పాకెట్‌ మనీ.. పైపైకి

చేతిలో ఐఫోన్‌.. రైడింగ్‌కి కేటీఎం బైక్‌.. ముచ్చట్లకు రెస్టరెంట్‌.. సినిమాలకు ఐమాక్స్‌.. యూత్‌ ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గడమే లేదు. రేపు ఉంటుందో లేదో.. ఈరోజే ఎంజాయ్‌ చేద్దాం అన్నట్టుంది వాళ్ల తీరు.

Published : 09 Mar 2024 00:03 IST

చేతిలో ఐఫోన్‌.. రైడింగ్‌కి కేటీఎం బైక్‌.. ముచ్చట్లకు రెస్టరెంట్‌.. సినిమాలకు ఐమాక్స్‌.. యూత్‌ ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గడమే లేదు. రేపు ఉంటుందో లేదో.. ఈరోజే ఎంజాయ్‌ చేద్దాం అన్నట్టుంది వాళ్ల తీరు. ఇదంతా ఎవరి గురించి? టీనేజీ దాటి, ఇంకా కొలువులో కుదురుకోని యువత గురించే. ఈ పడుచు ప్రాయుల పాకెట్‌మనీ ఏడాదికి 12శాతం చొప్పున పెరుగుతోందంటోంది అసోచామ్‌. ఆ సర్వేలో వెల్లడించిన ఇతర విషయాలేంటంటే..

  • అసలు ఈ పాకెట్‌మనీ అనే కాన్సెప్ట్‌ 1960లో మొదలైందట. ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల ఖర్చు కోసం అప్పట్లో నెలకి రూ.50రూపాయల వరకు ఇచ్చేవారట. 1985 వచ్చేసరికి కుర్రకారు రూ.100వరకు దక్కించుకున్నారు.
  • మొదట్లో యువత ఈ పాకెట్‌మనీని అత్యధికంగా సినిమాలకు వెళ్లడానికే ఉపయోగించేవారట. తర్వాత రానురాను ఇతర వ్యాపకాలు వచ్చి చేరాయి. 2011 వచ్చేసరికి ఈ పాకెట్‌మనీ మొత్తం సగటున రూ.1,500లకు చేరింది.
  • పాకెట్‌మనీలో అత్యధికం షాపింగ్‌కే ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ తర్వాత స్థానం సెల్‌ఫోన్‌ రీఛార్జ్‌లది. టీనేజీ పిల్లలైతే.. అత్యధికంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌, గ్యాడ్జెట్లపై వెచ్చిస్తున్నారు.
  • స్నేహితులతో కలిసి సరదాగా రెస్టరెంట్‌లకు వెళ్లి బిర్యానీలు లాగించడం.. డ్రింక్స్‌ తాగడం వారంలో ఒక్కరోజైనా ఉంటోందట. ఇక అమ్మాయిలైతే.. తమ పాకెట్‌మనీలో అత్యధికం కాస్మోటిక్స్‌కే ఖర్చు పెట్టేస్తున్నారు. ఐస్‌క్రీమ్‌లు.. సినిమాలు, షాపింగ్‌ తర్వాత స్థానంలో ఉన్నాయి.
  • వరల్డ్‌ యూత్‌ డే సందర్భంగా చేసిన మరో సర్వే ప్రకారం దిల్లీ నగరంలోని అమ్మాయిలు, అబ్బాయిలు అత్యధికంగా పాకెట్‌మనీ అందుకుంటున్నారు. తర్వాత ముంబయి, బెంగళూరులున్నాయి. ఆ నగరాల్లో ఒక్కో విద్యార్థి వరుసగా రూ.6వేలు, రూ.5వేలు.రూ.4.5వేలు అందుకుంటున్నారు.
  • మిలీనియల్స్‌ కంటే.. ఈకాలం జనరేషన్‌ జడ్‌లు మహా ముదుర్లు. నాన్న దగ్గర పాకెట్‌మనీ తీసుకుంటూనే అమ్మ దగ్గరా కాకా పడుతున్నారు. ఆ మాటకొస్తే తల్లిదగ్గరే వాళ్లకి ఎక్కువ గిట్టుబాటు అవుతోందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని