Updated : 05 Jul 2022 15:13 IST

Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌!

ఈనాడు, హైదరాబాద్‌ న్యూస్‌టుడే, మాదాపూర్‌: హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌ హిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం నియోజకవర్గం ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసం వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఇంట్లోకి   వెళ్లేందుకు ప్రయత్నించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ద్వారా ఇది గమనించిన ఎంపీ భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు అతడిని పట్టుకొన్నారు. వారు ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఐడీ, ఆధార్‌కార్డులు చూపేందుకు నిరాకరించాడు. అనంతరం గచ్చిబౌలి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.

తాను ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభాని అలియాస్‌ ఫరూక్‌ అని, రెండు రోజుల క్రితం ఇన్నోవాలో ఆరుగురు పోలీసులం హైదరాబాద్‌కు వచ్చామని చెప్పాడు.

ఎంపీని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ..

శనివారం ఉదయమే 10-12 మంది వ్యక్తులు రెండు కార్లలో హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఇన్నోవాలో గచ్చిబౌలిలోని ఎంపీ రఘురామ ఇంటి వద్ద కాపు గాసినట్టు సమాచారం. ఆయన వాహనాన్ని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ వచ్చారు. ఏపీ పోలీసులు తనను వెంబడిస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాత్రి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం బయల్దేరిన ఎంపీ రఘురామ ప్రధాని సభకు వెళ్లకుండానే బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎంపీ రఘురామ నివాసంలోకి ఒకరు ప్రవేశించి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించే ప్రయత్నించారు. ఇది గుర్తించిన ఎంపీ అనుచరులు అప్రమత్తమయ్యారు.  దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి సుభాని అని, అతడి ఫోన్‌కు ఆంజనేయులు అనే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తిని గమనించామని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఎంపీ రఘురామ పీఏ శాస్త్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వైపు విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్‌ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని ఇంట్లోకి తీసుకెళ్లారని, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే ఫరూక్‌ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వచ్చిన ఫిర్యాదులు తీసుకొని విచారణ చేపట్టామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ వెల్లడించారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని