బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే రూ.60,740 కోట్ల ఖర్చు

రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణాల నిమిత్తం చెల్లించిన మొత్తంలో... రూ.60,740.83 కోట్ల వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సుల (చేబదుళ్లు) చెల్లింపుతోపాటు

Published : 27 Nov 2021 02:56 IST

రుణాలు చెల్లించేందుకు వెచ్చించిన ప్రభుత్వం

అది అధీకృత ఖర్చు కాదని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణాల నిమిత్తం చెల్లించిన మొత్తంలో... రూ.60,740.83 కోట్ల వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సుల (చేబదుళ్లు) చెల్లింపుతోపాటు ముందు సంవత్సరం తీసుకున్న రూ.362 కోట్లు కలసి ఉందని, ఈ వ్యయానికి ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపుల్లేవని కాగ్‌ తెలిపింది. ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15,991.85 కోట్ల అనుబంధ పద్దుల్ని 2020 జూన్‌లో శాసనసభ ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టింది. ఆ మొత్తాన్ని చట్టసభల ఆమోదం పొందకుండానే 2020 మార్చి 31లోగా ప్రభుత్వం ఖర్చు చేసేసిందని తెలిపింది. అది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమంది. అది చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్‌పై నియంత్రణను బలహీనపరుస్తుందని, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రోత్సహించినట్టవుతుందని పేర్కొంది. ‘దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ను కారణంగా చూపింది. 2020 మార్చి చివరిలో లాక్‌డౌన్‌ విధించిన మాట వాస్తవమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కి ఆర్డ్‌నెన్స్‌ ద్వారా ఆమోదం పొందింది. 2019-20 సంవత్సర అనుబంధ పద్దుల వివరాల్ని దానిలో చేర్చలేదు’ అని తెలిపింది.  బడ్జెట్‌ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ లోటుపాట్లను కాగ్‌ తన నివేదికలో ప్రస్తావించింది. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...!


కొన్ని శాఖల్లో మిగులు... కొన్ని శాఖల్లో తగులు

* వాస్తవికత లేని ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్‌ కేటాయింపులు, పేలవమైన వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ, పథకాల అమలులో సామర్థ్య లోపం, బలహీనమైన అంతర్గత నియంత్రణల కారణంగా వివిధ అభివృద్ధి కారక అంశాలకు అవసరమైనదానికంటే తక్కువ కేటాయింపులు చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని శాఖల్లో ఎక్కువ నిధులు మిగిలి పోతున్నాయి.

* శాసనసభ ఆమోదించిన కేటాయింపులకు మించి అధికంగా ఖర్చు చేస్తున్న సందర్భాలు పునరావృతమవుతున్నాయి. ఇది శాసనసభ అభీష్ఠానికి విరుద్ధం.

* 2019-20 బడ్జెట్‌లో వోటెడ్‌ వ్యయానికి రూ.2,18,148 కోట్లు, ఛార్జ్‌డ్‌ వ్యయానికి రూ.10,130 కోట్లు కేటాయించగా... వోటెడ్‌ వ్యయంలో రూ.66,725 కోట్లు మిగలగా, ఛార్జ్‌డ్‌ విభాగంలో రూ.67,082 కోట్లు అదనంగా ఖర్చు చేశారు.

* రెవెన్యూ వ్యయంగా ఖర్చు చేసిన రూ.1,006 కోట్లను మూలధన వివరణాత్మక పద్దుల కింద తప్పుగా వర్గీకరించారు.

* అనుబంధ బడ్జెట్‌ నిధుల కోసం వివిధ శాఖలు అధిక మొత్తంలో ప్రతిపాదనలు ప్రవేశపెడుతున్నాయి. కానీ... కొన్ని సందర్భాల్లో అనుబంధ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులే కాకుండా, తొలి బడ్జెట్‌ మొత్తాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నాయి. దానివల్ల నిధులు అవసరమైన ఇతర పథకాలకు అవసరమైనంత వెచ్చించడం సాధ్యపడటం లేదు. 2019-20 బడ్జెట్‌లో అనుబంధ బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.3,664 కోట్లు వినియోగించలేదు.

* వివిధ శాఖలకు రూ.1,116 కోట్ల అనవసర, పునః కేటాయింపులు చేశారు.

* భారీ, మధ్య తరహా నీటిపారుదల, రోడ్లు-భవనాల శాఖలకు కేటాయించిన గ్రాంట్లలో ముఖ్యంగా మూలధన వ్యయానికి సంబంధించి తక్కువ బడ్జెట్‌ వినియోగించడంతో రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభావం పడింది. విద్య, వైద్య ఆరోగ్యం గ్రాంట్లను తక్కువగా వినియోగించడంతో మానవ వికాసం, జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడింది. అత్యవసరమైన, మౌలిక సౌకర్యాల కల్పనకు ఉపయోగపడే గ్రాంట్లను తక్కువగా వినియోగించడాన్ని ప్రభుత్వం లోతుగా పరిశీలించి తగిన దిద్దుబాటు చర్యల్ని సత్వరమే చేపట్టాలి.


ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం  పనితీరు బడ్జెట్‌ని రూపొందిస్తోంది. కానీ బడ్జెట్‌ ప్రవేశపెట్టేటప్పుడు... ముందు సంవత్సరం బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యాల్ని ఏ మేరకు సాధించారన్న  వివరాల్ని సభలో ప్రవేశపెట్టడం లేదు. 2019-20 బడ్జెట్‌ కూడా దీనికి మినహాయింపు కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని