కప్పులో ఇలాగే ఆడితే..?

హార్దిక్‌ పాండ్య.. కపిల్‌ దేవ్‌ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్‌లు.. అప్పుడప్పుడూ బౌలింగ్‌ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్‌రౌండర్‌.

Updated : 05 May 2024 08:46 IST

హార్దిక్‌ పాండ్య.. కపిల్‌ దేవ్‌ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్‌లు.. అప్పుడప్పుడూ బౌలింగ్‌ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్‌రౌండర్‌. ఒక దశలో టీ20 జట్టు పగ్గాలు కూడా అందుకున్నాడు. అలాంటి ఆటగాడు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. ముంబయి కెప్టెన్సీ తెచ్చిన వ్యతిరేకత అతడి ఆటను దెబ్బతీస్తోంది. మరి కొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్‌లోనూ ఆ ప్రభావం కొనసాగితే టీమ్‌ఇండియాకు నష్టమే!

ఈనాడు క్రీడావిభాగం

ఈ ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి మొదటగా నిష్క్రమించిన జట్టు ముంబయి ఇండియన్సే. కొన్నేళ్ల నుంచి ముంబయి ప్రదర్శన ఏమంత గొప్పగా లేని మాట వాస్తవం. కానీ ఈసారి ఆ జట్టు వైఫల్యం మీద జరుగుతున్నంత చర్చ మునుపెన్నడూ జరగలేదు. అందుక్కారణం.. రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌ అయ్యాక అతడితో పాటు జట్టు తడబడుతున్న తీరే! రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను కెప్టెన్‌ను చేయడం పట్ల అభిమానుల్లో ముంబయి పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచడమే కాదు.. జట్టు తత్వాన్ని కూడా దెబ్బ తీసిందన్నది స్పష్టం. ఒకప్పుడు సమష్టితత్వానికి మారు పేరుగా ఉన్న ముంబయి.. ఈసారి కలిసికట్టుగా ఆడలేకపోయింది. ఓవైపు అభిమానుల నుంచి ఊహించని వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఇంకోవైపు జట్టును సమష్టిగా నడిపించలేక హార్దిక్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం మైదానంలో అతణ్ని చూసిన వాళ్లందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. ఈ ప్రభావం అతడి వ్యక్తిగత ప్రదర్శన మీదా తీవ్ర ప్రభావమే చూపింది. గత రెండు సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌ను కెప్టెన్‌గా గొప్పగా నడిపించడమే కాక.. ఆటగాడిగానూ సత్తా చాటాడు హార్దిక్‌. కానీ ముంబయి తరఫున ఆ ప్రదర్శన ప్రతిఫలించలేదు. 11 మ్యాచ్‌ల్లో 19.8 సగటుతో 198 పరుగులే చేసిన హార్దిక్‌.. 8 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 11 కావడం గమనార్హం. కొన్ని మ్యాచ్‌ల్లో వికెట్లయితే పడ్డాయి కానీ.. ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. హార్దిక్‌ సారథి కావడం జట్టులోనూ చాలామందికి ఇష్టం లేదన్నది అంతర్గత సమాచారం. దీంతో తన పట్ల అభిమానుల్లో, జట్టులో అంతర్గతంగా నెలకొన్న వ్యతిరేకత హార్దిక్‌ను కుదురుగా ఉండనివ్వలేదు! ఈ ఒత్తిడిలో కెప్టెన్‌గానే కాక ఆటగాడిగానూ అతను విఫలమయ్యాడు. ఒకప్పుడు స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపించిన అతను.. చాలా మ్యాచ్‌ల్లో షాట్లు ఆడలేక అవస్థలు పడ్డాడు. బౌలర్‌గా రాణించకపోతే ప్రపంచకప్‌ జట్టులో చోటుండదన్న ఉద్దేశంతో తన అవసరం లేకపోయినా పలు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేశాడు కానీ.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే ప్రస్తుత ఫామ్‌ కంటే గత ప్రదర్శనలను, మిడిలార్డర్లో హార్దిక్‌ లాంటి అనుభవజ్ఞుడి అవసరాన్ని  దృష్టిలో ఉంచుకుని అతడికి సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఐపీఎల్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌కు ప్రపంచకప్‌లో అవకాశం దక్కలేదు. ఫినిషర్‌గా బాగా ఉపయోగపడతాడని అంచనాలున్న రింకు సింగ్‌కు కూడా సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాటర్‌గా హార్దిక్‌ కంటే రాహుల్‌ లేదా రింకునే మెరుగనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ తన ఎంపిక తప్పు కాదని తన ప్రదర్శనతో చాటిచెప్పాల్సిన స్థితిలో ఉన్నాడు. ఇది అతడి మీద ఒత్తిడిని మరింత పెంచేదే. ముంబయి కెప్టెన్‌గా తప్పక రాణించాల్సిన స్థితిలో ఒత్తిడికి చిత్తయ్యాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో మాత్రం అతను ఒత్తిడి తట్టుకుని ఏమేర రాణిస్తాడన్నది ప్రశ్నార్థకం. హార్దిక్‌ వీలైనంత త్వరగా ఐపీఎల్‌ తాలూకు ప్రతికూల ప్రభావం నుంచి బయటపడాలి. పొట్టి కప్పు మొదలయ్యేలోపు అతను మానసికంగా, శారీరకంగా దృఢంగా మారడం జట్టుకు ఎంతో అవసరం. ప్రపంచకప్‌ను తాజాగా ఆరంభిస్తే మునుపటి హార్దిక్‌ను చూడడానికి అవకాశముంటుంది. లేదంటే ప్రపంచకప్‌లో భారత్‌ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడడం ఖాయం.


‘‘హార్దిక్‌ పూర్తిగా నీరసించిపోయినట్లు కనిపిస్తున్నాడు. అతను తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. తనను చూస్తే బాధేస్తోంది. నేను కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేసినా కలిసి రాదు. మన జట్టు సరైన ప్రదర్శన చేయనపుడు చాలా కష్టంగా ఉంటుంది. మనం బాగా ఆడకపోయినా జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుంటే కెప్టెన్‌గా సంతోషించవచ్చు. కానీ జట్టు బాగా ఆడకపోతే కెప్టెన్‌గా మొత్తం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అదే కష్టం’’

ఆరోన్‌ ఫించ్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని