ద్వీపకల్పంలో విశిష్ట జీవవైవిధ్య నిలయాలు!

దేశ భౌగోళిక స్వరూపంలో అత్యంత ముఖ్యమైనవి పీఠభూములు. వ్యవసాయంలో, నీటి వనరుల నిర్వహణలో కీలకంగా  ఉన్నాయి. దక్కన్‌ పీఠభూమిని అనుకుని ఉన్న తూర్పు, పశ్చిమ కనుమలు ప్రధాన జీవవైవిధ్య కేంద్రాలు.

Published : 07 May 2024 00:36 IST

ఇండియన్‌ జాగ్రఫీ

దేశ భౌగోళిక స్వరూపంలో అత్యంత ముఖ్యమైనవి పీఠభూములు. వ్యవసాయంలో, నీటి వనరుల నిర్వహణలో కీలకంగా  ఉన్నాయి. దక్కన్‌ పీఠభూమిని అనుకుని ఉన్న తూర్పు, పశ్చిమ కనుమలు ప్రధాన జీవవైవిధ్య కేంద్రాలు. విస్తారమైన వృక్ష, జంతు జాతులకు నిలయాలు. అనేక నదులకు జన్మస్థానాలు. ఇవి ఉపఖండంలో రుతు పవనాలను, ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ఈ భౌగోళిక లక్షణాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవడం ద్వారా భారతదేశంలోని వైవిధ్యభరితమైన ప్రకృతిని, పర్యావరణ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. శిలలతో కూడిన నేలల స్వభావాలను, వివిధ ఖనిజాల విస్తరణ తీరును తెలుసుకోవచ్చు.

పీఠభూములు

తూర్పు - పశ్చిమ కనుమలు

ద్వీపకల్ప పీఠభూమి: మూడు వైపుల్లో నీరు, ఒక వైపు భూభాగం ఉండే ఎత్తయిన భాగాన్ని ద్వీపకల్ప పీఠభూమి అంటారు. ఇది అతి పురాతనమైంది.త్రిభుజాకారంలో ఉంటుంది. ఎత్తు సుమారు 300 మీ. నుంచి 2000 మీ. వాలు పడమర నుంచి తూర్పునకు వాలి ఉంటుంది. ఇది దేశం మొత్తంలో 48.9 శాతం భూభాగాన్ని ఆక్రమించింది. ప్రీకేంబ్రియన్‌ యుగానికి చెందిన అతిపురాతన, అతి పెద్ద నైసర్గిక స్వరూపం. నర్మదా నది పీఠభూమిని రెండుగా విభజించడం వల్ల ఉత్తరం వైపున ఉన్న భూభాగాన్ని ‘సెంట్రల్‌ హైల్యాండ్స్‌’, దక్షిణంగా ఉన్న భాగాన్ని ‘దక్కన్‌ పీఠభూమి’ అంటారు. ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తయిన శిఖరం అనైముడి (2,695 మీ.). ఈ పీఠభూమికి ఉత్తరాన వింధ్య, సాత్పురా పర్వతాలు; తూర్పున తూర్పు కనుమలు, పడమర పశ్చిమ కనుమలు ఉన్నాయి. చోటానాగ్‌పుర్‌, మైసూరు పీఠభూములు దీనిలోనే ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ఆరావళి, వింధ్య, సాత్పురా, తూర్పుకనుమలు, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండలు ముఖ్యమైనవి.

ఆరావళి పర్వతాలు: ఇవి అతిపురాతనమైనవి. గుజరాత్‌ నుంచి దిల్లీ వరకు 700 కిలోమీటర్లు పొడవు విస్తరించాయి. ప్రారంభంలో ఎత్తుగా ఉన్న కొండలు కాలక్రమేణా క్రమక్షయానికి గురై అవశిష్ట పర్వతాలుగా మిగిలిపోయాయి. ఈ కొండల్లో ముఖ్యమైన నదులు బనాస్‌, మాహీ, లూనీ. ఇవి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇక్కడ ఎత్తయిన ప్రాంతం ‘మౌంట్‌ అబూ’. అతి ప్రాచీన రాగి గనులైన ఖేత్రీ ఇక్కడే ఉన్నాయి. ఎత్తయిన శిఖరం గురుశిఖర్‌ (1,722 మీ.). ఆరావళి పర్వతాల్లో ముఖ్య కనుమలు దేనూరి, బర్‌, పిప్లిఘాట్. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన హాల్దీఘాట్‌ యుద్ధం ఇక్కడే జరిగింది. ఈ హాల్దీఘాట్ రాజసమంద్‌ - పాళీ జిల్లాలను కలుపుతుంది.

వింధ్య పర్వతాలు: ఇవి నర్మదా లోయకు కుడివైపున, మాళ్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. తూర్పు, పడమరలుగా వ్యాపించి సోన్‌ నదీలోయ పక్కన నిట్టనిలువుగా ఉన్న కైమూర్‌ పర్వతాల్లో కలుస్తాయి. ఇవి హోషంగాబాద్‌ సమీపంలో నర్మదా నదిని అనుకుని ఉన్నాయి. వీటిని తూర్పున కైమూర్‌ శ్రేణులని పిలుస్తారు. ఎత్తు 800 - 1400 మీ. ఇక్కడ ‘భీంబెట్కా గుహలు’ (రాజస్థాన్‌లో) ఉన్నాయి. ఈ పర్వతాల్లో ఎత్తయిన ప్రదేశం పావ్‌గఢ్‌. వజ్రాల నిల్వలున్న పన్నా కొండలు, పన్నా నేషనల్‌ పార్కు, బాందవ్‌ నగర్‌ నేషనల్‌ పార్కు ఇక్కడే ఉన్నాయి.

సాత్పూరా పర్వతాలు: ఇవి దక్కన్‌ పీఠభూమికి ఉత్తరాన ఉన్నాయి. వీటిల్లో వేసవి విడిదిని మహాదేవ్‌ కొండల్లోని ‘పాంచ్‌ మర్హి’ అని పిలుస్తారు. ఇక్కడ ఎత్తయిన శిఖరం దూప్‌ఘర్‌, 1350 మీటర్లలో ఉంటుంది. ఈ పర్వతాలకు ఉత్తరాన నర్మదా, దక్షిణాన తపతి నదులు ప్రవహిస్తాయి. ఇవి తూర్పు నుంచి పడమరకు ప్రవహించి అరేబియా మహా సముద్రంలో కలుస్తాయి. ఈ కొండల్లో సోన్‌, వార్థా, పెన్‌గంగా, బ్రహ్మాణ నదులు జన్మించాయి. ఇవి మహారాష్ట్రలోని రాజ్‌పిప్లి నుంచి దేవా వరకు వ్యాపించి ఉన్నాయి. వింధ్య, సాత్పురా పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తున్నాయి.

పశ్చిమ కనుమలు: దక్కన్‌ పీఠభూమికి పడమర అంచుల్లా ఉంటాయి. ఉత్తరాన తపతి నదీ నుంచి దక్షిణాన కన్యాకుమారి అగ్రం వరకు 1600 కి.మీ. పొడవునా ఉన్నాయి. వీటిని మహారాష్ట్రలో ‘సహ్యాద్రి కొండలు’ అంటారు. గోదావరి, కృష్ణా, కావేరీ నదులు ఇక్కడ జన్మించి, తూర్పు వైపునకు ప్రవహిస్తున్నాయి. ఎత్తయిన ‘జోగ్‌’ జలపాతం ఇక్కడే ఉంది. దీన్నే ‘మహాత్మా గాంధీ జలపాతం’ అంటారు. ఈ కనుమల్లో ఎత్తయిన శిఖరం అనైముడి (2,695 మీ). ఇది దక్షిణ భారత దేశంలోనూ, ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలోనూ అతి ఎత్తయినది. సైలెంట్‌ వ్యాలీ (కేరళ) ఈ శ్రేణిలోనే ఉంది.

తూర్పు కనుమలు: ఈ పర్వతాలు దక్కను పీఠభూమికి తూర్పు దిక్కున ఉన్నాయి. వీటిని పూర్వం మహేంద్రగిరులు అని పిలిచేవారు. పశ్చిమ కనుమల కంటే ఎత్తయినవి. వీటి సరాసరి ఎత్తు 750 మీటర్లు. లాంగుల్యా, సీలేరు, వంశధార, మాచ్‌ఖండ్‌ లాంటి నదులు ఈ కొండల్లో జన్మించాయి. లాంగుల్యా, సీలేరు పడమర వైపున; వంశధార, మాచ్‌ఖండ్‌ తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి. దక్షిణాన వీటికి అడ్డంగా కృష్ణా, పెన్నా నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదుల మధ్య ఉన్న కొండలనే నల్లమల్ల కొండలు అంటారు. వీటికి దక్షిణాన ‘పాల కొండలు’ ఉన్నాయి. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం జిందగడ (1690 మీ). తూర్పు కనుమలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుల్లో వ్యాపించి ఉన్నాయి. తూర్పు, పశ్చిమ కనుమలు తమిళనాడులోని గుడలూరు అనే ప్రదేశంలో ‘నీలగిరి కొండల’ వద్ద కలుస్తాయి.

నీలగిరి కొండలు: తూర్పు, పశ్చిమ కనుమలు కలిసే చోట నీలగిరి కొండలు ఉన్నాయి. వీటిలో ఎత్తయిన శిఖరం దొడబెట్ట (2,652 మీ.). అన్నామలై కొండలకు దక్షిణంగా నీలగిరి కొండలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న 32 కి.మీ. ప్రాంతాన్ని ‘పాల్‌ ఘాట్‌’ కనుమ అంటారు. అన్నామలై కొండల్లో ఈశాన్య దిశలోని శాఖను ‘పళని’ అంటారు. దక్షిణాన ఉన్న శాఖను కార్టమమ్‌ కొండలు అంటారు. అనైముడి శిఖరం ఈ కొండల్లో భాగమే.

మహారాష్ట్ర పీఠభూమి: బసాల్టిక్‌ శిలలతో కూడిన నల్లరేగడి నేలలు ‘రేగర్‌’ పేరుతో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గోదావరి, భీమ, కృష్ణా నదుల ప్రవాహాల ఫలితంగా లోయలు, కొండలతో నిండి ఉంటుంది.

కర్ణాటక పీఠభూమి: దీన్నే మైసూరు పీఠభూమి అంటారు. ఎత్తయిన శిఖరం చిక్‌మగ్‌ళూర్‌ జిల్లాలోని ములాంగిరిన్‌ బాబా బుడాన్‌ హిల్స్‌ (1913 మీ).

మార్వార్‌ పీఠభూమి: ఆరావళి పర్వతాలకు తూర్పున, రాజస్థాన్‌ తూర్పుభాగంలో విస్తరించి ఉంది. దీని ఎత్తు సరాసరి 250 -500 మీ. తూర్పు వైపునకు వాలి ఉంటుంది.

కేంద్ర ఉన్నత ప్రాంతం: దీన్నే మధ్య భారత్‌ పఠాన్‌ అంటారు. మార్వార్‌ పీఠభూమికి తూర్పున విస్తరించి ఉంది. ఇక్కడ చీలిక లోయలో చంబల్‌ నదీ లోయలు, బాడ్‌ల్యాండ్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నదులు నైరుతి నుంచి ఈశాన్యానికి ప్రవహిస్తాయి.

బుందేల్‌ ఖండ్‌ పీఠభూమి: ఇది యమునా నదికి దక్షిణంగా, వింధ్య, సాత్పురా పర్వతాలకు తూర్పుభాగాన విస్తరించి ఉంది. దీనికి ఉత్తరాన గ్వాలియర్‌ పీఠభూమి ఉంది.

మాల్వా పీఠభూమి: వింధ్య పర్వతాల్లో త్రిభుజాకారంగా ఉండే దీనికి తూర్పు దిక్కున బుందేల్‌ ఖండ్‌ పీఠభూమి ఉంది. ఇది మధ్యప్రదేశ్‌లోని ఆరావళి- వింధ్య పర్వతాల మధ్య ఉంది.

భాగల్‌ ఖండ్‌ పీఠభూమి: ఇది ఛŸత్తీస్‌గఢ్‌లో మైకా శ్రేణులకు, తూర్పున సున్నపురాయి, ఇసుక రాయితో విస్తరించి ఉంది.

బస్తర్‌/దండాకారణ్య పీఠభూమి: బస్తర్‌ ప్రాంతం ఛŸత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో విస్తరించి ఉంది. ఇది ఇనుప ఖనిజానికి ప్రసిద్ది.

చోటానాగ్‌పుర్‌ పీఠభూమి: ఇదిఝార్ఖండ్‌లో ఎక్కువగా, ఛత్తీస్‌గఢ్‌ ఉత్తర భాగంలో కొంత, పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో విస్తరించి ఉంది. ఈ పీఠభూమినే ‘రూర్‌ ఆఫ్‌ ఇండియా’ అంటారు. దేశంలో అత్యధికంగా బొగ్గును అందించే గొండ్వానా బొగ్గు క్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి.

మేఘాలయ పీఠభూమి: ఇది రాజమహల్‌ కొండలకు ఈశాన్య భాగాన మేఘలయా, షిల్లాంగ్‌ పీఠభూమిగా విస్తరించి ఉంది. ఇది గారో, కాశీ, జయంతియా కొండలకు తూర్పున విస్తరించి ఉంది. ఇక్కడ షిల్లాంగ్‌ పీఠభూమి ఎత్తయిన ప్రాంతం (1,961 మీ). ఈ పీఠభూమిని పశ్చిమాన గారోహిల్స్‌ (900 మీ.), మధ్యన ఖాసీ- జైంతియా హిల్స్‌ (1,500 మీ.), తూర్పున మికిర్‌ హిల్స్‌ (700 మీ) అని పిలుస్తారు.

దక్కన్‌ పీఠభూమి: ఇది నర్మదా నదికి దక్షిణంగా, ఉత్తరాన సాత్పురా పర్వతాలు, తూర్పున తూర్పుకనుమలు, పశ్చిమాన పడమటి కనుమలతో సరిహద్దులుగా త్రిభుజాకారంలో విస్తరించి ఉంది. భారత్‌లో అతిపెద్ద, అతిపురాతన పీఠభూమి. సరాసరి ఎత్తు 300-600 మీ.హైదరాబాద్‌  600 మీ. ఎత్తులో ఉంది. కర్ణాటక పీఠభూమి,   తెలంగాణ పీఠభూమి, తమిళనాడు ఎత్తయిన ప్రాంతం ఇందులో భాగం. కోలార్‌ గోల్డ్‌ఫీల్డ్‌ ్బరీబిన్శీ కర్ణాటక పీఠభూమిలో ఉంది. కర్ణాటక పీఠభూమిలో వేసవి విడిది కేంద్రం కెమ్మెన్‌ గండి (1,433 మీ). దేశంలో అత్యధిక వర్షపాతం పడే మాసిన్‌రాం, చిరపుంజిల తర్వాత అగుంబే (షిమోగో జిల్లా కర్ణాటక) ఇక్కడ ఉంది. తెలంగాణ పీఠభూమి రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు కూడా కలిసి ఉంటాయి. దీనికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణా, పెన్నా నదులు ప్రవహిస్తున్నాయి. ఉత్తరాన గోదావరి నది పరీవాహక ప్రాంతంలో గొండ్వానా శిలల ప్రాంతం, బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉంది. హైదరాబాద్‌ నగరం ఈ ప్రాంతంలోనే ఉంది. కడప శిలలు ఉన్న ప్రదేశంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని