బీఈడీలో 10వేల సీట్లకు కోత

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీలో 10వేల సీట్లకు ఉన్నత విద్యాశాఖ కోత విధించింది. గతేడాది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 34,760 సీట్లు ఉండగా.. ఇప్పుడు 23,970కి తగ్గించింది.

Published : 26 Jan 2023 05:00 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీలో 10వేల సీట్లకు ఉన్నత విద్యాశాఖ కోత విధించింది. గతేడాది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 34,760 సీట్లు ఉండగా.. ఇప్పుడు 23,970కి తగ్గించింది. బీఈడీ కౌన్సెలింగ్‌ బుధవారం నుంచి ప్రారంభం కావడంతో కళాశాలలు, సీట్ల జాబితాను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో పెట్టింది. కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులు, సౌకర్యాలు లేకపోవడంతో ఈ కోత విధించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 411 కళాశాలలు కౌన్సెలింగ్‌లో ఉండగా.. ఈసారి 291 మాత్రమే ఉన్నాయి. ఒక్క నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోనే 48 కళాశాలలకు అనుమతులు నిలిపివేశారు. అత్యధికంగా బీఈడీ కళాశాలలు ఈ వర్సిటీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 411 కళాశాలలు ఉంటే ఈ ఒక్క వర్సిటీ పరిధిలోనే 175 కళాశాలలు ఉన్నాయి. అధ్యాపకులు రెండు, మూడు కళాశాలల్లో పని చేస్తున్నారనే కారణంతోనే ఎక్కువ కళాశాలలకు అనుమతులు నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో అధ్యాపకుల వివరాలు తప్పుగా నమోదు కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయాలకు మరోసారి వివరాలు సమర్పిస్తున్నాయి. వీటిని రెండో విడత కౌన్సెలింగ్‌లో పెట్టేందుకు అనుమతించాలని కోరుతున్నాయి. మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడం, ప్రైవేటులో జీతాలు తక్కువగా ఉండడంతో ఏటా బీఈడీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. కన్వీనర్‌ కోటా సీట్లలో 30శాతం కూడా నిండడం లేదు.  చాలా కళాశాలలు ఇతర రాష్ట్రాల విద్యార్థులతోనే కొనసాగుతున్నాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని