icon icon icon
icon icon icon

PM Modi: వైకాపాది అవినీతి మంత్రం.. ఎన్డీయేది అభివృద్ధి మంత్రం: ప్రధాని మోదీ

వైకాపాది అవినీతి మంత్రం అయితే.. ఎన్డీయేది అభివృద్ధి మంత్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 06 May 2024 18:50 IST

అనకాపల్లి: వైకాపాది అవినీతి మంత్రం అయితే.. ఎన్డీయేది అభివృద్ధి మంత్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అనకాపల్లి జిల్లా రాజుపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాండ్‌, ల్యాండ్‌, మద్యం మాఫియా పాలన సాగుతోందని, ఈ దోపిడీ నుంచి విముక్తి కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగిందన్నారు. 

‘‘అనకాపల్లి నుంచి అనంతపురం వరకూ ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మించాం. రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వరకూ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో ఉంది. కోల్‌కతా నుంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే ఈ ప్రాంతం మీదుగా వెళ్తుంది. 2014 వరకు 4వేల కి.మీ జాతీయ రహదాలు ఉంటే.. ప్రస్తుతం 8వేల కి.మీ.లకు చేరాయి. ఎన్డీయే ప్రభుత్వం ఏపీలోని యువత కోసం పనిచేస్తోంది. ట్రిపుల్‌ ఐటీ, ఐసర్‌, ఐఐఎం లాంటి జాతీయ విద్యా సంస్థలు ప్రారంభించాం. పూడిమడకలో గ్రీన్‌ ఎనర్జీ పార్క్‌ ప్రతిపాదించాం. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు రూ.వెయ్యి కోట్ల సాయం అందించాం. వైకాపా మంత్రం అవినీతి. ఎన్డీయే మంత్ర అభివృద్ధి. అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పిస్తోంది. విశాఖ రైల్వేజోన్‌ మంజూరు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా ఇవ్వడం లేదు. ఏపీ కోసం కేంద్ర అనేక కార్యక్రమాలు చేపట్టింది. పేదల కోసం 21లక్షల పీఎంఏవై గృహాలు మంజూరు చేస్తే.. వాటిలో సగం కూడా వారికి ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు  వైకాపా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఈ ప్రాజెక్టులను వైయస్సాఆర్‌ ప్రారంభించారు. తండ్రి వారసత్వం తీసుకున్న జగన్‌ వాటిని పూర్తి చేయలేకపోయారు’’

‘‘అనకాపల్లి చెరకు రైతులకు పెద్ద కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చాలా చక్కెర పరిశ్రమలు మూతపడి రైతులు ఆందోళన చెందుతున్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వచ్చాక చెరకు రైతుల జీవితాల్లో మాధుర్యం తెస్తాం. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నాం. దీంతో దాదాపు రూ.8వేల కోట్ల వరకు చెరకు రైతులు లబ్ధి పొందుతున్నారు. ఎన్డీయే ప్రభుత్వం మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశాం. ఏపీలో కాంగ్రెస్‌ పోయి వైకాపా వచ్చినా మార్పులేదు. రెండూ అవినీతి పార్టీలే. పక్కనే ఉన్న కర్ణాటకలో ట్యాంకర్‌ మాఫియా, భూ మాఫియాతో ప్రభుత్వం నడుపుతున్నారు. ఏపీలో శాండ్‌, ల్యాండ్‌, మద్యం మాఫియాతో పాలన సాగిస్తున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విముక్తి చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఎన్నుకోవాలి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.  కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తాం’’ అని మోదీ భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img