Andhra news: అలా చులకన చేసేలా మాట్లాడితే సహించేది లేదు: నాదెండ్ల మనోహర్‌

ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైకాపా పాలన ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. అధికారంలో ఉన్నవారు ఏం మాట్లాడినా..

Published : 19 Mar 2022 17:13 IST

అమరావతి: ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైకాపా పాలన ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. అధికారంలో ఉన్నవారు ఏం మాట్లాడినా.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరపాటేనని పేర్కొన్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని.. సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాదని.. ఫలితాలు ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నాదెండ్ల ప్రకటన విడుదల చేశారు.

‘‘కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడింది చూశాను. ఆయన మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం రావడం లేదు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జనసేన నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ద్వారంపూడి సమయం వృథా చేసుకోకుండా కాకినాడ అభివృద్ధిపై దృష్టి సారించాలి. పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలు, డంపింగ్‌ యార్డుల్లా మారిన మత్స్యకార గ్రామాల గురించి మాట్లాడండి. పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న వైకాపా నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధికి సమయం కేటాయిస్తే ప్రజలు సంతోషిస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే అవకాశం లేదు. ఈ ప్రాంతంలో జనసేన బలంగా ఉంది. గతంలో మహిళలను ద్వారంపూడి గాయపరిచారు. రాబోయే ఎన్నికల్లో వాళ్లే ఇంటింటికీ వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారు’’ అని నాదెండ్ల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని