అమ్మాయిలతో డ్యాన్సులు నేనే ఆపించా

‘రాష్ట్రంలో అన్నిచోట్లా జరిగినట్లే గుడివాడలో పండక్కి కోడి పందేలు, జూదం జరిగాయి. మహిళలతో డ్యాన్సులు వేయిస్తున్నట్లు తెలిస్తే, డీఎస్పీకి నేనే ఫోన్‌చేసి.. వెంటనే ఆపించాలని ఆదేశించాను.

Published : 22 Jan 2022 04:35 IST

క్యాసినో పెట్టినట్లు నిరూపిస్తే.. పెట్రోలు పోసుకుని ఆత్మహత్య

పోలీసులు ఉన్నారు కాబట్టి బతికారు: మంత్రి కొడాలి నాని

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో అన్నిచోట్లా జరిగినట్లే గుడివాడలో పండక్కి కోడి పందేలు, జూదం జరిగాయి. మహిళలతో డ్యాన్సులు వేయిస్తున్నట్లు తెలిస్తే, డీఎస్పీకి నేనే ఫోన్‌చేసి.. వెంటనే ఆపించాలని ఆదేశించాను. డ్యాన్సులు మొదలైన అయిదారు గంటల్లో ఆపించారు. దానికి క్యాసినో అని పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టిస్తున్నారు’ అని మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఆయన సచివాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘కొవిడ్‌ రావడంతో ఈ నెల 6 నుంచి ఆసుపత్రిలో ఉన్నాను. గుడివాడలో లేను. మంత్రివర్గ సమావేశం ఉండటంతో ఈ రోజే వచ్చాను. చంద్రబాబు ఏవో విజువల్స్‌ తీసుకొచ్చి, నేను ఊళ్లో లేని సమయంలో నా కళ్యాణ మండపంలో ఏదో జరిగిపోయిందని హడావిడి చేశారు. నా కళ్యాణమండపం రెండున్నర ఎకరాల్లో ఉంటుంది. అక్కడ క్యాసినో, పేకాట నిర్వహించారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొని, పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా. నిరూపించలేకపోతే చంద్రబాబు, ఆ పార్టీ ఏం చేస్తుంది? తెదేపా నిజనిర్ధారణ కమిటీలో ఎవరున్నారు? ఎప్పుడూ గెలవలేని వర్ల రామయ్య, మహిళలను వేధించి విజయవాడలో ఓటమిపాలైన వాళ్లు ఉన్నారు. ప్రశాంతంగా ఉండే గుడివాడకు వాళ్లను పంపి రచ్చ చేశారు. పోలీసులు ఉన్నారు కాబట్టి బతికి వెనక్కి వచ్చారు. చంద్రబాబు కాదు, ఎవరొచ్చినా గుడివాడలో నా చిటికిన వేలిపై వెంట్రుక కూడా పీకలేరు’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తెదేపా పెద్ద ఎత్తున ఆందోళన చేసిందని, మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘చంద్రబాబు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాలని నేను డిమాండు చేస్తాను. ఆయన వెళ్లిపోతారా?’ అని ఎదురు ప్రశ్నించారు .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని