సంక్షిప్త వార్తలు(5)

ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 3న నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ గోపాలరాజు తెలిపారు.

Updated : 01 Jun 2023 05:33 IST

3న ఆర్జీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్‌

నూజివీడు, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 3న నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ గోపాలరాజు తెలిపారు.


బీమా పథకం కొనసాగిస్తూ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని ఈ ఏడాది జులై 1 నుంచి మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీమా సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూన్‌ 30తో పథకం గడువు ముగియనుండటంతో మరో ఏడాది పొడిగించారు.


కౌలు రైతుల సమస్యలపై యాత్రలు
12న సీసీఎల్‌ఏ కార్యాలయం వరకు పాదయాత్ర

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: రైతుల ఆత్మహత్యలలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు పేర్కొన్నారు. బుధవారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలో తలపెట్టిన యాత్రలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. జూన్‌ 5న అనకాపల్లి నుంచి,  జూన్‌ 7న నెల్లూరు నుంచి జీపు యాత్రలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. జూన్‌ 10వ తేదీన కృష్ణాజిల్లా తోట్లవల్లూరులో కౌలు రైతుల పాదయాత్ర ప్రారంభం అవుతుందని, అక్కడే ప్రారంభ సభ కూడా జరుగుతుందని తెలిపారు. జూన్‌ 11న వల్లూరు పాలెం నుంచి పాదయాత్ర కొనసాగి...12న విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీసీఎల్‌ఏ కార్యాలయం (మంగళగిరి) వరకు కొనసాగుతుందన్నారు.


జలవనరుల సంరక్షణలో ఏపీకి మూడో ర్యాంకు: సీఎస్‌

ఈనాడు, అమరావతి: జలవనరుల సంరక్షణ, నిర్వహణలో రాష్ట్రానికి మూడో ర్యాంకు దక్కిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మరో రాష్ట్రంతో కలిసి సంయుక్తంగా ఈ ర్యాంకు దక్కిందని కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ సమాచారం ఇచ్చారని వెల్లడించారు. కేంద్రం నాలుగో జాతీయ అవార్డులు (2022వ సంవత్సరం) తాజాగా ప్రకటించిందని తెలిపారు. ఉత్తమ కేటగిరీ రాష్ట్రం కింద అవార్డు దక్కడం ఇది రెండోసారి అని వివరించారు. జలవనరుల సంరక్షణకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వివిధ చర్యలు చేపట్టడంతో ఈ అవార్డు దక్కిందన్నారు.


తానా మహాసభలకు జగ్గీ వాసుదేవ్‌కు ఆహ్వానం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జులై 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు గౌరవఅతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొల్లూరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గౌరవఅతిథిగా హాజరయ్యేందుకు ఆయన సమ్మతి తెలిపినట్టు వెల్లడించారు.


పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో జూన్‌ 1 (గురువారం) నుంచి ప్రారంభం కావాల్సిన పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు పాలిటెక్నిక్‌ అడ్మిషన్స్‌-2023 కన్వీనర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ గడువును జూన్‌ 5 వరకు గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు. వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, సీట్ల కేటాయింపు, కళాశాలల్లో చేరికలు, తరగతుల ప్రారంభంపై త్వరలోనే కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తామన్నారు. ధ్రువపత్రాల పరిశీలన మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని