పోర్టుల నిర్మాణానికి మరో రూ.3,950 కోట్ల రుణం

పోర్టుల నిర్మాణానికి ఏపీ మారిటైం బోర్డు మరో రూ.3,950 కోట్ల రుణాలు తీసుకోబోతోంది. ఇప్పటికే కాకినాడ, రామాయపట్నం పోర్టుల కోసం రూ.3,579 కోట్ల రుణాలు తీసుకుంది.

Published : 23 Dec 2022 05:29 IST

ఏపీ మారిటైం బోర్డు నిర్ణయం
ఇప్పటికే రూ.3,579 కోట్ల అప్పులు

ఈనాడు, అమరావతి: పోర్టుల నిర్మాణానికి ఏపీ మారిటైం బోర్డు మరో రూ.3,950 కోట్ల రుణాలు తీసుకోబోతోంది. ఇప్పటికే కాకినాడ, రామాయపట్నం పోర్టుల కోసం రూ.3,579 కోట్ల రుణాలు తీసుకుంది. రాష్ట్రంలో ప్రతిపాదించిన రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల అభివృద్ధికి రూ.13 వేల కోట్లు అవసరం. ఇందులో ఇప్పటికే తీసుకున్నవి పోను మరో రూ.9,500 కోట్ల రుణాల కోసం వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎలాంటి సహకారం అందే అవకాశం లేకపోవడంతో.. రుణాలు అందితేనే ప్రాజెక్టులు ముందుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీనికోసం భూములను తనఖాగా పెట్టడంతో పాటు.. ప్రస్తుతం మారిటైం బోర్డుకు ఉన్న ఆదాయ వనరులు, పోర్టుల నిర్మాణం పూర్తయ్యాక వచ్చే ఆదాయాన్ని హామీగా చూపుతోంది.

ఆదాయం హామీ.. భూముల తనఖా!

ఏటా సరకు రవాణా సేవల ద్వారా ఏపీ మారిటైం బోర్డుకు సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని, ఇందులో సిబ్బంది జీతాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు పోనూ సుమారు రూ.200 కోట్లు మిగులుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం నుంచి బ్యాంకులకు వాయిదాలను చెల్లిస్తామని హామీ ఇచ్చామని, రుణం చెల్లించలేని పక్షంలో హామీ కోసం మారిటైం బోర్డు పేరిట ఉన్న ఆస్తులను తనఖా పెడుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులు రూ.2,634.65 కోట్లతో నిర్వహించేలా బిడ్‌లను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. గుత్తేదారు సంస్థలకు బిల్లులు చెల్లించడానికి ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంకు, పంజాబ్‌ సింధ్‌ బ్యాంకు, ఐఐఎఫ్‌సీఎల్‌ కలిపి  భూములను తాకట్టు పెట్టుకుని రూ.2,079 కోట్లు రుణంగా ఇచ్చాయి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను జనవరిలో ప్రారంభించాలని బోర్డు భావిస్తోంది. పోర్టు మొదటి దశ నిర్మాణానికి రూ.5,800 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.3,950 కోట్ల రుణాన్ని తీసుకునే ప్రక్రియ కొలిక్కి వచ్చింది. పోర్టు ప్రతిపాదిత భూములను ఇందుకు తాకట్టు పెట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని