విశాఖ తీరం ఉద్రిక్తం

విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ సంస్థ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి చేసింది.

Published : 25 Sep 2022 05:25 IST

కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారుల ఆందోళన

నిరసనకారులపై సీఐఎస్‌ఎఫ్‌ బృందం దాడులు

విశాఖపట్నం (జగదాంబకూడలి), న్యూస్‌టుడే: విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ సంస్థ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి చేసింది. సంస్థ ఏర్పాటు వల్ల నిర్వాసితులుగా మారి ఉపాధి కోల్పోయిన తమకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని విశాఖ చేపలరేవు ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఎప్పటినుంచో యాజమాన్యం, అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. చివరికి విసిగి వేసారి శనివారం ఉదయం ఆరున్నరకు సుమారు 500 మంది మత్స్యకారులు 50 మోటారు బోట్లలో విశాఖ టెర్మినల్‌ కంటైనర్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టెర్మినల్‌ లోపలికి వెసల్స్‌ (నౌకలు) రాకుండా అడ్డుకున్నారు. దీంతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చి కర్రలు, రాళ్లతో దాడి చేసి మత్స్యకారులను చెదరగొట్టారు. దాడిలో గాయపడిన ముగ్గురు మత్స్యకారులను సహచరులు ఆసుపత్రికి తరలించారు. దాడి విషయం తెలుసుకున్న సుమారు రెండు వేల మంది మత్స్యకారులు కంటైనర్‌ టెర్మినల్‌ వద్దకు తరలివచ్చారు. ప్రధాన ద్వారం వద్ద నిల్చుని యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

ఉద్యోగులు, ట్రాన్స్‌పోర్టు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మత్స్యకారులు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం నాయకులు అయ్యప్ప, పెంటయ్య, నొలు పోతురాజు, గొడ్లు నూకరాజు, కొరలయ్య, జయకుమార్‌ తదితరులు మాట్లాడుతూ.. ‘2002లో విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు మా నివాస స్థలాలిచ్చాం. కుటుంబానికి ఒక ఉద్యోగం, రూ.లక్ష నగదు, 60 గజాల ఇంటి స్థలం ఇస్తామని నాడు హామీనిచ్చారు. అప్పట్లో 543 మందికి రూ.25 వేల చొప్పున నగదు ఇచ్చారు. మిగిలిన హామీలను పట్టించుకోలేదు. అడిగితే నేడు..రేపు అంటున్నారు. కంటైనర్‌ టెర్మినల్‌ యాజమాన్యం తీరుకు నిరసనగా శనివారం అప్పట్లో మేము వేట సాగించిన ప్రాంతానికి పడవల్లో వెళ్లాం. సముద్రంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది మాపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు..’ అనివాపోయారు. హామీల అమల్లో టెర్మినల్‌ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ వచ్చి సర్దిచెప్పినా మత్స్యకారులు సాయంత్రం వరకు ఆందోళన విరమించలేదు. చీకటి పడుతున్న సమయంలో ఆర్డీవో మరోసారి మత్స్యకారులతో చర్చించారు. 27న కలెక్టర్‌ సమక్షంలో చర్చించి న్యాయం చేస్తామని హామీనివ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts