పర్యాటకం పేరుతో అన్యాయం చేయొద్దు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌లో రైతుల స్వాధీనంలో ఉన్న 116 ఎకరాల భూమిని పర్యాటకశాఖకు కేటాయించే ప్రయత్నాలు

Published : 25 Sep 2022 05:25 IST

మొగల్తూరులో బీచ్‌ వద్ద 116 ఎకరాలను పర్యాటకశాఖకు కేటాయించే యత్నాలపై రైతుల ఆందోళన

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌లో రైతుల స్వాధీనంలో ఉన్న 116 ఎకరాల భూమిని పర్యాటకశాఖకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతుండటంపై స్థానిక రైతులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌ సముద్రతీరంలో 116.24 ఎకరాల భూమిని రీ-సర్వే చేయాలని సర్వే సెటిల్‌మెంట్‌, భూ రికార్డుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. బీచ్‌ దగ్గర అన్‌ సర్వేభూమి 116.24 ఎకరాలకు తూర్పున రహదారి, పడమర పర్యాటకశాఖకు కేటాయించిన భూమి, ఉత్తరం ఆర్‌ఎస్‌ నంబరు 438 నుంచి 445 వరకూ, దక్షిణాన బంగాళాఖాతం హద్దుల మధ్య ఉన్న భూమికి పర్యాటక అభివృద్ధి నిమిత్తం సర్వే నిర్వహించి నంబర్లు కేటాయించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై తహసీల్దారు జి.అనితాకుమారిని ‘న్యూస్‌టుడే’ సమాచారం కోరగా పర్యాటక శాఖకు భూమిని కేటాయించేందుకు ఆ ఆదేశాలు జారీచేశారన్నారు. సీఆర్‌జడ్‌ పరిధిలో ఉన్న ఈ భూమిలో తరాతరాలుగా రైతులు కొబ్బరి, సర్వి తోటలను సాగుచేస్తున్నారు. ఈ భూమిని పర్యాటక శాఖకు కేటాయిస్తే ఉపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు సమీపంలో ఐదేళ్ల క్రితం రిసార్టు నిర్మాణానికి 6 ఎకరాలు, ఇటీవల పోలీస్‌ అవుట్‌పోస్టు నిర్మాణానికి 2 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడంతో ఆ ప్రాంతవాసులు హైకోర్టును ఆశ్రయించి ఆ ప్రయత్నాన్ని నిలుపుదల చేయించారు. ఇప్పుడు పర్యాటక శాఖకు 116 ఎకరాలు కేటాయించే ప్రయత్నాలు జరుగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాంతంలో భూములకు మంచి గిరాకీ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని