ చావక అన్ని భాషల్లో ఐలవ్యూ చెబుతున్నా.. నిరాశే మిగులుస్తున్నావు. నీకు ఏ  భాషలో చెపితే నా గోస అర్థం అవుతుందో ఇకనైనా చెప్పు. చివరిశ్వాస వరకూ నీకోసమే ఎదురుచూస్తూ ఉంటాను.

పంపినవారు: నల్లపాటి సురేంద్ర, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని