జేఈఈ మెయిన్‌ తుది కీ విడుదల.. హైదరాబాద్‌కు చెందిన కౌండిన్యకు 300కి 300 మార్కులు

జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది.

Updated : 25 Apr 2023 11:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బీటెక్‌ సీట్ల కోసం పేపర్‌-1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీని కొద్దిరోజుల క్రితం వెల్లడించిన ఎన్‌టీఏ దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తుది కీని వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రాథమిక కీలో ఇచ్చిన జవాబుల్లో మొత్తం 24 ప్రశ్నలకు సమాధానాలను మార్చినట్లు శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. గత జనవరి, తాజా పరీక్షల్లో వచ్చిన స్కోర్‌లో ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ర్యాంకులు ఇస్తారు. రాత్రి 10 గంటల వరకు మాత్రం వాటిని ప్రకటించలేదు.  హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్‌ కౌండిన్య 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్‌ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతానని కౌండిన్య తెలిపాడు.

30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌

జేఈఈ మెయిన్‌లో కనీస కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. వారు ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మే 7వ తేదీ తుది గడువు. జూన్‌ 4వ తేదీన జరిగే పరీక్ష ఫలితాలను జూన్‌ 18వ తేదీన వెల్లడిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని