తెదేపా ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదును అడ్డుకునేందుకు జగన్‌ కుట్ర: లోకేశ్‌

తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాట్సప్‌ ద్వారా చేపట్టకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నించారని.. అందుకోసం వాట్సప్‌ నిర్వాహకులకు నాలుగు పేజీల లేఖ రాసే స్థాయికి వైకాపా ప్రభుత్వం దిగజారిందని

Published : 22 Apr 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాట్సప్‌ ద్వారా చేపట్టకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నించారని.. అందుకోసం వాట్సప్‌ నిర్వాహకులకు నాలుగు పేజీల లేఖ రాసే స్థాయికి వైకాపా ప్రభుత్వం దిగజారిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘మీరు చేయలేరు. మమ్మల్ని చేయనివ్వరు. మీరు చేతగానోళ్లు, మేం చేస్తే అసూయ’ అని ఆయన సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో డిజిటల్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించిన అనంతరం లోకేశ్‌ మాట్లాడారు. ‘వాట్సప్‌ ద్వారా డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు సంబంధించి ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుండగా దాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఓటర్ల సమాచారాన్ని తెదేపా దుర్వినియోగం చేస్తోందని, దాని వల్ల మీరు ఇబ్బంది పడతారని వాట్సప్‌కి లేఖ రాసింది. దాంతో మా నంబర్‌ను వాట్సప్‌ కొన్నిరోజులు బ్లాక్‌ చేసింది. ఓటర్ల సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉన్నదేనని, మేం పారదర్శకంగా డిజిటల్‌ సభ్యత్వ నమోదు చేస్తున్నామని వాట్సప్‌కి వివరించాం. మా సమాధానాలతో వారు పూర్తిగా సంతృప్తి చెంది, మా ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతించారు’ అని వివరించారు. సభ్యత్వ నమోదును ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెదేపా బలం కార్యకర్తలే. వారి సంక్షేమానికి ప్రత్యేక విభాగం పెట్టామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని