Gudivada: ఆంక్షలను ఛేదించారు... అమరావతికి జైకొట్టారు

రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు శనివారం గుడివాడ వెళుతున్న వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, రాజధాని

Updated : 25 Sep 2022 09:33 IST

ఈనాడు, అమరావతి: న్యూస్‌టుడే-కంకిపాడు, కంకిపాడు గ్రామీణం: రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు శనివారం గుడివాడ వెళుతున్న వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, రాజధాని గ్రామాల రైతుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొందరు నాయకుల్ని, రైతుల్ని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించి, సాయంత్రం వరకు అక్కడే ఉంచి విడిచిపెట్టారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నాయకులపై శుక్రవారం సాయంత్రం నుంచే పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదంటూ కొందరికి ముందస్తు నోటీసులు ఇచ్చారు. కొందరు నాయకులు పోలీసుల కళ్లుగప్పి గుడివాడ చేరుకున్నారు.

పోలీసుల కళ్లుగప్పి...
* గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు శనివారం తెల్లవారుజామున ఆటో, ట్రాక్టర్లపై ప్రయాణించి గన్నవరం శివారు చేరుకున్నారు. అక్కడి నుంచి బైకుపై గుడివాడ వెళ్లారు. పల్నాడు ప్రాంతం నుంచి వెళ్లిన 30 వాహనాల్ని పోలీసులు మధ్యలో ఆపేశారు. అయినా 100 వాహనాలు వేర్వేరు మార్గాల్లో గుడివాడ చేరుకున్నాయి. యరపతినేనితో కలసి 500 మంది పాదయాత్రలో పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి కారు, ఆటో ఆర్టీసీ బస్సులు మారుతూ గుడివాడ పాదయాత్రలో పాల్గొన్నారు.

* చింతమనేని ప్రభాకర్‌ను పెదవేగి మండలం దుగ్గిరాలలో ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఉదయపు నడకకు వెళ్లి వచ్చిన చింతమనేనికి నోటీసులు ఇచ్చేందుకు త్రీటౌన్‌ సీఐ ప్రయత్నించారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, వ్యక్తిగత పనులున్నాయని చెప్పి నోటీసు తీసుకోవడానికి చింతమనేని నిరాకరించారు. అనంతరం భీమవరంలో పార్టీ సమావేశం ముగించుకుని పాదయాత్రకు బయల్దేరారు. అప్పటికే గుడివాడ చేరుకున్న ఏలూరు పోలీసులు.. బందరు రోడ్డులో బైకుపై వెళుతున్న చింతమనేనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చింతమనేని వెనుక కూర్చోగా, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి పోలీసులకు దొరక్కుండా వేగంగా పోనిచ్చారు.

అడ్డగించి... అదుపులోకి
* గన్నవరం నుంచి గుడివాడ బయల్దేరిన తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని పుట్టగుంట దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు గన్నవరం స్టేషన్‌కు తరలించారు.

* కైకలూరు మండలం ఆటపాకలోని తెదేపా కార్యాలయం నుంచి బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను, పార్టీ నాయకుల్ని పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. 

* తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, ఆయన అనుచరుల్ని కంకిపాడు సమీపంలోని దావులూరు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావును గుడివాడకు ఐదు కి.మీ.ల దూరంలో పోలీసులు అడ్డుకున్నారు. 

పోలీసులు గుడివాడకు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కంకిపాడు మండలంలోని పునాదిపాడు కాటన్‌సర్కిల్‌, దావులూరు టోల్‌గేట్‌ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి 40 కి.మీ.ల దూరంలో బందోబస్తు పేరుతో ఈ వేధింపులేమిటని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని