సంక్షిప్త వార్తలు (16)

‘రాచరిక వ్యవస్థలా కాళ్లు పట్టుకోవాలని కించపరచడం తగదు. మనం ఏ వ్యవస్థలో ఉన్నాం...’ అని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ప్రశ్నించారు.

Updated : 29 Nov 2022 06:40 IST

కాళ్లు పట్టుకోవాలా.. ఏ వ్యవస్థలో ఉన్నాం?

లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ

విజయనగరం గంటస్తంభం, న్యూస్‌టుడే: ‘రాచరిక వ్యవస్థలా కాళ్లు పట్టుకోవాలని కించపరచడం తగదు. మనం ఏ వ్యవస్థలో ఉన్నాం...’ అని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ప్రశ్నించారు. విజయనగరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదవులు, అధికారం కోసం దిగజారే కొందరు రాజకీయ నాయకుల ప్రవర్తనను పాలనా వ్యవస్థకు అంటగట్టవద్దని స్పష్టం చేశారు.


కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు

పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీని భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, వివిధ ప్రజా సమస్యలపై అంశాల వారీగా కలిసి వచ్చే వారితో పోరాటం చేస్తామని తెలిపారు.


బహిష్కరించిన సర్పంచి

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి పంచాయతీ వెన్నాదేవిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని దళితుడైన ఆ గ్రామ సర్పంచి చెరుకూరి వన్నూరు (వైకాపా) బహిష్కరించారు. మంత్రి అంబటి రాంబాబు గ్రామంలో పర్యటిస్తున్నప్పటికీ ఆయన ఇంటికే పరిమితమయ్యారు. గ్రామ పాలనలో స్థానిక నాయకుల జోక్యం పెరిగిందంటూ ఆయన ముఖం చాటేశారు. విషయం మంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ స్పందించలేదని కొందరు దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తంచేశారు.


తెదేపా బీసీ సాధికార సమితి ఏర్పాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  తెదేపా బీసీ సాధికార సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీరంకి గురుమూర్తిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం నియమించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కొనసాగుతున్నారు. అలాగే వివిధ జిల్లాల నుంచి ఆయా సామాజిక వర్గాలకు చెందిన 121 మందిని సమితి రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. వివిధ బీసీ కులాలకు చెందిన 82 మందిని లోక్‌సభ నియోజకవర్గ బాధ్యులుగా నియమించారు.


ఒక్కో అడ్డంకిని అధిగమిస్తున్నాం..

మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి

ఈనాడు, అమరావతి: ‘సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో మూడు రాజధానులకు అడ్డంకిగా ఉన్న కేసులన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమిస్తాం. అమరావతిలో కొట్టేసిన భూములను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు బినామీ రైతులు, క్లయింట్లను సృష్టించి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. ఆయనకు సొంత, స్వార్థ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు’ అని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు.


రాయలసీమకు మళ్లీ అన్యాయమే

భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కర్నూలు..న్యాయరాజధాని అని సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమకు మళ్లీ అన్యాయమే జరిగిందని సోమవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘హైకోర్టు అమరావతిలో కావాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పిన మాటల అర్థం, పరమార్ధం ఏమిటో రాయలసీమ ప్రజలకు వైకాపా నాయకులు చెప్పాలి. రాయలసీమ ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు’ అని ఆయన ప్రశ్నించారు.


మూడు రాజధానులకు మద్దతుగా తీర్పు: మాదిగాని గురునాధం

గుంటూరు, న్యూస్‌టుడే: కాలపరిమితితో రాజధాని అమరావతిని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని బహుజన పరిరక్షణ సమితి నాయకుడు, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు. సీడ్‌ యాక్సిస్‌ రహదారిపై తాళ్లాయపాలెం కూడలి వద్ద ఏర్పాటు చేసిన మూడు రాజధానుల శిబిరంలో సోమవారం ఆయన మాట్లాడారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, రానున్న రోజుల్లో న్యాయస్థానాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.


రాజధాని మార్పుపై పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉంటుంది: సుజనా చౌదరి

ఈనాడు, దిల్లీ: రాజధాని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఈ విషయంలో పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాజధాని విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు రాష్ట్ర ప్రజలను నష్టపర్చేలా ఉన్నాయని విమర్శించారు. రాజధాని మార్చే అంశం శాసనసభకు లేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాజధాని విషయంలో పార్లమెంట్‌ నుంచి ఒక్కసారే శాసనసభకు అధికారం వస్తుంది. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారదు. నెల రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేయాలనే అంశంపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని మార్చాలంటే తిరిగి పార్లమెంట్‌కు వచ్చి మార్పులు చేయాల్సి ఉంటుంది. సర్వే ఆఫ్‌ ఇండియా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గతంలో మ్యాప్‌ ప్రింట్‌ చేసింది...’ అని పేర్కొన్నారు.


విచ్చలవిడిగా డ్రగ్స్‌.. ఏరులై పారుతున్న మద్యం: తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్‌, మద్యం ఏరులై పారుతోందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆరోపించారు. సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో వేర్వేరుగా జరిగిన తెదేపా మహిళా విభాగం, మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నేతల సమీక్ష, మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, గత ఆరేళ్లలో మద్యం అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని కాసాని విమర్శించారు. తెదేపా సభ్యత్వాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి 300 మంది సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీరి నుంచి ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి 14 మందిని నియమిస్తామన్నారు. గతంలో తెదేపాను వీడి వెళ్లిన వారంతా తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోత్స్న, అజ్మీరానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి విద్యుదుత్పత్తి కేంద్రంతో ప్రజలపై భారం: పొన్నాల

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: యాదాద్రి విద్యుదుత్పత్తి కేంద్రంతో రాష్ట్ర ప్రజలపై మరింత భారం పడనుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. దోపిడీ కోణంలో, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికే సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారని ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీళ్లు, బొగ్గు లేనిచోట యాదాద్రి విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం డిస్కంల నుంచి సుమారు రూ.4.50లకు యూనిట్‌ చొప్పున విద్యుత్‌ కొనుగోలు చేస్తోందని, యాదాద్రి ప్లాంట్‌లో ఒక యూనిట్‌ ఉత్పత్తికి రూ.9.90లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. 4 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో రూ.29 వేల కోట్ల అంచనాతో మొదలుపెట్టిన యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ వ్యయం ఇప్పటికే రూ.40వేల కోట్లు దాటిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా పునర్విభజన చట్టంలో ప్రతిపాదించిన ఎన్టీపీసీని కేంద్రం మొదలుపెట్టిందని, దాన్ని పూర్తి చేసేలా కేసీఆర్‌ ఎందుకు ఒత్తిడి తేవడం లేదని పొన్నాల ప్రశ్నించారు.


ఫులే బాటలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా ఫులే చూపిన మార్గంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలో బీసీల అభ్యున్నతికి కృషి చేస్తోందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఫులే వర్ధంతి సందర్భంగా సోమవారం మంత్రి ఆయనకు నివాళులర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో 310 బీసీ గురుకులాలను మహాత్మా జ్యోతిబా ఫులే పేరిట ఏర్పాటు చేశామని, బీసీ బిడ్డలకు విదేశీ విద్య కోసం రూ.20 లక్షల సాయం అందిస్తున్నామని చెప్పారు. రాజధానిలో రూ.కోట్ల విలువైన 87 ఎకరాలను 41 బీసీ కులాలకు కేటాయించామన్నారు.


అటవీ పరిరక్షణ నియమాలను వెనక్కు తీసుకోవాలి: కూనంనేని

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: అటవీ భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘అటవీ పరిరక్షణ నియమాలు -2022’ను తక్షణమే విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన వ్యతిరేక విధానాలను అమలుచేయడానికే గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించారని ఆరోపించారు. ఈ సమావేశంలో గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి రమావత్‌ అంజయ్యనాయక్‌, నాయకులు జువారి రమేష్‌, భూక్యా శ్రీనివాస్‌, శంకర్‌, స్వరూప, దస్రూ తదితరులు పాల్గొన్నారు.


భారాసతోనే దేశంలో గుణాత్మక మార్పు
ఖతర్‌లో తెరాస ప్రవాసశాఖ తీర్మానం

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్రసమితి పార్టీ ద్వారానే దేశంలో గుణాత్మక మార్పు సంభవిస్తుందని, దీనికి ప్రవాసుల తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఖతర్‌ తెరాస ప్రవాసశాఖ తీర్మానించింది. తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త బిగాల మహేశ్‌ ఆధ్వర్యంలో సోమవారం దోహాలో తెరాస ఆ దేశశాఖ సమావేశం జరిగింది. తెరాస ఖతర్‌ శాఖ అధ్యక్షుడు శ్రీధర్‌ అబ్బాగౌని ఆధ్వర్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్‌, భాజపాలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో, దేశాన్ని అభివృద్ధిపథాన నడపడంలో దారుణంగా విఫలమయ్యాయన్నారు. ఇప్పటికీ దేశంలో కరెంటు లేని గ్రామాలు, మంచినీరు, రహదారులకు నోచుకోని పల్లెలు, ఆవాస ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. తెలంగాణ అద్భుత ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, ఆ అభివృద్ధిని దేశమంతటికీ విస్తరించాలనే కాంక్షతోనే కేసీఆర్‌ భారత్‌ రాష్ట్రసమితి జాతీయ పార్టీకి రూపకల్పన చేశారన్నారు. పార్టీపై ప్రకటన వెలువడిన అనంతరం భారాస విజయవంతానికి ప్రతి ప్రవాసుడు కృషి చేయాలని మహేశ్‌ కోరారు.


మహాత్మా ఫులేకు ‘భారతరత్న’ ఇవ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

ఈనాడు, దిల్లీ: మహాత్మా జ్యోతిబా ఫులేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని, జాతీయ పార్కులు, ప్రాజెక్టులు, స్టేడియాలు, విమానాశ్రయాలకు ఆ మహనీయుని పేరు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఫులే వర్ధంతి సందర్భంగా దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి జాజుల, ఆ సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫులే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ పార్లమెంటు ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.  10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించడంతో రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్‌కు కాలం చెల్లినట్లయిందని, ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను  50 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు.  సంఘం నాయకులు ప్రేమ్‌కుమార్‌, నాగేశ్వరరావు, బాబూలాల్‌, ప్రసాద్‌, చెన్నకేశ్వర్‌, అనిల్‌, భరత్‌  పాల్గొన్నారు.


జ్యోతిరావు ఫులేకు కాంగ్రెస్‌ నేతల నివాళి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు సోమవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్‌,  పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు టి.కుమార్‌రావు, జి.నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈడీ పరిధులు దాటుతోంది
ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ విమర్శ

రాయ్‌పుర్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)పై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ విమర్శలు గుప్పించారు. ఈడీ తన పరిధులు దాటుతోందని, రాష్ట్రంలో ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దర్యాప్తు పేరుతో ప్రజలను హింసించి, వేధింపులకు గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలపై దాడిచేసి, బెదిరింపులకు పాల్పడుతోందని ఈడీపై వరుస ట్వీట్లతో విరుచుకుపడిన మరుసటి రోజే బఘేల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్‌ అధికారి సమీర్‌ విష్ణోయ్‌, ఇద్దరు బొగ్గు వ్యాపారులు సహా నలుగురిని ఈడీ ఇటీవల అరెస్టు చేసింది. ఈడీ చర్య గురించి అడిగినప్పుడు బఘేల్‌.. ‘‘ఈడీ తన పరిధిని మించి ప్రవర్తిస్తోంది. రాడ్లతో ప్రజలను కొట్టినట్లు సమాచారం ఉంది. తాగడానికి నీరు ఇవ్వలేదు. కొన్ని గంటల పాటు కూర్చోనివ్వలేదు. నిద్రించడానికి సైతం అనుమతివ్వలేదు. ఇలాంటి అమానవీయ ప్రవర్తనను ఏ ప్రభుత్వం, న్యాయస్థానం గానీ అనుమతిస్తుందని నేను అనుకోను’’ అని పేర్కొన్నారు.  


హరియాణా జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో భాజపాకు దెబ్బ

చండీగఢ్‌: హరియాణా జిల్లా పరిషత్‌ ఎన్నికలు పాలక భాజపాకు షాక్‌నిచ్చాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకోవడం విశేషం. 411 జిల్లా పరిషత్‌ వార్డులలో 250 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. భాజపా సొంత గుర్తుపై పోటీ చేసిన 100 వార్డులకుగానూ 22 సీట్లను మాత్రమే గెలుచుకోగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ 100 వార్డుల్లో పోటీ చేసి 15 స్థానాల్లో విజయం సాధించింది. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ పార్టీ పోటీ చేసిన 72 సీట్లలో 14 సీట్లను గెలుచుకుంది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్‌, జన నాయక్‌ జనతా పార్టీ దూరంగా ఉన్నాయి. 2024లో జరగనున్న శాసనసభ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని తాజా ఫలితాలు భాజపాకు హెచ్చరికలు జారీ చేసినట్లయ్యిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  


మేఘాలయలో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

షిల్లాంగ్‌: మేఘాలయలో అధికార ఎన్‌పీపీ నుంచి ఇద్దరు, విపక్ష తృణమూల్‌ నుంచి ఒకరు.. మొత్తం ముగ్గురు శాసనసభ్యులు సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఆయా పార్టీల ప్రాథమిక సభ్యత్వాలనూ వదులుకున్నారు. వీరు ముగ్గురూ త్వరలో భాజపాలో చేరనున్నారు. వీరి రాజీనామాలను స్పీకర్‌ వెంటనే ఆమోదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని